స్వచ్ఛ్‌ భారత్‌: మంత్రి బహిరంగ మూత్ర విసర్జన!

రాజస్థాన్ : స్వచ్ఛ్‌ భారత్‌ కోసం దేశ ప్రజలంతా  కృషి చేయాలని ఓవైపు  ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు నివ్వడంతో పాటు స్వయంగా చీపురు చేతపట్టి క్లీన్ అండ్ గ్రీన్ కు దిగుతున్నారు. మరోవైపు ఆయన పార్టీకే చెందిన రాజస్థాన్ మంత్రి శంభు సింగ్ ఖటేసర్ మాత్రం బహిరంగ మూత్ర విసర్జన చేశారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆ రాష్ట్ర సీఎం వసుంధరా రాజే  పోస్టర్‌ పక్కనే శంభు సింగ్ ఖటేసర్.. మూత్ర విసర్జన చేసినట్టుగా ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్  అవుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన ఓ భారీ బహిరంగ సభకు హాజరయ్యే క్రమంలో శంభు సింగ్‌ బహిరంగ మూత్ర విసర్జన చేసినట్టుగా జాతీయ మీడియా, సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి.

దీనిపై మీడియా ఆయన్ను వివరణ కోరగా.. సీఎం పోస్టర్‌ పక్కన మూత్ర విసర్జన చేయలేదని, ఓ గోడపక్కన చేశానని, అక్కడ ఎలాంటి పోస్టర్‌ లేదని తెలిపారు. ప్రధాని మోడీ పిలుపునిచ్చిన స్వచ్ఛ్‌ భారత్‌ ఉద్దేశం.. బహిరంగ మల విసర్జన చేయవద్దని కానీ…. మూత్ర విసర్జన కాదని అన్నారు. మల,మూత్ర విసర్జనలు రెండు వేర్వేరన్నారు. బహిరంగ మల విసర్జనతో వ్యాధులొస్తాయని, కానీ మూత్ర విసర్జన వల్ల ఎలాంటి సమస్య ఉండదని తెలిపారు. తను ఈ పని చేసింది  చాలా విశాల ప్రాంతమని, అక్కడ జనావాసం లేకపోవడంతో అసలు సమస్యే ఉండదని ఈ రాజస్తాన్‌ మంత్రి అభిప్రాయపడ్డారు. ఆ రోజు ఉదయం నుంచి బిజీగా గడిపానని… దగ్గర్లో ఎక్కడా  టాయిలెట్స్‌ లేవని వివరణ ఇచ్చారు.

Posted in Uncategorized

Latest Updates