చిన్న కార్లలోనూ 6 ఎయిర్ బ్యాగ్స్ ఉండాలి

చిన్న కార్లలోనూ  6 ఎయిర్ బ్యాగ్స్ ఉండాలి

ప్రస్తుతం కారు అవసరంగా మారింది. మధ్యతరగతి ప్రజలు కూడా కారును కొనుగోలు చేస్తున్నారు. దీంతో రోజురోజుకూ కార్ల సేల్స్ పెరుగుతున్నాయి. కార్ల సంఖ్య పెరగటంతో పాటు ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. లగ్జరీ కార్లకు పెద్ద ప్రమాదం జరిగినా అందులో ఉండే ఎయిర్ బ్యాగ్స్‌తో ప్రాణాలను కొంత వరకు కాపాడుకోవచ్చు. వాటిలో 8 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. కానీ చిన్న కార్లలో ఎయిర్ బ్యాగ్స్ ఉండవు. చిన్న కార్లను మధ్య తరగతి ప్రజలు మాత్రమే కొంటారు కాబట్టి.. వాళ్ల ప్రాణాలు కూడా ముఖ్యమేనన్నారు చెబుతున్నారు కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. చిన్న కార్లలోనూ కనీసం 6 ఎయిర్ బ్యాగ్స్ ఉండేలా కార్ల కంపెనీలు చర్యలు తీసుకోవాలని గడ్కరీ ఆదేశించారు.

లగ్జరీ కార్లలో మాత్రమే ఆటోమొబైల్ కంపెనీలు ఎయిర్ బ్యాగ్స్ ఏర్పాటు చేస్తున్నాయి. ఎంట్రీ లెవల్ కార్లలో ఎందుకు ఎయిర్ బ్యాగ్స్ ఏర్పాటు చేయడం లేదు? కార్లను తయారు చేసే ప్రతి కంపెనీ కచ్చితంగా అన్ని కార్లలో ఎక్కువ ఎయిర్ బ్యాగ్స్ ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాల ద్వారా సంభవించే మరణాల సంఖ్యను తగ్గేలా చర్యలు తీసుకోవాలన్నారు నితిన్ గడ్కరీ. అంతేకాదు మన దేశంలో సామాన్య మధ్య తరగతి ప్రజలే చిన్న కార్లను కొనుగోలు చేస్తారు. ఆ కార్లలో ఎయిర్ బ్యాగ్స్ లేకపోతే.. రోడ్డు ప్రమాదాల్లో వాళ్ల ప్రాణాలు పోయే ప్రమాదం ఉందన్నారు. అందుకే.. ఖచ్చితంగా అన్ని కార్లో ఆటోమొబైల్ కంపెనీలు.. కనీసం 6 ఎయిర్ బ్యాగ్స్‌ను ఏర్పాటు చేయాల్సిందేనని తెలిపారు.