నకిలీ ఆధార్ కార్డులతో భూములు కొనిపించిన కేటుగాళ్లు

 నకిలీ ఆధార్ కార్డులతో భూములు కొనిపించిన కేటుగాళ్లు
  • అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు
  • మాయగాడు.. సూత్రధారి ఏ1 నిందితుడు సర్పంచ్ శ్రీనివాసరెడ్డి

మోమిన్ పేట(వికారాబాద్): నకిలీ ఆధార్ కార్డులు సృష్టించి.. మాయ మాటలతో భూములను కొనుగోలు చేయించారు కేటుగాళ్లు. వికారాబాద్ జిల్లా మోమిన్ పేట మండలం దేరవంపల్లి గ్రామంలో జరిగిందీ ఘటన. ఆలస్యంగా బయటపడిన ఉదంతంపై కేసు (కేసు నెం: 135/2021) నమోదు చేసుకున్న  పోలీసులు నిందితులను అరెస్టు చేసి   ఐపీసీ సెక్షన్లు 420, 406, 471, 468, 474, r/w 34  నమోదు చేశారు మోమిన్ పేట పోలీసులు. మంగళవారం  ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. సిఐ వెంకటేశం, ఎస్సై శేఖర్ గౌడ్ మంగళవారం మీడియా సమావేశం పెట్టి తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

మోమిన్ పేట  మండల పరిధిలోని దేవరంపల్లి గ్రామ సర్పంచ్ మొగులన్నోల్ల శ్రీనివాస్ రెడ్డి ప్రధాన నిందితుడు. 2018వ సంవత్సరంలో ఎన్కతల గ్రామానికి చెందిన ఎర్ర బిచ్చయ్య, ఎర్ర రాములు 2018 ముందే చనిపోయారు. వారిరువురి వారసులు ఇప్పటికి వారు కబ్జాలో ఉన్నారు.  ఆ భూమి సర్వే నెంబరు 404 లో విస్తీర్ణం 1-01,గుంట మరియు 0-22 గుంటల వ్యవసాయ భూమిని హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ క్రిస్టల్ కంస్ట్రక్సన్ సర్వీసెస్ చెందిన డి ఎల్. రాంనాయక్ అనే వ్యక్తికి ఎన్కతల గ్రామానికి చెందిన ఎంపల్లి శ్రీనివాస్, ఎన్నెపల్లి సాయిలు అనే ఇరువురు వ్యక్తులతో కలిసి దేవరంపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ మొగులన్నోల్ల శ్రీనివాస్ రెడ్డి ఫోర్జరీ చేసి, మరణించిన పట్టదారు పేర్లతో ఆధార్ కార్డులు సృష్టించి ఆ భూమిని కొనిపించాడు. విచారించగా నకిలీ అని తేలడంతో మోసపోయిన రాంనాయక్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం బట్టబయలైంది. సీఐ వెంకటేశం, ఎస్సై శేఖర్ గౌడ్ నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ దారుణమైన మోసం ఘటన  రియల్ ఎస్టేట్ రంగంలో కలకలం సృష్టించింది.