పూనావాలా భద్రత పిల్‌ను కొట్టేసిన బాంబే కోర్టు

పూనావాలా భద్రత పిల్‌ను కొట్టేసిన బాంబే కోర్టు

సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(SII) సీఈఓ అదర్‌ పూనావాలా కోరితే తగిన భద్రత కల్పిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం బాంబే హైకోర్టుకు తెలిపింది. దీంతో పూనావాలాకు మరింత భద్రత కల్పించాలన్న పిల్‌ను కోర్టు కొట్టివేసింది. ఇప్పటికే  పూనావాలాకు కేంద్రం 'వై' కేటగిరీ  CRPF భద్రతను కల్పిస్తోంది. అయితే వ్యాక్సిన్‌ సరఫరాకు సంబంధించి బెదిరింపులు రావడంతో ఆయనకు 'జడ్‌ ప్లస్‌' భద్రత కల్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ న్యాయవాది దత్తా మానే ఈ పిల్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ విచారణ చేపట్టిన జస్టిస్‌ ఎస్‌.ఎస్‌.షిండే, జస్టిస్‌ ఎన్‌.జె.జమాదార్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ దీపక్‌ థాకరే సమాధానం ఇచ్చారు. ఇవి వ్యక్తిగత వ్యవహారాలని... మీరు ఎవరి కోసం ఈ పిటిషన్‌ వేశారో ఆ వ్యక్తికి అసలు పిటిషన్‌ విషయమే తెలియకపోవచ్చన్నారు. ఒకవేళ అతను నాకు ఎలాంటి భయం లేదు.. ఏ భద్రతా అవసరం లేదు అని అంటే ఏం చేయాలన్న ధర్మాసనం.. కోర్టు వ్యక్తుల వెనుక పరుగులు తీసి, ఉత్తర్వులు జారీ చేయదని తెలిపింది.

అదర్‌ పూనావాలా కోరితే తగిన భద్రత కల్పించేందుకు తాము సిద్ధమని మహారాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అయితే.. కోర్టు ఈ పిటిషన్ పై విచారణను ఇంతటితో ముగిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఆ పిల్ ను మూసేస్తున్నట్టు తెలిపింది. భద్రతకు సంబంధించినంత వరకు అది పూనావాలా వ్యక్తిగత వ్యవహారమని స్పష్టం చేసింది.