స్కెచ్ వేస్తే కోట్లే : ఎర్రచందనం స్మగ్లింగ్ లో టీవీ ఆర్టిస్ట్

బతుకుదెవరు కోసం హైదరాబాద్ వచ్చాడు.. సినీ స్టూడియోల చుట్టూ తిరిగాడు.. అయినవాళ్లను.. కానివాళ్లను అవకాశాల కోసం కాళ్లావేళ్లా పడ్డాడు. కొన్ని సీరియల్స్ తోపాటు.. ఓ టీవీలో ప్రసారం అయ్యే జబర్ధస్త్ ప్రోగ్రాంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశం సంపాదించాడు. అందరితో మంచిగా ఉంటూ.. పొట్టపోసుకున్నాడు. మూడేళ్ల క్రితం కథ ఇది.. ఇప్పుడు సీన్ మారింది. అతనే పెద్ద ఫైనాన్షియర్ అయ్యాడు. మూడేళ్లలో కోట్లకు కోట్లు సంపాదించాడు. ఇదంతా ఎలా వచ్చింది.. ఎక్కడి నుంచి వచ్చింది అంటే.. ఎర్రచందనం స్మగ్లింగ్. ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ స్మగ్లర్ గా మారాడు అన్న విషయం తెలుసుకుని పోలీసులు, సినీ ఇండస్ట్రీ షాక్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఏపీ రాష్ట్రం తిరుపతికి చెందిన ఇతను.. టీవీ సీరియల్స్, జబర్దస్త్ షోలో ఆర్టిస్ట్ గా నటించేవాడు. దీంతో వచ్చిన సెలబ్రిటీ హోదాతో ఎర్రచందనం వ్యాపారంలోకి దిగాడు. అప్పటికే ఈ స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తులతో చేతులు కలిపాడు. ఏడుకొండలు అయిన శేషాచలంలోని ఎర్రచందనం చెట్లను నరికి ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలించడం మొదలుపెట్టాడు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర స్మగ్లర్లు.. పెద్ద ముఠాలతో పరిచయాలు పెంచుకున్నాడు. మూడేళ్లలోనే కోట్ల రూపాయలు సంపాదించాడు. దీనిపై టాస్క్‌ఫోర్స్‌ అధికారులకు పక్కా సమాచారం వచ్చింది. ఆధారాలు లభించాయి. అతనిపై 20 కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్నాడని తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు చెబుతున్నారు.

జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయ్యి.. కామెడీ యాక్టర్ గా నటిస్తూనే.. ఇటీవల హీరోగా నటించి, విడుదల అయిన సినిమాకి ఫైనాన్స్ కూడా చేసినట్లు పోలీసులు గుర్తించారు. చిన్న చిన్న సినిమాలకు కూడా ఫైనాన్స్ ఇస్తూ వడ్డీలకు తిప్పుతున్నాడని చెబుతున్నారు తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఇతనితోపాటు కొందరు డాక్టర్లు, ఇంజినీర్లు, ప్రైవేట్ కంపెనీల్లో పెద్ద హోదాల్లో పని చేసే ఉద్యోగులు కూడా ఇతని ఎర్ర చందనం స్మగ్లింగ్ లో భాగస్వామ్యం ఉన్నట్లు గుర్తించారు. అయితే అన్నీ ఆధారాలు దొరికిన తర్వాత వీరి పేర్లు, వివరాలు వెల్లడిస్తాం అంటున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఇతనితోపాటు మరో ఇద్దరు క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఈ స్మగ్లింగ్ ద్వారా కోట్ల రూపాయలు సంపాదించినట్లు సమాచారం. ఈ ప్రధాన నిందితుడిపై 2017 నవంబర్ నెలలోనే కేసు నమోదు చేసినట్లు చెబుతున్నారు. ఈ విషయంలో ఇప్పుడు సినీ ఇండస్ట్రీతోపాటు అతనితో సంబంధం ఉన్న నటులు, ఆర్టిస్టుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

Posted in Uncategorized

Latest Updates