నిధుల దుర్వినియోగం కేసు..మాజీ మంత్రికి ఐదేళ్ల జైలుశిక్ష

నిధుల దుర్వినియోగం కేసు..మాజీ మంత్రికి ఐదేళ్ల జైలుశిక్ష
  • రిటైర్డు ఐఏఎస్ కు కూడా మూడేళ్ల జైలు శిక్ష
  • తీర్పు విని కోర్టులో స్పృహ తప్పిన మాజీ మంత్రి ఇందిరా కుమారి

చెన్నై: నిధులు దుర్వినియోగం కేసులో తమిళనాడు మాజీ మంత్రి ఆర్. ఇందిరా కుమారితోపాటు ఆమె భర్త బాబు ఐదేళ్లు మరో నిందితుడుగా నిర్ధారించబడ్డ రిటైర్డు ఐఏఎస్ అధికారి షణ్ముగన్ కు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు స్పెషల్ కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. అలాగే మాజీ మంత్రి ఇందిరా కుమారికి జైలు శిక్షతోపాటు 10 వేల రుపాయాల జరిమానా విధించింది స్పెషల్ కోర్టు. 
1996 లో దాఖలైన నిధుల దుర్వినియోగం కేసులో మాజీ మంత్రి ఆర్. ఇందిరాకుమారి, ఆమె భర్త బాబు మరియు ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సహా ముగ్గురు వ్యక్తులు దోషులుగా నిర్ధారిస్తూ ఎమ్మెల్యేలు మరియు ఎంపీల ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అలీసియా తీర్పు వెలువరించారు. కోర్టు తీర్పు తెలుసుకునేందుకు హాజరైన మాజీ మంత్రి ఇందిరాకుమారి జైలు శిక్ష పడినట్లు తెలియగానే స్పృహ తప్పి పడిపోయారు. జైలు తీసుకెళ్లాల్సిన ఆమెను చికిత్స నిమిత్తం వీల్ చైర్లో ఆసుపత్రికి తీసుకెళ్లారు. 
1991-96లో అన్నాడిఎంకె పాలనలో ఇందిరాకుమారి సాంఘిక సంక్షేమ మంత్రిగా ఉన్నారు. అటు తర్వాత 2006లో విభేదాలతో బయటకు వచ్చి డిఎంకె పార్టీలో చేరారు. ఇందిరాకుమారి మంత్రిగా ఉన్న ఆమె భర్త బాబు.. వినికిడి, దృష్టి లోపాలు ఉన్నవారి కోసం ఒక పాఠశాల ఏర్పాటు చేశారు. ఆ పాఠశాలకు ఎమ్మెల్యే నిధుల నుంచి 15.45 లక్షలు దారి మళ్లించినట్లు ఆరోపణలు రావడంతో కేసు నమోదు చేశారు. ఈ కేసులో సాక్ష్యాలను పరిశీలించిన స్పెషల్ కోర్టు విచారణలో ఆరోపణలు వాస్తవమే అని తేల్చింది. మాజీ మంత్రి ఆమె భర్తతోపాటు రిటైర్డు ఐఏఎస్ అధికారికి జైలు శిక్ష విధించింది. అలాగే ఈ కేసుతో సంబంధం ఉన్న వెంకటకృష్ణన్ నిర్దోషిగా తేలగా మరొక నిందితుడు చిరుబాకరన్ కేసు విచారణ సమయంలోనే మరణించాడు.