కేరళలో పెరుగుతున్న కేసులు థర్డ్ వేవ్ కు సంకేతం

కేరళలో పెరుగుతున్న కేసులు థర్డ్ వేవ్ కు సంకేతం
  • మహారాష్ట్ర హోం మంత్రి రాజేష్ తోప్

ముంబయి: దక్షిణాదిలోని కేరళ రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు.. బయటపడుతున్న కొత్త వేరియంట్లు థర్డ్ వేవ్ కు సంకేతంలా కనిపిస్తోందని మహారాష్ట్ర హోం శాఖ మంత్రి రాజేష్ తోప్ హెచ్చరించారు. రెండో విడత మహారాష్ట్ర తీవ్రంగా దెబ్బతిన్న నేపధ్యంలో ఒకవేళ థర్డ్ వేవ్ మొదలైతే ఎదుర్కొనేందుకు యంత్రాంగాన్ని సన్నద్ధం చేస్తున్నామని చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ థర్డ్ వేవ్ మొదలైతే ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం ముఖ్యంగా వైద్య ఆరోగ్యశాఖ.. ప్రజలు సిద్ధంగా ఉండాలన్నారు. 
థర్డ్ వేవ్ గురించి ఐసీఎంఆర్ హెచ్చరికలు.. ప్రభుత్వ సూచనల మేరకు చిన్నపిల్లలకు వైద్య సదుపాయాలకు అత్యధిక ప్రాధాన్యత కల్పించి ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అలాగే ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్, మందులు, వైద్య సిబ్బంది కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గత 24 గంటల వ్యవధిలో 6,258 తాజా కరోనావైరస్ కేసులు, 254 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 62,76,057 కు, మరణాల సంఖ్య 1,31,859 కు చేరుకుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 
దేశంలో సగం కేసులు కేరళలోనే
గత కొన్ని వారాలుగా కేరళ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 22,056 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి, భారతదేశంలో మొత్తం కేసులు 43,654 కేసులు వస్తే ఒక్క కేరళలోనే 22 వేల కేసులు నమోదు కావడం కేరళలో కరోనా కేసుల ఉధృతికి అద్దం పడుతుంది. డెల్టా వేరియంట్ ప్రభావం వల్లే కేరళలో కరోనా కేసుల ఉధృతి పెరుగుతున్నాయన్న అంచనాల నేపధ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టింది. ప్రజలు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలంటూ అవగాహన కార్యక్రమాలు చేపడుతూ.. అధికార యంత్రాంగాన్ని సమాయాత్తం చేస్తోంది.