కొత్తగా పెళ్లయింది. చుట్టాలు ఆహ్వానిస్తే సిటీకి వెళ్లారు. జూపార్క్ చూడాలనుకున్న తన భార్య కోరిక తీర్చేందుకు జూకి తీసుకెళ్లాడు. బైక్ పార్క్ చేసి వస్తా ఉండు.. అని చెప్పి వెళ్లాడు. వచ్చేసరికి భార్య లేదు. ఏం అర్థంకాక చట్టు పిచ్చాడిలా.. తన భార్యకు ఏం జరిగిందోననే భయంతో తిరిగాడు. కట్ చేస్తే 20 రోజుల తర్వాత తన భార్య ఇచ్చిన షాక్ కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది అతడికి.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జూకు భర్తతో వచ్చిన 18 ఏళ్ల భార్య సడెన్ గా మాయమై 20 రోజుల తర్వాత పోలీసులకు దొరికింది. తన భార్యను ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని ఆందోళనలో ఉన్న భర్త..ఆమె ఎలాంటి హాని లేకుండా ప్రశాంతంగా ఉండటం చూసి షాకయ్యాడు.
శివ్‌పురి జిల్లాకు చెందిన ఈ జంట బంధువులను కలవడానికి గ్వాలియర్ వచ్చారు. యువతి కోరిక మేరకు జూకు వెళ్లారు. భర్త మోటార్‌సైకిల్ పార్క్ చేయడానికి వెళ్లినప్పుడు ఆమె జూ ఎంట్రెన్స్ దగ్గర ఉండిపోయారు. తిరిగి వచ్చేసరికి ఆమె కనిపించలేదు. జూలో మిస్సయిన యువతికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ గమనిస్తే.. ఆమె మరో బైక్ పై మరో వ్యక్తితో కలిసి వెళ్లినట్లు కనిపించడంతో పోలీసులు విచారణ చేస్తున్నారు.
సీసీటీవీ ఫుటేజ్‌లో యువతి మరో వ్యక్తి బైక్ పై వెనుక కూర్చుని వెళ్తున్నట్లు కనిపించింది. భర్త ఆ వ్యక్తిని అర్మాన్ ఖాన్‌గా గుర్తించి, ఇద్దరికీ వివాహేతర సంబంధం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు.
యువతి ఏం చెప్పిందంటే..
పోలీసులు గాలించి గాలించి ఎట్టకేలకు 20 రోజుల తర్వాత యువతిని పట్టుకున్నారు. ఆమె చెప్పిన సమాధానం విని భర్త షాకయ్యాడు. దారి తప్పిపోవడంతో వేరే బైక్ రైడర్ నుంచి లిఫ్ట్ తీసుకున్నానని పోలీసులకు చెప్పారు. అయితే ఫుటేజ్ చూస్తుంటే ఆమెను బలవంతంగా తీసుకెళ్లినట్లు ఎలాంటి ఆధారాలు కనిపించడం లేదని పోలీసులు పేర్కొన్నారు.
చీఫ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సీఎస్‌పీ) రాబిన్ జైన్ మాట్లాడుతూ, యువతి మేజర్ కాబట్టి తన ఇష్టం మేరకు వెళ్లే స్వేచ్ఛ ఉంది. అయితే బలవంతంగా తీసుకెళ్లినట్లు తేలితే చర్యలు తీసుకుంటాం. ఆమె స్టేట్‌మెంట్‌ను కోర్టులో నమోదు చేస్తాం. ఆ తర్వాత మరిన్ని చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, యువతి వాంగ్మూలం ఆధారంగా మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.
అయితే భర్త తరుపు కుటుంబ సభ్యులు, బంధువులు మాత్రం ఆ యువతికి వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తున్నారు. తమ కుమారుడిని మోసం చేసిందని వాదిస్తున్నారు. పూర్తి వివరాలు విచారణ తర్వాత తెలుస్తుంది.
