స్పైడర్ మ్యాన్ లా వచ్చాడు : నాలుగో అంతస్తు బాల్కనీలో చిన్నారిని కాపాడాడు

gussamaఏదైనా ప్రమాదం జరిగినప్పుడు.. ఎలా రియాక్ట్ కావాలో చాలా మందికి తెలియదు. తెలిసే లోపే జరగాల్సింది జరిగిపోతుంది. కొందరు మాత్రం సెకన్లలోనే రియాక్ట్ అవుతారు. తెగువతో ముందుకెళ్తారు. పారిస్ లోనూ అదే జరిగింది. మాలికి చెందిన 22 ఏళ్ల మమౌడూ గస్సామా.. ఇప్పుడు సూపర్ హీరో అయ్యాడు. ప్రాణాలకు తెగించి ఓ చిన్నారిని కాపాడి..శభాష్ అనిపించుకున్నాడు గస్సామా.

నార్త్ పారిస్ లో ఈ సంఘటన జరిగింది. ఓ నాలుగేళ్ల బాబు.. బిల్డింగ్ నాలుగో అంతస్తు బాల్కనీ నుంచి కిందకు వేలాడటాన్ని కొందరు చూశారు. ఫైర్  సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. బాల్కనీ అంచు నుంచి వేలాడుతున్న ఆ చిన్నారి.. ఎప్పుడైనా కిందపడి పోయేలా పరిస్థితి. కింద జనం అరుపులు. ఆ టైంలో అక్కడే ఉన్న మమౌడూ గస్సామా.. క్షణం లేటు చేయకుండా ముందుకు దూకాడు. గబగబా భవనం ఎక్కి ఆ పిల్లాడిని కాపాడే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో పక్క ప్లాట్ లోని ఓవ్యక్తి.. ఆచిన్నారి జారి కిందపడకుండా ఒకచేత్తో అదిమి పట్టుకున్నాడు. నిమిషం వ్యవధిలోనే పైకి ఎక్కేసిన గస్సామా.. ఆ బాబును అమాంతం లాగేసి ప్రాణాలు కాపాడాడు.

గస్సామా వీరోచితానికి పారిస్ జనం ఫిదా అయ్యారు. ప్రశంసలతో ముంచెత్తారు. పారిస్ మేయర్ నుంచి సామాన్యుల వరకు అందరూ.. గస్సామా సాహాసాన్ని మెచ్చుకుంటున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్  మేక్రన్ ఏకంగా తన  అధ్యక్ష భవనం ఎలీసీకి పిలిపించుకున్నారు. సోషల్  మీడియాలో అతన్ని హీరోగా, స్పైడర్  మ్యాన్ గా నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. వాస్తవానికి గస్సామా.. మాలి నుంచి పారిస్ లో స్థిరపడదామని వచ్చాడు. ఈ సాహసంతో గస్సామా కు ఫ్రాన్స్ ఫౌరసత్వం ఇవ్వాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంలో గస్సామాకు తోడ్పాట్లు అందిస్తామని అధికారులు కూడా చెబుతున్నారు. గస్సామా రెస్క్యూ ఫీట్.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Posted in Uncategorized

Latest Updates