స్పోర్ట్స్ వర్సిటీకి లోక్ సభ ఆమోదం

అంత‌ర్జాతీయ‌ క్రీడాకారుడిని స్పోర్ట్స్ వర్సిటీకి ఛాన్సలర్‌ గా నియమిస్తామన్నారు క్రీడా మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్. శుక్రవారం (ఆగస్ట్-3) లోక్‌ సభలో జాతీయ క్రీడా విశ్వవిద్యాలయ బిల్లును ఆమోదించారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా క్రీడా మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ మాట్లాడారు. వర్సిటీ సభ్యుల్లో ప్లేయర్లూ ఉంటారన్నారు. క్రీడలు రాష్ట్రం పరిధిలోకి వస్తాయని, గతంలో UPA ప్రభుత్వం స్పోర్ట్స్ కోడ్‌ ను తీసుకువచ్చిందని, అయితే రాష్ర్టాలు ఆ నియమావళిని అమలు చేయడం లేదన్నారు. సాధారణంగా వర్సిటీలు క్రీడా పోటీలను నిర్వహిస్తుంటాయని, అయితే ఆ వర్సిటీలు క్రీడాస్ఫూర్తిని పెంపొందించే ప్రక్రియను అలవరుచుకోవాలన్నారు మంత్రి.

ప్రపంచవ్యాప్తంగా క్రీడలు.. 80 బిలియన్ల డాలర్ల పరిశ్రమగా మారిందన్నారు. ఇలాంటి సందర్భాల్లో క్రీడలపై శ్రద్ధ చూపాలన్నారు. రీసర్చ్, అడ్మినిస్ట్రేషన్, అంపైరింగ్, ట్రైనింగ్ లాంటి అనేక అంశాలపై స్పోర్ట్స్ యూనివర్సిటీ దృష్టి పెడుతుందని తెలిపారు మంత్రి రాజ్యవర్థన్. ఆస్ట్రేలియాకు చెందిన కాన్‌ బెరా వర్సిటీతో ఒప్పందం కుదుర్చుకున్నామని, మణిపూర్‌ లో క్రీడా వర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates