స్కూల్ ఫీజుల మాఫియా : ఓన్లీ క్యాష్ డిమాండ్ చేస్తున్న యాజమాన్యాలు

school-feesమధ్యతరగతి కుటుంబాలకు భారంగా మారుతున్నాయి నేటి చదువులు. వ్యాపార కేంద్రాలుగా విద్యాలయాలు మారటంతో సంపాదనలో సగం స్కూల్ ఫీజులకే సరిపోతుంది. ప్రైవేట్, కార్పొరేట్ మాఫియాను అడ్డుకోవాల్సిన విద్యాశాఖ కళ్లు మూసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రైవేట్ స్కూళ్ల దోపిడీ అడ్డగోలుగా జరుగుతుంది. రకరకాల పేర్లతో పేరెంట్స్ ను ఆకర్షిస్తూ.. ముక్కపిండి ఫీజులు వసూళ్లు చేస్తున్నాయి. బిజీ లైఫ్ లో తల్లిదండ్రులు ఇద్దరూ జాబ్ చేస్తుండటంతో.. పిల్లలను ప్లే స్కూల్లో జాయిన్ చేస్తున్నారు. ఇదే అదునుగా భావించి ఫ్రీ ఫ్రైమరీకి 30 నుంచి 50 వేలకుపైగా ఫీజులు దండుకుంటున్నాయి. LKG, UKG అయితే 50 వేలు, ఆపై చదువులకు లక్షల్లోనే ఫీజులు వసూలు చేస్తున్నాయి ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్ధలు.

స్టూడెంట్స్ కి బంపర్ ఆఫర్ గా యునిఫామ్స్, షూ, బుక్స్, స్టేషనరిని అమ్ముతున్నారు. నాణ్యమైన విద్యను అందించాల్సిన విద్యాలయాలు.. దోపిడికి వ్యాపార కేంద్రాలుగా మారుతున్నాయని ఆందోళన చెందుతున్నారు తల్లిదండ్రులు. నగదు రహితం అంటూ సర్కారు ప్రచారం చేస్తుంటే.. ప్రైవేట్ స్కూల్స్ మాత్రం ఓన్లీ క్యాష్ అంటున్నాయి. ట్యూషన్ ఫీజును మాత్రమే చెక్స్, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా తీసుకుంటున్నారు. డొనేషన్లు, వార్షిక ఫీజు, ఇతర చెల్లింపులను నగదు రూపంలోనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విధానం వల్ల డబ్బు అంతా బ్లాక్ మనీ రూపంలోకి మారుతుందని.. ఇదో మాఫియా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పేరంట్స్. ఏటా అడ్డగోలు ఫీజులు పెంచుతున్నా.. ఏ విషయంలోనూ సర్కార్ నియంత్రణ లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఫీజుల నియంత్రణపై గతంలో తిరుపతిరావు కమిటీ వేసింది సర్కార్. తల్లిదండ్రులకు ఫీజుల భారం ఎక్కువగా ఉందని 9 నెలల తర్వాత కమిటీ నివేదిక తేల్చింది. కార్పొరేట్ మాఫియాపై సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నారు పేరెంట్స్ అసోసియోషన్. రాష్ట్రవ్యాప్తంగా 12 వేల స్కూళ్లల్లో ఏటా ఫీజులు పెంచుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరమ్ అధ్యక్షుడు షబ్బీర్ అలీ అన్నారు. కమీషన్లతో స్టేషనరీ, యూనిఫామ్స్, బుక్స్ అమ్ముతున్న విద్యాశాఖ నోరుమెదపటం లేదన్నారు. ప్రైవేట్ స్కూల్స్ వసూలు చేస్తున్న ఫీజులపై విద్యాశాఖ నియంత్రణ ఉండాలని కోరుతున్నారు తల్లిదండ్రులు, విద్యావేత్తలు.

Posted in Uncategorized

Latest Updates