హాలీవుడ్ సినిమాని తలపించిన సేఫ్ ల్యాండింగ్ : గాల్లో పేలిన విమాన ఇంజిన్, కిటికీ అద్దాలు

ENGINEగగనతలంలో అనూహ్యరీతిలో విమాన ప్రమాదం జరిగింది. 144 మంది ప్యాసింజర్లతో 32వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో విమానం ఇంజిన్‌ ఒకటి పేలిపోయింది. పేలుడు ధాటికి ఇంజిన్‌ లోని భాగాలు ఎగిరివచ్చి విమానం కిటికీని ఢీ కొట్టడంతో విమానానికి రంధ్రం ఏర్పడింది. ప్రయాణికుల్లో తీవ్ర భయోత్పాతాన్ని సృష్టించింది. మహిళా పైలెట్‌ చాకచక్యంగా వ్యవహరించి అందరి ప్రాణాలు కాపాడింది. అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఈ ఘటన జరిగింది.

మంగళవారం(ఏప్రిల్-17) ఉదయం 144 మంది ప్రయాణికులతో న్యూయార్క్‌ నుంచి డల్లాస్ కు బయల్దేరిన సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం టేకాఫ్‌ అయిన 20 నిమిషాలకే ఇంజిన్‌లో ప్రాబ్లమ్ వచ్చింది. గాల్లోనే విమానంలోని ఓ ఇంజిన్ ఒక్కసారిగా పేలిపోయింది. పేలుడు కారణంగా ఇంజిన్‌ లోని భాగాలు ఎగిరివచ్చి విమానాన్ని ఢీకొట్టడంతో కిటికీ అద్దం ఒకటి పగిలిపోయింది. కిటికీ పక్కనే కూర్చున్న జెన్నిఫర్ రియోర్డాన్ అనే ఓ మహిళను.. గాలి ఒత్తిడి సగం వరకూ బయటకు లాగేసింది. తోటి ప్రయాణికులు ఆమెను విమానం లోపలికి లాగారు.

ఈ క్రమంలో తీవ్రగాయాలపాలైన ఆమె ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు గాయపడ్డారు. అతి కష్టంపై విమాన సిబ్బంది ఆ రంధ్రాన్ని మూసివేశారు. గతంలో నావికాదళ విమాన పైలెట్‌గా పనిచేసిన అనుభవమున్న పైలెట్ షల్ట్స్‌ ఈ సమయంలో అయోమయానికి గురికాకుండా.. గగనతల రద్దీ నియంత్రణ కేంద్రానికి సమాచారం ఇచ్చింది. ప్రయాణికులకు అత్యవసరంగా ఆక్సీజన్‌ మాస్కులు అందించి ల్యాండింగ్‌కు సిద్ధం చేశారు. చాకచక్యంగా వ్యవహరించి ఫిలడెల్ఫియా ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేశారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే ఫైర్ ఇంజిన్ సిబ్బంది విమాన ఇంజిన్‌లోని మంటలను ఆర్పివేశారు. ఘటన సమయంలో షల్ట్స్‌ వ్యవహరించిన తీరును అందరూ ప్రశంసించారు. అమెరికా సైన్యంలోని తొలితరం మహిళా పైలెట్లలో షల్ట్స్‌ ఒకరు. సూపర్‌సోనిక్‌ ఎఫ్‌-18 ఫైటర్‌ జెట్‌లను మొదటగా నడిపిన వ్యక్తుల్లోనూ షల్ట్స్ ఉన్నారు.
MAHILA

Posted in Uncategorized

Latest Updates