హైదరాబాద్ వేదికగా..నేటి నుంచే ఐటీ సదస్సు

wct
హైదరాబాద్‌ మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కానుంది. గత నవంబరులో ప్రపంచ ఎంటర్‌ప్రెన్యూర్ల సదస్సు విజయవంతంగా నిర్వహించి మూడు నెలలైనా ముగియక ముందే మరో భారీ అంతర్జాతీయ సదస్సు ఇక్కడ జరుగుతోంది. సోమవారం(ఫిబ్రవరి-19) నుంచి బుధవారం వరకు మూడు రోజుల పాటు ప్రపంచ సమాచార సాంకేతిక పరిజ్ఞాన సదస్సు, నాస్కామ్‌ ఇండియా లీడర్‌షిప్‌ ఫోరమ్‌ (WCIT-NILF) సమావేశాలు హైదరాబాద్‌ అంతర్జాతీయ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరుగనున్నాయి. ఇప్పటికే GES ను ఎంతో విజయవంతంగా నిర్వహించిన ఘనత సంపాదించుకున్న  మంత్రి కెటిఆర్‌ సారథ్యంలో ఈ సదస్సుకు ఆతిథ్యం వహిస్తోంది. శ్రీలంక ప్రధానితోపాటు కెనడా, అమెరికా, మెక్సికో, బ్రెజిల్‌, నైజీరియా, దక్షిణాఫ్రికా, తైవాన్‌, ఆర్మీనియా నుంచి 500 మంది ప్రతినిధులు వస్తున్న ఈ సదస్సును ప్రధాని నరేంద్రమోడీ వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా ప్రారంభించి ప్రారంభోపన్యాసం చేస్తారు. కేంద్ర ఐటి శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ముఖ్య అతిథిగా పాల్గొంటారు.

ఆయనతో పాటు మంత్రి కేటీఆర్, ఇతర ప్రముఖులు వేదికపై ఆసీనులవుతారు. ప్రధాని స్పీచ్ తర్వాత డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థలో పాలనా విధానాలపై పునరాలోచన అనే అంశంపై మంత్రుల రౌండ్‌టేబుల్‌ సమావేశానికి రవిశంకర్‌ ప్రసాద్‌ అధ్యక్షత వహిస్తారు. ‘‘డిజిటల్‌ విస్తరణ-కొత్త బాటలో పయనం’’ ఈ ఏడాది జరిగే డబ్ల్యుసిఐటి ప్రధాన థీమ్‌. దీనికి అనుగుణంగానే మూడు రోజుల ఈ సదస్సులో 22 సెషన్లలో ప్రతినిధులు కొత్త టెక్నాలజీలు, ప్రధాన ధోరణులపై సమూలంగా చర్చిస్తారు.

WCITతో సమాంతరంగా నాస్కామ్‌ ఇండియా లీడర్‌షిప్‌ సదస్సు కూడా నిర్వహిస్తున్నారు. ఈ సదస్సు ఇప్పటి వరకు ముంబైలోనే జరుగుతుండగా…మొదటి సారిగా హైదరాబాద్‌ వేదికగా జరుగుతోంది. ఐటి రంగానికి చెందిన దిగ్గజాలందరూ దీనికి హాజరై కొత్త ఆలోచనలను పరస్పరం పంచుకుంటూ ఐటి ప్రపంచంలో తదుపరి పెద్ద మార్పు ఏది అనే అంశం సంపూర్ణంగా చర్చిస్తారు. NILFకు రెండు వేల మంది వరకు ప్రతినిధులు హాజరవుతున్నారు. పరిశ్రమకు చెందిన ప్రముఖులతో పాటు తమ ప్రసంగాలతో ప్రపంచాన్ని ప్రభావితం చేసే వారు, టెక్నాలజీ ఆరాధకులు కూడా ఈ సమావేశాల్లో పాల్గొంటారు. కొత్త టెక్నాలజీలు, వర్చువల్‌ రియాల్టీ, బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ, నాలుగో పారిశ్రామిక విప్లవం, డిజిటల్‌ ప్రపంచ వాస్తవాలకు దీటుగా నైపుణ్యాల వృద్ధి, డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ-నియంత్రణలు, డేటా విప్లవ ప్రపంచంలో గోప్యతాపరమైన అంశాలు వంటి భిన్న అంశాలపై డబ్ల్యుసిఐటి-ఎన్‌ఐఎల్‌ ఎఫ్‌ విస్తృతంగా చర్చిస్తాయి. ఈ సదస్సుకు హాజరవుతున్న ప్రముఖుల్లో జగ్గీ వాసుదేవ్‌ సద్గురు, పుల్లెల గోపీచంద్‌ కూడా ఉన్నారు.

ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌ సదస్సులో పాల్గొనేందుకు వచ్చే దేశ, విదేశీ అతిథుల  గౌరవార్థం రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం(ఫిబ్రవరి-20) రాత్రి 7 గంటల నుంచి నగరంలోని చౌమహల్లా ప్యాలెస్‌లో ప్రత్యేక విందును ఏర్పాటు చేసింది.

Posted in Uncategorized

Latest Updates