ఒడిశాలో రోడ్డు ప్రమాదం..కేంద్ర మంత్రికి గాయాలు

 ఒడిశాలో రోడ్డు ప్రమాదం..కేంద్ర మంత్రికి గాయాలు
  • మంత్రి కారును ఢీకొన్న ట్రాక్టర్.. 

బాలాసోర్ జిల్లా: కేంద్ర మంత్రి ప్రతాప్ చంద్ర సారంగి కారును ట్రాక్టర్ ఢీకొట్టింది. వెంటనే బ్రేకులు వేయడం వల్ల పెను ప్రమాదం తప్పిపోయినట్లు సమాచారం. ఓ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్న కేంద్రమంత్రి కారులో కుదుపులకు ముందుకు వెళ్లికొట్టుకోవడంతో ఆయన  ముక్కుకు స్వల్ప గాయం అయినట్లు సమాచారం. ఆస్పత్రి వర్గాలు విడుదల చేసిన ఫోటోలు కూడా ఇదే ధృవీకరిస్తున్నాయి.  బాలాసోర్ జిల్లాలోని పొడసులి వద్ద జరిగిందీ ప్రమాదం.
ప్రమాదంలో కేంద్రమంత్రి ప్రతాప్ చంద్ర సారంగితోపాటు ఉన్న వారికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ఒడిశాలో ఆయన ప్రయాణిస్తున్న కారును ఓ ట్రాక్టర్ ఢీకొనగా, ఆయన తేలికపాటి గాయాలతో బయటపడ్డారు. తనకు సన్నిహితులైన ఓ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతుండగా బాలాసోర్ జిల్లా నీలగిరి ప్రాంతంలో పొడసులి వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి కేంద్రమంత్రి కారును ఢీకొంది. వెంటనే సడెన్ బ్రేకులు వేయడం వల్ల పెను ప్రమాదం తప్పిపోయింది. వేగంగా ఢీకొట్టి ఉంటే ప్రమాదం తీవ్రత పెద్దగా ఉండేదని తెలుస్తోంది. ఈ రోడ్డు ప్రమాదంలో కేంద్రమంత్రితో పాటు ఆయన వ్యక్తిగత సహాయకుడు, సెక్యూరిటీ ఆఫీసర్, కారు డ్రైవర్ కు కూడా గాయాలైనట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే కేంద్రమంత్రి తదితరులను ఆసుపత్రికి తరలించారు. స్వల్ప గాయాలు కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ప్రమాదం జరిగిన విషయాన్ని కేంద్రమంత్రి ప్రతాప్ చంద్ర సారంగి ట్విట్టర్ ద్వారా స్వయంగా వెల్లడించారు. ముక్కుకు స్వల్ప గాయమైందని,  పూరీ జగన్నాథుడి దయ, తన మాతృమూర్తి దీవెనలతో క్షేమంగా బతికి బయటపడ్డానని తెలిపారు. తనతోపాటు కారులో ప్రయాణించిన సిబ్బంది కూడా క్షేమంగా ఉన్నారని కేంద్రమంత్రి వెల్లడించారు.