హైదరాబాద్ లో జోరు వానలు

చినుకు జోరందుకుంది. ముసురు కొనసాగుతోంది. వానలతో తెలంగాణ తడిసిముద్దవుతోంది. చురుకుగా కదులుతున్న నైరుతి రుతుపవనాలకు తోడు…. ఉత్తర ఒడిశా తీరం మీద ఉపరిత ఆవర్తనంతో రాష్ట్ర వ్యాప్తంగా వానలు కురుస్తున్నాయి. ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు పడుతుండగా…దక్షిణ తెలంగాణలో వాన ముసురు కొనసాగుతోంది. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి.

రాజధాని హైదరాబాద్ లో బుధవారం(జూలై-11) అర్ధరాత్రి నుంచి వర్షం దంచికొడుతోంది. సిటీలోని చాలా ఏరియాల్లో వాన పడుతోంది.
బేగంబజార్, బషీర్ బాగ్, నారాయణగూడ, హిమయత్ నగర్, తార్నాక, నాచారం, మల్లాపూర్, రాజేంద్రనగర్, మోహిదీపట్నం, బంజారాహిల్స్, పంజాగుట్ట, వనస్థలిపురంలో అర్ధరాత్రి నుంచి వర్షం పడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు వచ్చి చేరుతోంది. మరోవైపు ఆఫీసులకు వెళ్లే టైం కావటంతో ట్రాఫిక్ స్లోగా మూవ్ అవుతోంది. అటు అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో గ్రేటర్ సిబ్బంది అలర్ట్ అయ్యింది.

అటు జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి వర్షం పడుతోంది. నిన్న నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో అత్యధికంగా 5 సెం,మీ వర్షం కురిసింది. వనపర్తిలో 4, నిజామాబాద్ బోధన్ , డిచ్ పల్లిలో 3, జోగుళాంబ గద్వాల, అలంపూర్, నిజామాబాద్ లో 2 సెంమీ వర్షపాతం నమోదైంది. జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. భద్రాద్రిలో గోదావరి పరవళ్లు తొక్కుతోంది.

గోదావరి ప్రాజెక్టుల నీటిమట్టం పెరుగుతుంది. చర్ల మండలం తాలిపేరు రిజర్వాయర్లోకి భారీగా వరద నీరు చేరడంతో 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates