హెల్మెట్‌ : మీకే కాదు మీ పిల్లలకు కూడా…

children-helmetద్విచక్రవాహనాలపై ప్రయాణించే చిన్నారులకు కూడా హెల్మెట్‌ను అనివార్యం చేయాలని భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం. నాలుగేళ్లు దాటిన పిల్లలకు హెల్మెట్‌ తప్పనిసరి చేయాలని నిర్ణయించింది.ఈమేరకు నిబంధనలు రూపొందించేందుకు కసరత్తు చేస్తోంది. డ్రైవింగ్‌ లైసెన్సు ప్రక్రియ ప్రక్షాళన చేయాలని కూడా నిర్ణయించింది కేంద్రం. అక్రమాలను అడ్డుకోవడానికి లైసెన్సుల ప్రక్రియను ఎలక్ట్రానిక్‌ రూపంలోకి తీసుకురావాలని కూడా యోచిస్తోంది. తొలిదశలో ఇచ్చే ఎల్‌ఎల్‌ఆర్‌ను కాగితం రూపంలో కాకుండా ఎలక్ట్రానిక్‌ రూపంలోకి మార్చేందుకు రంగం సిద్ధమైంది. బినామీ వ్యక్తులు పరీక్షలకు హాజరై లైసెన్సులు పొందే విధానాన్ని కూడా అడ్డుకోవాలని ప్రయత్నిస్తుంది ప్రభుత్వం. ఇందుకోసం ధ్రువపత్రాల తనిఖీ ఎలక్ట్రానిక్‌ రూపంలోనే చేయాలని నిర్ణయించింది. త్వరలో ఆధార్‌ వివరాలను రవాణా శాఖ కార్యాలయాలకు అనుసంధానించాలనీ సూత్రప్రాయంగా నిర్ణయించింది. దరఖాస్తుదారులు ఇచ్చిన సమాచారంలోని వాస్తవికతను ధ్రువీకరించుకునేందుకు ఆధార్‌ అనుసంధానం ఉపయోగపడుతుంది. డ్రైవింగ్‌  లైసెన్సు లేదా వాహన రిజిస్ట్రేషన్‌ ఎక్కడ చేయించుకుంటే వాటి పునరుద్ధరణకు మళ్లీ అదే కార్యాలయానికి రావాల్సి వచ్చేది. ఇది ఇబ్బందులకు దారి తీస్తుండడంతో రాష్ట్రంలోని ఏ రవాణా శాఖ (ఆర్టీఏ) కార్యాలయంలోనైనా లైసెన్సు, వాహన రిజిస్ట్రేషన్‌ పునరుద్ధరించుకునేలా చర్యలు తీసుకోవాలని కూడా యోచిస్తోంది కేంద్ర ప్రభుత్వం.

Posted in Uncategorized

Latest Updates