డేరా బాబాకు అస్వస్థత.. 

డేరా బాబాకు అస్వస్థత.. 

చండీగఢ్: డేరా బాబాగా పేరుపొందిన సచ్చే సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ (53) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కరోనా బారినపడినట్లు చెబుతున్నా పోలీసులు నిర్ధారించలేదు. నిన్న కడుపులో నొప్పితో బాధపడుతున్నానని చెప్పడంతో జైలు అధికారులు ఆయనను రోహ్‌తక్‌లోని పీజీఐఎంఎస్ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అక్కడి నుంచి కరోనా టెస్టుల కోసం గుర్ గావ్ లోని మేదాంత ఆస్పత్రికి తరలించి పరీక్షలు చేయించిన అనంతరం కట్టుదిట్టమైన భద్రత నడుమ తిరిగి జైలుకు తరలించినట్లు సమాచారం.  
తన ఆశ్రమంలోని ఇద్దరు సాధ్వినుల‌పై డేరా బాబా అత్యాచారానికి పాల్పడినట్టు తేలడంతో 2017 ఆగస్టులో సీబీఐ కోర్టు ఆయనకు 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. జైలు శిక్ష పడిన నాటి నుంచి ఆయన రోహ్‌తక్‌లోని సునేరియా జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నారు.
పెరోల్ కు దరఖాస్తు చేసుకున్న డేరాబాబా
జైలు శిక్ష అనుభవిస్తున్న డేరాబాబా అలియా గుర్మీత్ రామ్ రహీమ్ తాను వ్యవసాయం చేసుకుంటానంటూ పెరోల్ కోసం దరఖాస్తు చేసుకోవడంతో డేరా బాబా మరోసారి వార్తల్లోకి వచ్చారు. తాను చేసిన నేరాలు క్షమించరాని పెద్ద నేరాలేమీ కాదని.. జైలులో తన సత్ ప్రవర్తన చూసి పెరోల్ ఇవ్వాలని డేరాబాబా వేడుకున్నారు.  పెరోల్ పై కోర్టు నిర్ణయం వెలువడక ముందే ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది.