విదేశాల నుంచి అమెరికాకు వచ్చే అధిక నైపుణ్యం కలిగిన వలసదారులైన H-1B వీసాదారుల భాగస్వాములకు వర్క్ వీసాలు అందించేందుకు గూగుల్ మద్దతు ఇచ్చింది. ఇప్పటికే పలు సంస్థలు సానుకూలంగా అభిప్రాయాలు వ్యక్తం చేయగా.. గూగుల్ కూడా ఈ లిస్టులో చేరింది. అమెరికాకు వచ్చే వలసదారులకు గూగుల్ మద్దతుగా ఉంటుందని సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు. ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (H-4EAD) కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. దీంతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, వారి కుటుంబాలకు ఈ కార్యక్రమం ఉపయోగంగా ఉంటుందన్నారు.
H-4 వీసాల కారణంగా ఉద్యోగాల్లో పోటీ తత్వం దెబ్బతింటోందని అక్కడి కోర్టులో దాఖలైన కేసులో గూగుల్ మరో 30 సంస్థల తరపున అఫిడవిట్ సమర్పించింది. H-1B వీసాదారు కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించే వ్యవస్థను కోరుకుంటున్నామని గూగుల్ తెలిపింది. దీని ద్వారా సుమారు 90వేల మందికి ప్రయోజనం చేకూరుతుందని గూగుల్ సంస్థ తెలిపింది.
H-1B వీసా కలిగిన వారు తమ భాగస్వామితో పాటు పిల్లలు కూడా అమెరికాలో ఉండేందుకు యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(USCIS) అనుమతి ఇస్తుంది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ‘అమెరికా ఫస్ట్’ నినాదంతో అనేక ఆంక్షలు విధించారు. జో బైడెన్ అధ్యక్షుడు అయిన తర్వాత ట్రంప్ విధించిన నియమ నిబంధనలు, ఆంక్షలను తీసివేశారు.
