వచ్చే నెల 15లోపు దళిత బంధు ఇయ్యాలె

వచ్చే నెల 15లోపు దళిత బంధు ఇయ్యాలె
  • అదే నెల 16 నుంచి రాష్ట్రమంతా అమలు చెయ్యాలె 
  • లేకుంటే ఉప ఎన్నికలో టీఆర్​ఎస్​ను చిత్తుగా ఓడిస్తం
  • ప్రభుత్వానికి షెడ్యూల్డ్​ కులాల సమగ్ర అభివృద్ధి కమిటీ అల్టిమేటం 
  • కేసీఆర్ నంబర్ వన్ మోసగాడు.. ఆయన మాటలు దళితులు నమ్మరు: మందకృష్ణ 
  • కేసీఆర్‌తో ఎందాకైనా కొట్లాడుతం: అద్దంకి దయాకర్‌

హైదరాబాద్‌, వెలుగు: హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితులందరికీ వచ్చే నెల 15లోపు దళిత బంధు పథకం కింద రూ.10 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వానికి షెడ్యూల్డ్​​ కులాల సమగ్ర అభివృద్ధి కమిటీ అల్టిమేటం జారీ చేసింది. అదే నెల 16 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ దళిత బంధు స్కీమ్ ను అమలు చేయాలని డిమాండ్ చేసింది. ఎలాంటి షరతులు లేకుండా రైతు బంధు లెక్కనే దళిత బంధు ఇవ్వాలని కోరింది. లేకుంటే సర్కారుపై యుద్ధం చేస్తామని, దళితులమంతా ఏకమై హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ను చిత్తుగా ఓడిస్తామని హెచ్చరించింది. బుధవారం హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో కమిటీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. దీనికి 59 కులాల నాయకులు, మేధావులు, ఉద్యమకారులు హాజరయ్యారు. దళిత బంధు స్కీమ్, ఎస్సీల సమస్యలపై చర్చించి భవిష్యత్‌ ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. 
దళిత బంధు వెంటనే ఇయ్యాలె: దయాకర్‌ 
ఎస్సీలను సీఎం అన్ని రకాలుగా మోసం చేశారని, ఆయన్ను ఎదుర్కొనేందుకు ఎంతవరకైనా కొట్లాడుతామని తెలంగాణ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్ చెప్పారు. హుజూరాబాద్‌లో దళితులకు రూ.10 లక్షల సాయం వెంటనే అందజేయాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే కేసీఆర్ దళితులకు ప్రధాన శత్రువుగా మారతారని, పథకం అమలు చేస్తే మాత్రం మంచి మిత్రుడు అవుతారని అన్నారు. 
కేసీఆర్‌ను ఓటుతోనే ఓడించాలి: రాములు 
సీఎం కేసీఆర్ ఏడేండ్ల నుంచి ఎస్సీలను ఏ విధంగా మోసం చేస్తున్నారో దళితులకు అర్థమైందని బీజేపీ నేత, జాతీయ ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు రాములు చెప్పా రు. కేసీఆర్ ను ఓటుతోనే ఓడించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ కు సీఎంకు కుర్చీపై యావ ఎక్కువ ఉందని, ఆ మత్తు వదలాలంటే హుజూరాబాద్‌లో ఓడించాల న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రివర్గంలో ఎస్సీలకు సమన్యాయం దక్కిందని, సెంట్రల్ లో ఐఏఎస్ లకు ప్రాధాన్యం కల్పించారని.. కానీ తెలంగాణలో ఆ పరిస్థితి లేదన్నారు. సమావేశంలో దళిత సంఘాల నేతలు జేబీ రాజు, ప్రొఫెసర్ గాలి వినోద్, స్కైలాబ్ బాబు, సడిమెల యాదగిరి, శంకర్‌, ఆంజనేయులు, రాజలింగం తదితరులు పాల్గొన్నారు. 

ఓట్ల కోసమే కేసీఆర్ కొత్త డ్రామా: మందకృష్ణ 
ఉప ఎన్నికలో ఓట్లు దండుకునేందుకు సీఎం కేసీఆర్ కొత్త డ్రామా ఆడుతున్నారని, ఆయన ఎన్ని నాటాకాలాడినా దళితులు నమ్మరని ఎమ్మార్పీఎస్‌ ప్రెసిడెంట్‌ మందకృష్ణ మాదిగ అన్నారు. కేసీఆర్‌ నంబర్‌ వన్‌ మోసగాడని విమర్శించారు. ఆయన చేసిన మోసాలపై త్వరలో సినిమా తీస్తానని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ లో వరద సాయం కింద రూ.10 వేలు ఇస్తామని కేసీఆర్ మోసం చేశాడని.. దళిత బంధు విషయంలోనూ అట్లనే చేసే ప్రమాదం లేకపోలేదని, దళితులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ కోసం కేసీఆర్‌ ఆశగా ఎదురుచూస్తున్నారని, నిద్రలోనూ కలవరిస్తున్నారని ఎద్దేవా చేశారు. దళితులంటేనే సీఎంకు భయం వేస్తోందని అన్నారు. దళిత సీఎం, దళితులకు మూడెకరాల భూమి హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. ఎస్సీ అభివృద్ధి నిధుల ఖర్చు, ఐఏఎస్‌, ఐపీఎస్‌, సలహాదారుల నియామకం.. ఇలా అన్నింట్లోనూ దళితులకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీలకు అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం తగ్గించారని ఫైర్ అయ్యారు. దళితులకు ఆత్మగౌరవ భవనాలపై మాట్లాడడం లేదని, ఎస్సీలపై వివక్షకు ఇదే నిదర్శనమని చెప్పారు. జీవో 72 ప్రకారం ఓపెన్ కోటా కింద ఎస్సీలకు ప్రమోషన్స్ ఉండొద్దని కేసీఆర్ కుట్ర పన్నారని ఆరోపించారు. ఎస్సీలకు కులం సర్టిఫికెట్లను ఆర్డీవో కాకుండా ఎమ్మార్వోలే ఇచ్చేలా సర్కార్ చర్యలు తీసుకోవాలని కోరారు. అంబేద్కర్ విగ్రహం వద్దకు వచ్చి, దళితులకు అన్యాయం చేశానని కేసీఆర్ క్షమాపణ చెప్పాలని... అప్పుడే తాము ఆయనను నమ్ముతామని తెలిపారు. హైదరాబాద్‌ నుంచి హుజూరాబాద్‌కు మహా పాదయాత్ర చేపడతామని, నియోజకవర్గంలో లక్ష మందితో సింహ గర్జన నిర్వహిస్తామని చెప్పారు.