హోర్డింగ్స్ బ్యాన్: చర్యలకు సిద్ధమైన GHMC

హైదరాబాద్ సిటీలో హోర్డింగ్స్ పై GHMC నిషేధం విధించినా..ప్రకటనలు మాత్రం ఆగడం లేదు. వర్షాకాలంలో ప్రమాదాలు జరక్కుండా హోర్డింగ్స్ నిషేధిస్తే..కార్పొరేట్ సంస్థలు, సినిమాల పబ్లిసిటీ మాత్రం జోరుగా సాగుతోంది. అయితే హోర్డింగ్స్ నిషేధం పాటించకపోతే క్రిమినల్ కేసులు పెట్టడానికి GHMC సిద్ధమవుతోంది.

సిటీలోని హోర్డింగ్స్ గ్రేటర్ ప్రజలకు ప్రమాదకరంగా మారుతున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు.. నగర ప్రజలకు హోర్డింగ్స్ భయపెడుతున్నాయి. ఏ క్షణంలో తెగిపడి ఎవరి ప్రాణాలను బలితీసుకుంటాయోనని వణికి పోతున్నారు.గతేడాది ఈదురు గాలులకు పెద్దపెద్ద హోర్డింగ్స్ కూలి భారీనష్టం జరిగింది.

GHMC లో మొత్తం 2651 హోర్డింగులు ఉన్నట్లు అధికార లెక్కలు చెబుతున్నాయి. కానీ అంతకు రెండింతలు అక్రమంగా నిర్మించిన హోర్డింగ్స్ ఉన్నాయనే ఆరోపణలున్నాయి. లీగల్, ఇల్లిగల్ హోర్డింగ్స్ పక్కన పేడితే..ఏటా వర్షాకాలంలో GHMC హోర్డింగ్స్ పై నిషేధం విధిస్తుంది. ఈదురు గాలులకు హోర్డింగ్స్ పడిపోయి ప్రమాదాలు జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

హోర్డింగ్స్ పై నిషేధం ఉన్నా చాలా చోట్ల హోర్డింగ్స్ ప్రకటనలతో నిండిపోయాయి. చాలా ప్రాంతాల్లో పబ్లిసిటీ కోసం వేసిన పోస్టర్లు, హోర్డింగ్ బ్యానర్లు కనిపిస్తున్నాయి. అయితే బ్యాన్ సమయాల్లో వేసిన ప్రకటనలపై చర్యలు తీసుకునేందుకు GHMC రెడీ అయింది. వెంటనే తొలగించకపోతే ఫైన్ వేయడంతో పాటు క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు అధికారులు.

హోర్డింగ్స్ పై నిషేధం ఉన్నా కొన్ని కార్పొరేట్, ఫిల్మ్ నిర్మాణ సంస్థలు… ప్రకటనల జోరు తగ్గించడం లేదు. మరోవైపు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్..తన బర్త్ డే సందర్భంగా సిటీలో హోర్డింగ్స్ పెట్టొద్దని ఇప్పటికే అభిమానులు, నాయకులకు సూచించారు.

 

Posted in Uncategorized

Latest Updates