పని ఒక్కటే.. జీతాలే వేర్వేరు

పని ఒక్కటే.. జీతాలే వేర్వేరు
  •     కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో పనిచేసే సిబ్బంది వేతనాల్లో వ్యత్యాసం
  •     ఏఎన్ఎంకు కేజీబీవీల్లో 11వేలు, మోడల్ స్కూళ్లలో 6 వేలే
  •     మిగిలిన ఉద్యోగుల జీతాల్లోనూ తేడాలు

రాష్ట్రంలోని మోడల్ స్కూల్​హాస్టళ్లలో పనిచేసే సిబ్బందికి ఏడేండ్ల నుంచి జీతాలు పెరగక అవస్థలు పడుతున్నారు. స్కూల్​ఎడ్యుకేషన్ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు ఒకే స్థాయిలో పనిచేస్తున్నా.. జీతాలు మాత్రం వేర్వేరు మొత్తంలో అందుతున్నాయి. ఇప్పటికే తక్కువగా జీతాలున్న కస్టూర్బా గాంధీ బాలికా విద్యాలయ(కేజీబీవీ) ఉద్యోగులతో పోల్చినా, మోడల్ స్కూళ్లలో పని చేసేవారికి అంతకంటే తక్కువగా ఉన్నాయి. అయితే మోడల్ స్కూల్ హాస్టళ్లలో పనిచేసే సిబ్బంది అంతా కాంట్రాక్టో, ఔట్​ సోర్సింగో లేదా డైలీవైజా అనేదానిపై విద్యాశాఖ ఇప్పటికీ స్పష్టత ఇవ్వడంలేదు.

శాఖ ఒక్కటే.. జీతాలే వేరు

సమగ్రశిక్షా అభియాన్ పరిధి(ఎస్ఎస్ఏ)లో ఇదువరకు కేజీబీవీలు మాత్రమే ఉండగా, రెండేండ్ల కింద మోడల్ స్కూళ్లను ఎస్ఎస్ఏ పరిధిలోకి తీసుకొచ్చారు. వాస్తవానికి కేజీబీవీల్లో పనిచేసే ఉద్యోగులకూ చాలీచాలని వేతనాలే అందుతున్నాయి. మోడల్ స్కూళ్లలో పనిచేసే ఎంప్లాయీస్​ వాళ్లకంటే తక్కువ జీతాలు పొందుతున్నారు. ఏఎన్ఎంకు మోడల్ స్కూల్​లో ఆరువేలు ఉండగా, కేజీబీవీల్లో పనిచేసే ఏఎన్ఎంకు రూ.11వేల జీతం ఉంది. హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్స్​కు మోడల్ స్కూళ్లలో ఆరు వేలుంటే, కేజీబీవీల్లో పనిచేసే వాళ్లకు రూ.7,500 ఉంది. కేజీబీవీల్లో డే అండ్ నైట్ పనిచేసేందుకు వాచ్ మెన్లు ఇద్దరుండగా ఒక్కొక్కరికి రూ.7500 ఉంటే, మోడల్ స్కూల్స్​లో పనిచేసే వాచ్ ఉమెన్​కు రూ.6,700 ఉంది. రెండు చోట్లా ఎంప్లాయీస్ అంతా 24గంటలు పనిచేస్తున్నారు. ఈ రెండింటిలోనూ 8గంటల పని విధానం అమలు కావట్లేదు. దీంతో ఎంప్లాయీస్ అంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఏడేండ్ల నుంచి వేతనాలు పెరగలే 

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 194 మోడల్ స్కూళ్లుండగా, వాటిలో 170 స్కూళ్లలో గర్ల్స్​ హాస్టళ్లు ఏర్పాటు చేశారు. ఆయా హాస్టళ్లలో కేర్ టేకర్, ఏఎన్ఎం, హెడ్ కుక్, ఇద్దరు అసిస్టెంట్ కుక్స్ తో పాటు వాచ్ ఉమెన్ పోస్టులున్నాయి. వారిలో డిగ్రీ, బీఈడీ అర్హతతో అవకాశం కల్పించిన కేర్​టేకర్ జీతం రూ.6700  ఉండగా, వాచ్ ఉమెన్​కు కూడా అంతే జీతం ఉంది. ఏఎన్ఎం, హెడ్​కుక్​కు రూ.6వేలు, ఇద్దరు అసిస్టెంట్ కుక్స్​కు రూ.5వేల చొప్పున వేతనం ఇస్తున్నారు. హాస్టల్​లో ఉండే ఒక్కో స్టూడెంట్​కు రూ.వెయ్యి చొప్పున మొత్తం వంద మందికి రూ.లక్ష, సిబ్బంది వేతనాలతో పాటు హాస్టల్ నిర్వహణకు మరో రూ.50వేలు.. కలిపి ప్రభుత్వం ప్రతినెలా రూ.1.5లక్షలు కేటాయిస్తోంది. ఇందులో ఉద్యోగులకు ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్ ఇవ్వకపోవడంతో హాస్టల్ నిర్వహణ ఖర్చుల్లోంచే వాళ్లు నామమాత్రంగా వేతనాలు పొందుతున్నారు. 2014 నుంచి మోడల్ స్కూల్ హాస్టళ్లలో పనిచేస్తున్న సిబ్బందికి జీతాలు ఇప్పటిదాకా పెరగలేదు. 

పోరాటాలు చేసినా ఫలితం లేదు

జీతాలు పెంచాలని జిల్లా కేంద్రాలతో పాటు డైరెక్టరేట్ ఆఫ్​ స్కూల్ ఎడ్యుకేషన్​ ముందు మోడల్ స్కూళ్ల సిబ్బంది పలుమార్లు ధర్నాలు చేశారు. ప్రతి జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలతో విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి వేడుకున్నారు. అయినా ఏడేండ్ల నుంచి వారికి ప్రభుత్వం జీతాలు మాత్రం పెంచలేదు. భవిష్యత్​లో అయినా తమకు మంచివేతనంతో పాటు ఉద్యోగ భద్రత ఉంటుందనే ఉద్దేశంతో వారంతా కష్టమైనా పనిచేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పనికి తగిన వేతనం ఇవ్వాలని కోరుతున్నారు.