స‌రిహ‌ద్దులో చైనా బ‌ల‌గాల పెంపు.. రంగంలోకి దిగిన భార‌త ఆర్మీ

క‌రోనా క్రైసిస్ స‌మ‌యంలో పొరుగు దేశం చైనా ఉద్రిక్త‌త‌ల‌ను సృష్టించే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇటీవ‌ల స‌రిహ‌ద్దు ప్రాంతంలో చైనా ఆర్మీ దుందుడుకు వ్య‌వ‌హరిస్తోంది. ల‌ఢ‌ఖ్ ప్రాంతంలో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) దాటి భార‌త భూభాగంలోకి ప్ర‌వేశించి.. అది త‌మ ప్రాంత‌మంటూ భార‌త బ‌ల‌గాల‌తో చైనా సైనికులు తోపులాట‌కు దిగాయి. దీంతో స‌రిహ‌ద్దు ప్రాంతంలో ఉద్రిక్త‌త‌ల‌కు దారితీసింది. త‌ర‌చుగా ఇటువంటి దుశ్చ‌ర్య‌ల‌కు దిగుతున్న చైనా ఇప్పుడు ల‌ఢ‌ఖ్ స‌రిహ‌ద్దు ద‌గ్గ‌ర దాదాపు 5 వేల మంది సైనికుల‌ను మోహ‌రించింది. దౌల‌త్ బెగ్ ఓల్డీ స‌హా పలు ఏరియాల్లో చైనా ఆర్మీ సైనికుల‌ను పెట్టింది. ఈ నేప‌థ్యంలో భార‌త ఆర్మీ అప్ర‌మ‌త్త‌మైంది. స‌రిహ‌ద్దుల్లో చైనా ఆర్మీ మ‌న భూభాగంలోకి రాకుండా అడ్డుకునేందుకు రంగంలోకి దిగింది. భార‌త ఆర్మీ 81, 114 బ్రిగేడ్స్ ను వాస్త‌వాధీన రేఖ వెంట మోహ‌రిస్తోంది. భార‌త ఆర్మీ, ఐటీబీపీ బ‌ల‌గాల‌ను ల‌ఢ‌ఖ్ లోని ప‌లు ప్రాంతాల‌కు పంపుతోంది. ప్యాంగాంగ్ ట్సో లేక్ స‌హా మ‌రికొన్ని కీల‌క ప్రాంతాల‌కు చైనా ఆర్మీ భారీ వాహ‌నాల‌తో త‌ర‌లివ‌స్తున్న‌ట్లు తెలుస్తోంది. ఆయా ప్రాంతాల్లో భారత భూభాగం వైపుకు రోడ్లు నిర్మించే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని భారత ఆర్మీ వ‌ర్గాల ద్వారా స‌మాచారం అందుతోంది. ఈ నేప‌థ్యంలో అక్క‌డ చైనా ఆర్మీ టెంట్లు ఏర్పాటు చేసుకోవ‌డంపై మ‌న ఆర్మీతో పాటు భార‌త విదేశాంగ శాఖ అభ్యంత‌రాలు తెలిపింది. స‌రిహ‌ద్దు వెంట త‌ర‌చూ ఇరు దేశాల సైనికుల మ‌ధ్య ఫేస్ ఆఫ్ ఏర్ప‌డుతోంది. గ‌త వారంలో ల‌ఢ‌ఖ్ లోని నార్త్ ప్యాగాంగ్ వ‌ద్ద ఇరు దేశాల సైనికుల మ‌ధ్య స్టాండ్ ఆఫ్ జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో తోపులాట‌లు జ‌ర‌గ‌డంతో ప‌లువురు సైనికుల‌కు గాయాలు సైతం అయ్యాయి. ఇది ఇరు వైపులా సైనికులు పెట్రోలింగ్ లో ఒకే సారి ఎదురుప‌డిన స‌మ‌యంలో జ‌రిగిన ఘ‌ట‌న‌గా సైనిక వ‌ర్గాలు చెప్పాయి.

Latest Updates