‘మాన్షన్​హౌస్’ ఎత్తుకెళ్లిన్రు

‘మాన్షన్​హౌస్’ ఎత్తుకెళ్లిన్రు

వైన్​షాపులో రూ. 2 లక్షల సరుకు చోరీ
ఇతర బ్రాండ్లను ముట్టుకోని దొంగలు

అశ్వారావుపేట, వెలుగు: వైన్​షాపులో దొంగలు పడ్డారు. షాపులో ఎన్నో బ్రాండ్లు ఉన్నా కేవలం మాన్షన్ ​హౌస్ ​మాత్రమే చోరీ చేశారు. దీని కోసం పెద్ద టాస్కే పెట్టుకున్నారు. సీసీ కెమెరాలు ధ్వంసం చేయడం, షాపుకు కన్నం వేయడం, తాళాలు పగలగొట్టడం, వెళ్లేటప్పుడు హార్డ్​డిస్క్​లను ఎత్తుకెళ్లడం ఇలా పక్కా ప్లాన్​ప్రకారం చోరీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట శివారులోని ఊట్లపల్లి రోడ్డులో ఉన్న వైన్స్ లో మంగళవారం రాత్రి చోరీ జరిగింది. ముందుగా దొంగలు సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, షాపు వెనుక హోల్ చేశారు. అక్కడ కేవలం బీర్​ కేసులు మాత్రమే కనిపించడంతో ప్రయత్నాన్ని మానుకున్నారు. మళ్లీ ముందుకు వచ్చి షట్టర్ తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ టీచర్స్​, బ్లాక్​డాగ్​లాంటి బ్రాండ్స్​ఎన్ని ఉన్నా ముట్టుకోకుండా కేవలం మాన్షన్​హౌస్​ బ్రాండ్ కు చెందిన రూ.రెండు లక్షల విలువగల లిక్కర్ కేసులను తీసుకెళ్లారు. వెళ్లేటప్పుడు సీసీ కెమెరాల హార్డ్ డిస్క్ లను కూడా పట్టుకెళ్లారు.  ఏపీలో మాన్షన్​హౌస్​కు ఎక్కువ డిమాండ్​ఉండడంతో ఈ పనికి ఒడిగట్టినట్టు తెలిసింది. నెల క్రితం కూడా ఊట్లపల్లి వైన్ షాపులో రూ. లక్ష విలువైన లిక్కర్ చోరీ చేశారు. సీఐ ఉపేంద్రరావు, ఎస్సై అరుణ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కొత్తగూడెం క్లూస్ టీం రంగంలోకి దింపి ఫింగర్ ప్రింట్స్ సేకరించారు.