హైకోర్ట్ సీజేగా జస్టిస్ రాధాకృష్ణన్

RadhakrishnanCJతెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా (సీజే) జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఛత్తీస్‌ గఢ్ హైకోర్టు సీజేగా పనిచేస్తున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు మేరకు కేంద్ర అపాయింట్‌మెంట్ కమిటీ సూచనలతో రాష్ట్రపతి ఆయన్ను హైదరాబాద్ హైకోర్టు సీజేగా నియమించారు.

ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి జీఆర్ రాఘవేందర్ ఆదివారం (జూలై-1) ఉత్తర్వులు జారీచేశారు. హైదరాబాద్‌ లోని హైకోర్టులో జస్టిస్ రాధాకృష్ణన్ జూలై 16లోపు బాధ్యతలు స్వీకరించాల్సిందిగా ఉత్తర్వుల్లో చెప్పారు. ఈ వారంలో రాధాకృష్ణన్ ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నది. ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రమేశ్ రంగనాథన్ ఉన్నారు.

రాధాకృష్ణన్ గురించి

ఎన్ భాస్కరన్ నాయర్, పారుకుట్టి అమ్మ దంపతులకు రాధాకృష్ణన్ 1959 ఏప్రిల్ 29న జన్మించారు. తల్లిదండ్రులిద్దరూ కొల్లాంలో న్యాయవాదులు. బెంగళూరు విశ్వవిద్యాలయం నుంచి LLB పట్టా పొందిన రాధాకృష్ణన్.. 1983, డిసెంబర్ 11న తిరువనంతపురంలో జూనియర్ అడ్వకేట్‌గా న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 1988లో కేరళ హైకోర్టులో జూనియర్ లాయర్‌ గా ప్రాక్టీస్ చేశారు. పలు కమిటీల్లో సభ్యుడిగా పనిచేశారు. కేరళ హైకోర్టు జడ్జిగా రాధాకృష్ణన్ 2004 అక్టోబర్ 14న బాధ్యతలు స్వీకరించారు. తాత్కాలిక సీజేగా 2016లో మూడునెలలపాటు, 2017లో నెలపాటు పనిచేశారు.అనంతరం ఛత్తీస్‌ గఢ్ హైకోర్టు సీజేగా బాధ్యతలు స్వీకరించారు. ఛత్తీస్‌ గఢ్ హైకోర్టు నుంచి బదిలీపై ఏపీ, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీపై రానున్నారు. మూడేండ్ల అనంతరం ఉమ్మడి హైకోర్టుకు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తి నియమితులయ్యారు.

Posted in Uncategorized

Latest Updates