- హైదరాబాద్‌కు టెక్నాలజీ, టాలెంట్, బయో-ఇన్ఫ్రా బలం
- కంపెనీల సమస్యలకు లోకల్ స్టార్టప్‌లతోనే పరిష్కారాలు
- రైజ్ హెల్త్ సదస్సులో మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ ఇకపై కేవలం విదేశీ కంపెనీల పనులు చేసిపెట్టే సర్వీస్ లేదా కేపబిలిటీ సెంటర్‌గానే కాకుండా.. ప్రపంచానికి దిశానిర్దేశం చేసే అసలైన ‘గ్లోబల్ వాల్యూ సెంటర్’గా ఎదగాలని ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్‌కు ఆ సత్తా, అర్హత పుష్కలంగా ఉన్నాయన్నారు. ప్రముఖ లైఫ్‌సైన్సెస్ కన్సల్టింగ్ సంస్థ హెల్త్ ఆర్క్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైజ్ హెల్త్ సదస్సులో 'అన్లాకింగ్ ఇండియా యాజ్ ఏ స్ట్రాటజిక్ హబ్ ఫర్ ఎల్ఎస్హెచ్సీ జీసీసీస్' మంత్రి ఆవిష్కరించారు.
అనంతరం మాట్లాడుతూ.. 'స్వాతంత్ర్యానికి పూర్వం మన దేశం నుంచి చేపలను విదేశాలకు ముడిసరుకుగా అతి తక్కువ ధరకు ఎగుమతి చేసేవాళ్లం. అవే చేపలను వారు ప్రాసెస్ చేసి, ప్యాక్ చేసి మళ్లీ మన దేశానికే అత్యంత ఖరీదైన ధరకు అమ్మేవారు. ఇన్నేళ్ల తర్వాత కూడా మనం కేవలం వేరే దేశాల కంపెనీలకు సర్వీసులు అందిస్తూ కూర్చుంటే లాభం లేదు.
మన దగ్గర అత్యుత్తమ టెక్నాలజీ ఉంది. అద్భుతమైన టాలెంట్ ఉంది. 4 దశాబ్దాలుగా నిర్మించుకున్న బలమైన మౌలిక వసతులు ఉన్నాయి. ఇక్కడ భౌతిక వసతుల కంటే ఎక్కువగా.. డిజిటల్, బయో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకున్న అతిపెద్ద బలం. దీన్ని వాడుకుని మనమే గ్లోబల్ వేదికపై హై-వ్యాల్యూ ఉత్పత్తులను సృష్టించే స్థాయికి చేరాలి' అని పేర్కొన్నారు.
గ్రౌండ్లో జరిగితేనే అసలైన ఫలితం
ఏఐతో ప్రపంచ ముఖచిత్రమే మారిపోతోందని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ప్రపంచం వేగంగా మారుతున్నప్పుడు లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాలు కూడా సరికొత్త మలుపు తిరగాలన్నారు. జీనోమిక్స్, బయాలజీ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, అడ్వాన్స్డ్ కంప్యూటింగ్.. ఇప్పుడు క్లినికల్ రీసెర్చ్‌లో అత్యంత కీలకంగా మారాయని చెప్పారు.
కేవలం టెక్నాలజీని మాత్రమే లైఫ్ సైన్సెస్‌ను అనుసంధానించడం క్షేత్రస్థాయిలో అమలైనప్పుడే అసలైన విలువ అని తెలిపారు. గ్లోబల్ ఫార్మా కంపెనీలకు ఏవైనా సమస్యలు వస్తే.. వాటిని చిటికెలో పరిష్కరించే లోకల్ స్టార్టప్‌లు, టెక్ కంపెనీలు హైదరాబాద్‌లోనే ఉన్నాయని, వాటిని పరస్పరం అనుసంధానించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
