హామీ నెరవేర్చలేక : మోకాళ్లపై కూర్చొని చేతులు జోడించి క్షమాపణ కోరిన MLA

ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయానని ఓ ఎమ్మెల్యే…. ప్రజల మందు మోకాళ్లపై నిలబడి, చేతులు జోడించి క్షమాపణలు కోరారు. అసోం రాష్ట్రంలోని జోర్హత్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

అసోం రాష్ట్రంలోని మరియాని నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రూప్‌ జ్యోతి కుర్మి. రూప్ జ్యోతి కుర్మి టీ ట్రైబ్ తెగకు చెందినవారు. ఇతని తండ్రి రూపమ్ కుర్మి అసోం మాజీ మంత్రి. ఎన్నికల హామీలో భాగంగా… మరియాని నియోజకవర్గంలోని నకచారి ఏరియాలోని మహాత్మాగాంధీ మోడల్ హాస్పిటల్ సమస్యలను పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ కమిటీకి అధ్యక్షుడిగానూ ఉన్న రూప్ జ్యోతి కుర్మి….హాస్పిటల్ కు వచ్చే గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సరైన వైద్యం అందటంలేదని గ్రహించి  రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి 8 మంది డాక్టర్లను హాస్పిటల్ లో నియమించారు. అయితే రూప్ జ్యోతి కుర్మి హాస్పిటల్ సందర్శనకు వెళ్లినప్పుడు వారిలో ఒక్కరు కూడా కనిపించలేదు. దీంతో వైద్య సేవలు అందక రోగులు పడుతున్న ఇబ్బందులను దగ్గరుండి చూసిన ఎమ్మెల్యే విషయాన్ని ఆరోగ్య శాఖామంత్రి డాక్టర్ హిమంత బిస్వా శర్మకు కంప్లెయింట్ చేశారు. ఈ ఫిర్యాదుకు స్పందించిన మంత్రి… విధులకు గైర్హాజరైన డాక్టర్ల శాలరీలోని ఒకరోజు జీతాన్ని కట్ చేయాలని నిర్ణయించారు. అయితే అప్పటికి కూడా డాక్టర్ల ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో మనస్తాపం చెందిన ఎమ్మెల్యే హాస్పిటల్ లో పేషెంట్లకు సరైన వైద్య సదుపాయాలు అందించడంలో విఫలమైనందుకు పేషెంట్ల ఎదుట మోకాళ్లపై నిల్చుని, చేతులు జోడించి క్షమాపణలు వేడుకున్నారు. నిత్యం ప్రజల్లో మమేకమయ్యే ఎమ్మెల్యే రూప్‌ జ్యోతి కుర్మి గతంలో కూలీలకు సాయం చేస్తూ గన్నీ బ్యాగులు మోశారు. ఓ సందర్భంలో రైతులకు సాయంగా పొలం కూడా దున్నారు.

 

Posted in Uncategorized

Latest Updates