హైదరాబాద్ శాస్త్రవేత్తల అద్భుత అవిష్కరణ : వేపతో క్యాన్సర్ వ్యాధికి చికిత్స

బాూల
వేప చెట్టు.. చేదు చేదు అంటాం.. అనారోగ్యం వస్తే ఇదే వేపతో రోగాలు నయం చేస్తున్నారు. ఉదయాన్నే నోట్లో వేప పుల్ల వేసుకుని పళ్లు రుద్దుకుంటాం.. వేపతోనే టూత్ పేస్టులు తయారు చేస్తున్నారు ఇవాళ.. వేప నూనె కూడా వచ్చింది.. ఆయుర్వేదంలో వేపకు ఉన్న విశిష్టత అలాంటిది.. ఇప్పుడు ఇదే వేపతో క్యాన్సర్ వ్యాధికి మందు కనిపెట్టింది హైదరాబాద్ కు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (IICT). మన శాస్త్రవేత్తలు ప్రపంచానికి అద్భుత ఆవిష్కరణ ఇచ్చారు.

వేప ఆకులు, పువ్వుతో రకరకాల క్యాన్సర్ ను నయం చేసే నింబోలైడ్(Nimbolide) డ్రగ్ ను తయారుచేశారు. ఈ మందును క్యాన్సర్ వ్యాధులు ఉన్న వివిధ జంతువులపై ప్రయోగించారు. ఈ చికిత్స అద్భుతమైన ఫలితాలను రాబట్టారు. క్యాన్సర్ కారకాలు అయిన బ్యాక్టీరియాను చంపేసింది ఈ వేప మందు. దీనికి నింబోలైడ్ డ్రగ్ అనే పేరు పెట్టారు. 10mg, 30mg, 50 mg కేటగిరీల కింద తయారు చేసిన ఈ నింబోలైడ్ మందు తయారు చేసిన టీమ్ లో IICTకి చెందిన హైదరాబాద్ సైంటిస్ట్ లు ఎస్ఎం బిర్లా, ఎ.ఖురానా, జె.సమగోని, ఆర్.శ్రీనివాస్, సి.గొడువు, ఎంవిఎన్ కె తాళ్లూరి ఉన్నారు. వేపలో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లతో క్యాన్సర్ వ్యాధికి అద్భుత చికిత్సగా పని చేస్తుందని వెల్లడించారు. ఇప్పటికే రకరకాల జంతువులపై చేసిన ప్రయోగాలు సత్ఫలితాలను ఇచ్చిందని ప్రకటించారు. మరిన్ని పరిశోధనలు చేసిన తర్వాత క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించనున్నట్లు తెలిపారు. వేప ఆకులు, బెరడు, కాయలు, పువ్వులపై పరిశోధనలు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే షుగర్, దగ్గు, ఆస్తమా, చర్మ వ్యాధుల్లో వేప సంబంధిత మందు ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.

ఆయుర్వేదంలో వేపకు విశిష్ఠ స్థానం ఉంది. సర్వరోగ నివారిణిగా కొనియాడింది. వేప నూనెతో సబ్బులు, షాంపూ, కాస్మోటిక్ క్రీమ్స్ ఇప్పటికే మార్కెట్ లో ఉన్నాయి. అమ్మవారు లాంటి అంటువ్యాధులు సోకిన వారికి వేపతోనే చికిత్స చేస్తున్నారు నేటికీ. రోజూ నాలుగు వేప ఆకులు తింటే రక్త శుద్ధి జరుగుతుందని.. దురద, తామర, పుండ్లు, మచ్చలు తగ్గిపోతాయని నిరూపితం కూడా అయ్యింది. ఇప్పుడు క్యాన్సర్ వ్యాధికి కూడా వేప మందు రాబోతున్నది. ప్రపంచానికి హైదరాబాద్ శాస్త్రవేత్తలు అందిస్తున్న అద్భుత మందు అనటంలో సందేహం లేదు..

 

Posted in Uncategorized

Latest Updates