ప్రాణాలు పోయినా పట్టించుకోనోళ్లు ఇప్పుడొచ్చి ప్రచారం చేస్తున్నారు

ప్రాణాలు పోయినా పట్టించుకోనోళ్లు ఇప్పుడొచ్చి ప్రచారం చేస్తున్నారు
  • కరోనా టైంలో ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు..?
  • మనుషుల ప్రాణాలు పోతుంటే పట్టించుకోలేదు.. 
  • ఉద్యోగాల్లేక యువకులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పట్టించుకోనోళ్లు ప్రచారం చేయడమా..?
  • అందరూ భయపడుతుంటే ఈటల కుటుంబాన్ని పక్కన పెట్టి ఆస్పత్రుల చుట్టూ తిరిగారు
  • ఈటలకు మంచిపేరొస్తుందనే వైద్య ఆరోగ్యశాఖ నుంచి తప్పించారు
  • కరోనా టైంలో ఇప్పుడు కనిపిస్తున్న ఎమ్మెల్యేలు గానీ, మంత్రులు గాని ఎవరైనా కనిపించారా? 
  • హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల జమున ఇంటింటి ప్రచారం

కరీంనగర్: మనుషుల ప్రాణాలు పోయినా పట్టించుకోనోళ్లు.. ఉద్యోగాల్లేక యువకులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పట్టించుకోనోళ్లు ఇక్కడొచ్చి ప్రచారం చేయడమా..? కరోనా టైంలో ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు..? అందరూ భయపడుతుంటే ఈటల కుటుంబాన్ని పక్కన పెట్టి ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. ఈటలకు మంచిపేరొస్తుందనే వైద్య ఆరోగ్యశాఖ నుంచి తప్పించారు.. కరోనా టైంలో ఇప్పుడు కనిపిస్తున్న ఎమ్మెల్యేలు గానీ, మంత్రులు గాని ఎవరైనా కనిపించారా? అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున ప్రశ్నించారు. 
హుజూరాబాద్ నియోజకవర్గంలోని  వీణవంక మండలం ఘన్ముకుల గ్రామంలో ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తమ కోసం వచ్చిన ఈటల జమునకు గ్రామస్తులు మంగళ హారతులతో స్వాగతం పలికి మద్దతు తెలిపారు. శివాలయం, హనుమాన్ ఆలయం, పోచమ్మ గుడి లో ప్రత్యేక పూజలు చేశారు. అలాగే స్థానిక చర్చ్ లో క్రైస్తవ సోదరులతో కలసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఈ  సందర్బంగా ఈటల జమున మాట్లాడుతూ.. కరోనా టైంలోగాని.. అంతకు ముందుగాని ఇక్కడి ప్రజలు ఎలా ఉన్నారు?  అని ఎవరైనా కనీసం ఆలోచన చేశారా?  అని ప్రశ్నించారు. కరోనా టైంలో అందరూ భయం భయంతో బిక్కుబిక్కుమని గడుపుతుంటే..  మంత్రిగా ప్రజలకు తాను ధైర్యం చెప్పాల్సి ఉంది.. వారికి సరైన చికిత్స అందించాల్సి ఉందంటూ.. ఈటల రాజేందర్ కుటుంబాన్ని పక్కన పెట్టి హాస్పిటల్ కి  పేషెంట్ల దగ్గరికి వెళ్లి ధైర్యం ఇచ్చారని గుర్తు చేశారు. ప్రాణాలకు తెగించి ఈటల రాజేందర్ పనిచేస్తుంటే మంచి పేరు వస్తుందని చెప్పి వైద్య శాఖ నుంచి తీసివేశారని ఆమె ఆరోపించారు. 
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి.. కేసీఆర్ అహంకారానికి మధ్య పోరాటం
హుజూరాబాద్ ఉప ఎన్నిక తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి,  కేసీఆర్ అహంకారానికి మధ్య జరుగుతోందని ఈటల జమున పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రమంతా హుజూరాబాద్ నియోజకవర్గం వైపు చూస్తోందన్నారు. హుజూరాబాద్ ప్రజలు ధర్మం వైపు నిలవాలని ఆమె కోరారు. ఇక్కడికి వచ్చిన కొంతమంది నాయకులు ఈటెల రాజేందర్ గారు అభివృద్ధి చేయలేదని అంటున్నారని ప్రస్తావిస్తూ.. అభివృద్ధి అంటే ఏంటో అర్థం కావట్లేదు. ఇక్కడ జరిగింది అభివృద్ధి కాదా? అభివృద్ధి  అంటే కేసీఆర్ కుటుంబం బాగుపడటమా? అని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారు కుటుంబం అయిందని, తెలంగాణ రాష్ట్రం మాత్రం బతుకు తెరువు తెలంగాణ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు.