హస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం : తారుమారైన శిశువులు

CHILD MISSప్రభుత్వ హస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల అప్పుడే పుట్టిన బిడ్డలను తారుమారు చేసిన ఘటన వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఈ విషయం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించగా..ఇప్పుడు అలాంటి సంఘటనే సంగారెడ్డి జిల్లా పటాన్‌ చెరు ప్రభుత్వ ఆస్పత్రిలో చోటు చేసుకుంది.

జిల్లాలోని జిన్నారం మండలం అండూర్‌ గ్రామానికి చెందిన శ్రీశైలం తన భార్య అర్చనను కాన్పుకోసం కోసం శనివారం (జూన్-23) పటాన్‌ చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అప్పటికే బొల్లారం గ్రామానికి చెందిన రమేశ్‌ గౌడ్‌ భార్య సరస్వతినీ ప్రసవం కోసమే చేర్పించారు. ఈ క్రమంలో సోమవారం(జూన్-25) ఉదయం డెలివరీ కోసం సరస్వతి, అర్చనను ఆపరేషన్‌ థియేటర్‌కు తీసుకెళ్లారు. డాక్టర్లు ముందుగా సర్వసతికి డెలివరీ చేయగా.. బాబు పుట్టాడు. అయితే వార్డుబాయ్‌ సరస్వతికి పుట్టిన బాబును పొరపాటున అర్చన కుటుంబీకులకు అందజేశాడు. కాసేపటి తర్వాత అర్చనకు పాప పుట్టింది.

పాపను అర్చన కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు తీసుకెళ్లగా జరిగిన పొరపాటు తెలిసింది. వైద్యాధికారులు కుటుంబ సభ్యులతో చర్చించి శిశువులు ఇద్దరికీ DNA పరీక్షలు చేయించాలని నిర్ణయించారు. పరీక్షల అనంతరం శిశువులను వారి తల్లిదండ్రులకు అప్పగిస్తామని తెలిపారు డాక్టర్లు. దీంతో శిశువుల తల్లిదండ్రులు ఆందోళనలో పడ్డారు. ఎవరిబిడ్డను వారికి ఇవ్వడంలో సిబ్బంది ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే గొడవకు శాశ్వత పరిష్కారం DNA పరిక్షలేనని.. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు హస్పిటల్ సూపరింటెండెంట్.

 

Posted in Uncategorized

Latest Updates