హాస్యనటుడు గుండు హనుమంతరావు అస్తమయం

gunduప్రముఖ హాస్య నటుడు గుండు హనుమంతరావు కన్నుమూశారు. గత కొద్దికాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఉదయం 3:30 గంటలకు హైదరాబాద్ SRనగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు హుటాహుటిన ఎర్రగడ్డ సెయింట్ థెరిసా హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.

61 ఏళ్ల హనుమంత రావు తెలుగు సినిమాల్లో హాస్యనటుడిగా.. 400 సినిమాల్లో నటించారు. అమృతం అనే టీవీ సీరియల్ ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. మూడు సార్లు టీవీ కార్యక్రాలకిచ్చే నంది అవార్డులు అందుకున్నారు. 1956లో కాంతారావు, సరోజిని దంపతులకు హన్మంతరావు జన్మించారు. 1974లో నాటకరంగం వైపు ఆకర్షితుడయ్యాడు. నాటకాల్లో ఆయన వేసిన మొదటి వేషం రావణబ్రహ్మ.

మద్రాసులో ఆయన నాటకాన్ని చూసిన జంద్యాల అహనా పెళ్లంట సినిమాలో మొదటి వేషం ఇచ్చారు.తర్వాత కొబ్బరిబోండాం, మాయలోడు, యమలీల, వినోదం సినిమాలతో మంచి హస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 50 సినిమాలు నటించిన తరువాత తన నివాసం విజయవాడ నుంచి హైదరాబాద్‌కు మార్చారు. పలు టీవీ సీరియల్స్‌లో నటించారు .హనుమంత రావుకు భార్య, ఇద్దరు పిల్లలుండగా ఇదివరకే కూతురు, భార్య చనిపోయారు. ఆనారోగ్యం కారణంగానే కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్నారు.. సినిమాలకు ముందు హన్మంతరావు స్వీట్ షాపును నిర్వహించేవారు.

ఇటీవల ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుసుకున్న ప్రముఖ సినీనటుడు చిరంజీవి ఆయనకు రూ.2లక్షల ఆర్థికసాయం అందించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా సీఎం సహాయనిధి నుంచి రూ.5లక్షలు మంజూరుచేసింది.

సినిమాల్లో తన కామెడీతో  అందరినీ నవ్వించిన  గుండు హనుమంతరావు  వ్యక్తిగత జీవితంలో  ఎన్నో కష్టాలు అనుభవించారు.  2010 లో  భార్య చనిపోవడం, ఆ తర్వాత కూతురు  కూడా దూరమవడంతో  ఆయన మానసికంగా  బాగా కుంగిపోయారు. ప్రస్తుతం  హనుమంతరావుకు  ఓ కొడుకు ఉన్నాడు.  ఎన్నో సినిమాల్లో నటించినా  ఆర్థికంగా  కూడా ఆయనకు  కష్టాలు తప్పలేదు.  కిడ్నీ సమస్యలు  రావడంతో వైద్యం కోసం  ఎంతో ఖర్చు చేశారు. సాయంత్రం ఎర్రగడ్డ  స్మశాన వాటికలో  అంత్యక్రియలు  నిర్వహించనున్నారు  కుటుంబ సభ్యులు.

Posted in Uncategorized

Latest Updates