హాకీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ : ఆస్ట్రేలియాతో భారత్ మ్యాచ్

HOCKEYహాకీలో భారత్ సత్తా చాటింది. వరుసగా మన టీమ్ రెండోసారి చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం (జూన్-30) నెదర్లాండ్స్‌ తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌ ను భారత్ 1-1తో డ్రా చేసుకుంది. 47వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ ద్వారా మన్‌ దీప్ సింగ్ టీమ్‌ ఇండియాకు గోల్ అందించాడు. థియరీ బ్రింక్‌ మన్ (55వ ని.) నెదర్లాండ్స్ తరఫున ఏకైక గోల్ చేశాడు. టైటిల్ పోరుకు అర్హత సాధించాలంటే కనీసం డ్రా చేసుకున్న సరిపోయే పరిస్థితుల్లో బరిలోకి దిగిన భారత్ అన్ని రంగాల్లో ఆకట్టుకుంది. ఆరంభంలోనే వచ్చిన అవకాశాన్ని NV సునీల్ వృథా చేసినా.. డచ్ డిఫెన్స్‌ పై ఒత్తిడిని పెంచడంలో సఫలమైంది. మూడో నిమిషంలో హర్మన్‌ ప్రీత్ కొట్టిన బలమైన హై ఫ్లిక్‌ ను డచ్ గోల్‌ కీపర్ సమర్థంగా అడ్డుకున్నాడు.

13వ నిమిషంలో వచ్చిన రెండో పెనాల్టీని భారత్ వృథా చేసుకుంది. రెండో క్వార్టర్‌లో ఇరుజట్లు గోల్స్ కోసం హోరాహోరీగా పోరాడాయి. దీంతో 25వ నిమిషంలో నెదర్లాండ్స్‌ కు వెంటవెంటనే పెనాల్టీలు లభించాయి. అయితే భారత గోలీ శ్రీజేష్ సమర్థంగా నిలువరించాడు. రెండో అర్ధభాగంలో భారత్ చక్కని అవకాశాలను సృష్టించుకుంది. 47వ నిమిషంలో హర్మన్‌ ప్రీత్ కొట్టిన పెనాల్టీ రీబౌండ్ కావడంతో అక్కడే ఉన్న మన్‌దీప్ నేర్పుగా గోల్‌పోస్ట్‌లోకి పంపాడు. కొద్దిసేపటికే నెదర్లాండ్స్ పెనాల్టీని సాధించింది. దీనిని బ్రింక్‌మన్ గోల్‌గా మలిచి స్కోరు సమం చేశాడు. తర్వాత డచ్ ఆటగాళ్లు చేసిన ఎదురుదాడిని భారత డిఫెన్స్ సమర్థంగా తిప్పికొట్టింది. ఆదివారం (జూలై-1) జరిగే ఫైనల్లో భారత్.. ఆస్ట్రేలియాతో తలపడుతుంది.

Posted in Uncategorized

Latest Updates