బెంగాల్ లో శాసనమండలి ఏర్పాటుకు తీర్మానం

బెంగాల్ లో శాసనమండలి ఏర్పాటుకు తీర్మానం
  • 50 ఏళ్ల తర్వాత ఏర్పాటు కానున్న శాసనమండలి

కోల్ కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో త్వరలో శాసనమండలి కొలువుతీరనుంది. దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత బెంగాల్ రాష్ట్రంలో శాసనమండలి ఏర్పాటు అవుతుండడం విశేషం. దీనికి సంబంధించిన శాసనమండలి బిల్లును ఇవాళ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. ప్రతిపక్ష బీజేపీ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించినా.. భారీ మెజారిటీ ఉన్న తృణమూల్ కాంగ్రెస్ బిల్లుకు ఆమోదం తెలిపింది. శాసనమండలి రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్నాటక, మహారాష్ట్ర, బీహార్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రమే ఉన్నాయి. మిగిలిన రాష్ట్రాల్లో మండలి లేదు. 
దాదాపు 50 ఏళ్లుగా బెంగాల్ రాష్ట్రంలో లేని శాసనమండలిని ఇప్పుడు మరోసారి కొలువుదీర్చేందుకు తృణమూల్ అధినేత్రి ప్రయత్నాలు చేస్తున్నారు. 1969 మార్చి 21వ తేదీన బెంగాల్ రాష్ట్రంలో శాసన మండలి అవసరం లేదంటూ రద్దు చేశారు. అప్పటి నుండి ఏ ప్రభుత్వం వచ్చినా మండలి ఏర్పాటు ఆలోచన చేయలేదు. అయితే ఇటీవల ఎన్నికల్లో తృణమూల్ ఘనవిజయం సాధించినా పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ సహా ఏడెనిమిది మంది మంత్రులు బీజేపీతో హోరాహోరి పోరాడి ఓడిపోయిన విషయం తెలిసిందే. వారికి పదవులు కట్టబెట్టేందుకే మండలిని ఏర్పాటు చేస్తున్నట్లు బీజేపీ సభ్యులు ఆరోపించారు. శాసన మండలి ఏర్పాటు వల్ల రాష్ట్ర ఖజానాకు భారమే తప్ప ఉపయోగం లేదని బీజేపీ నేతలు విమర్శించారు.