మరోసారి పెట్రో దెబ్బ తప్పదా?

మరోసారి పెట్రో దెబ్బ తప్పదా?


న్యూఢిల్లీ: పెట్రోల్ రేటు మళ్లీ పెరిగే ప్రమాదం పొంచి ఉంది. మనదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే లీటరు పెట్రోల్ రేటు కొన్ని చోట్ల సెంచరీ దాటింది. డీజిల్ ధర రూ.90 వరకు పలుకుతోంది. పెట్రో రేట్లపై జనం మండిపడుతున్నారు. చాలా చోట్ల ఆందోళనలూ జరుగుతున్నాయి. ఇండియాలో పరిస్థితి ఇలా ఉంటే, ఇంటర్నేషనల్ మార్కెట్లలో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ రేటు ప్రస్తుతం 70 డాలర్లపైగా పలుకుతోంది. కరోనా వచ్చాక ఇంత భారీ ధర ఉండటం ఇదే తొలిసారి. ధరల పోకడ ఇలాగే ఉంటే, ఇండియన్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రేట్లను మరింత పెంచక తప్పకపోవచ్చని ఎనలిస్టులు చెబుతున్నారు.

ఇండియాపై ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ?

క్రూడాయిల్ రేటు 70 డాలర్లు దాటితే మన ఏఎంసీలు మళ్లీ ధరలను పెంచే చాన్సులు కనిపిస్తున్నాయి. ఇండియాలో పెట్రోరేట్లపై ధరల కంట్రోల్ను కొన్నేళ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వం తొలగించింది. ఇంటర్నేషనల్ మార్కెట్ రేట్ల ప్రకారం ధరలు వసూలు చేస్తామని ప్రకటించింది. ఈ ధరకు కేంద్రం, రాష్ట్రాల ట్యాక్సులు కలవడం వల్ల వెహికిలిస్టుల జేబు గుల్ల అవుతోంది. గత ఏడాది నవంబరు నుంచి ఇప్పటి వరకు పెట్రోల్ రేటును రూ.10 వరకు, డీజిల్ రేటును రూ.11 వరకు పెంచారు. ఈ ఏడాది మొదట్లో 40 డాలర్లు ఉన్న బ్యారెల్ ధర గత నెలాఖరున 66 డాలర్లకు చేరింది. అయితే గత తొమ్మిది రోజుల నుంచి పెట్రోల్ రేట్లు పెరగడం లేదు. 
సౌదీ నుంచి సప్లై తగ్గితే మాత్రం ధరలు మళ్లీ పెరుగుతాయని ఒక ఓఎంసీ సీనియర్ ఆఫీసర్ చెప్పారు. కరోనాతో వచ్చిన నష్టాలను భర్తీ చేసుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రో ప్రొడక్టులపై విపరీతంగా పన్నులు పెంచడంతో ధరలు జనానికి భారంగా మారాయి. ఉదాహరణకు ఢిల్లీలో పెట్రోల్పై 162 శాతం, డీజిల్పై 125 శాతం ట్యాక్సులు వసూలు చేస్తున్నారు. రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, మేఘాలయ, అసోం వంటి రాష్ట్రాలు పన్నులు తగ్గించినా, కేంద్రంవైపు నుంచి ఇప్పటి వరకు ప్రకటన రాలేదు.

ధరలు ఎందుకు పెరుగుతున్నాయ్ ?

ప్రపంచంలోనే అత్యధికంగా చమురు తయారు చేసే దేశాల్లో ఒకటైన సౌదీ అరేబియా ఆయిల్ ఫీల్డ్స్ భద్రత ప్రమాదంలో పడింది. యెమెన్లో అధికారం కోసం పోరాడుతున్న హుతి తిరుగుబాటుదారులు సౌదీ ఆయిల్ ఫీల్డ్స్ పై ఈ సంస్థ డ్రోన్ ద్వారా అటాక్ చేశారు. యెమెన్లో అధికార పార్టీకి సౌదీ సపోర్ట్ ఇవ్వడాన్ని సహించలేని హుతీలు సౌదీ క్రూడ్ స్టోరేజ్లను టార్గెట్ చేసుకుంటున్నారు. ఈ దాడిలో ఆస్తి, ప్రాణనష్టం జరగనప్పటికీ సౌదీ నుంచి క్రూడాయిల్ సప్లై తగ్గుతాయనే భయాలు మాత్రం ఉన్నాయి. ఇప్పటికే డిమాండ్కు తగినంత సప్లై లేదని, ఇది మరింత తగ్గవచ్చని అంటున్నారు. దాదాపు అన్ని దేశాల్లో కరోనా రిస్ట్రిక్షన్లు తొలగించడంతో వెహికల్స్ రోడ్లమీదకు వస్తున్నాయి. దీంతో పెట్రో ప్రొడక్టులకు డిమాండ్ పెరుగుతోంది. గత అక్టోబరు నుంచి పెరుగుతూనే ఉన్న క్రూడాయిల్ రేట్లు ఇంకా ఎక్కువ అవుతాయనే ఇండియా వంటి దేశాలు ఆందోళన చెందుతున్నాయి.