హెల్మెట్ లేకపోవడంతోనే ఎక్కువ మరణాలు : ట్రాఫిక్ ACP

హెల్మెట్ లేకపోవడంతోనే యువత ఎక్కువగా మృత్యువాత పడుతున్నట్లు తెలిపారు హైదరాబాద్  ట్రాఫిక్ అడిషనల్ సీపీ అనిల్ కుమార్. 4 సంవత్సరాలుగా చూస్తే వీరి మరణాల సంఖ్య పెరుగుతుందే తప్పా..తగ్గడంలేదన్నారు. రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందుతున్న ద్విచక్రవాహనదారుల్లో ఎక్కువ మంది హెల్మెట్ వాడనివారేనని అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయన్నారు. 2014 నుంచి 2017 వరకు 8,204 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలంగాణ పోలీస్‌శాఖ సమాచారం.   ఈ మృతుల్లో  90 శాతం మంది యువతే. దీంతో ప్రాణాంతక ప్రమాదాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ద్విచక్రవాహనాలు నడిపేవారు తప్పక హెల్మెట్ ధరించాలన్న నిబంధన అమలుపై ట్రాఫిక్ పోలీసులు మరింతగా దృష్టి పెట్టారు.

ఇదే అంశంపై ట్విట్టర్ ద్వారా నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రారంభించిన సిస్టర్ 4 చేంజ్ ప్రచారానికి అనూహ్య స్పందన వస్తున్నది.  రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ పరిధిలో హెల్మెట్ వాడకం తప్పనిసరి చేయడంతోపాటు స్పెషల్ డ్రైవ్స్ పెట్టి మరీ వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. ఎప్పటికప్పుడు సీసీటీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ, ట్రాఫిక్ అధికారులు తరచూ తనిఖీలు నిర్వహిస్తుండటంతో హైదరాబాద్‌లో ద్విచక్రవాహనదారుల్లో హెల్మెట్ వినియోగం పెరిగింది.  అదే స్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా నిబంధనలు కచ్చితంగా అమలుచేయకపోవడంతో పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా హెల్మెట్ వాడకంపై అంతగా అవగాహన రావడం లేదు.

హెల్మెట్ వాడకం పెరుగాలంటే వీలైనంతమేర ఈ అంశంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే ఉత్తమ మార్గమని పోలీస్ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.  ఇప్పటికే హైదరాబాద్‌లో హెల్మెట్ వాడకం  70 శాతానికి చేరిందని హైదరాబాద్ అడిషనల్ సీపీ ట్రాఫిక్ అనిల్‌ కుమార్ తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు సైతం నిత్యం హెల్మెట్ వాడకంపై ప్రచారాన్ని ముమ్మరం చేశారు. జైళ్లశాఖ పరిధిలోని పెట్రోల్ బంకుల్లో హెల్మెట్ లేకపోతే పెట్రోల్ పోయొద్దని జైళ్లశాఖ డీజీ వీకే సింగ్ ఆదేశాలు జారీచేశారు. ఇదే అంశంపై ఎంపీ కవిత ట్విట్టర్ వేదికగా చేపట్టిన సిస్టర్స్ 4చేంజ్ ప్రచారానికి అనూహ్య స్పందన లభిస్తున్నది. దేశవ్యాప్తంగా పలువురు సెలబ్రిటీలు ఈ అంశానికి ట్వీట్ల ద్వారా మరింత ప్రాచుర్యం కల్పిస్తున్నారు. ఎంతమంది అవేర్ నెస్ చేసినా బండినడిపేవారు హెల్మెట్ పెట్టుకోవాలన్న ఆలోచన వస్తేనే మంచిదని సూచించారు పోలీసులు.

 

Posted in Uncategorized

Latest Updates