ఖరీదైన కూరగాయలు పండిస్తున్న యువరైతు.. కిలో లక్ష రూపాయలు

ఖరీదైన కూరగాయలు పండిస్తున్న యువరైతు.. కిలో లక్ష రూపాయలు
  • హాప్​షూట్స్​.. కిలో లక్ష!
  • బీహార్ రైతు పొలంలో ఖరీదైన కూరగాయ 
  • ఈ పంట సాగు దేశంలో ఇదే తొలిసారి

న్యూఢిల్లీ: ఒక్క కిలో కూరగాయల ధర అక్షరాలా.. లక్ష రూపాయలు. షాక్ అవుతున్నరా? అవును. ఆ కూరగాయల మొక్క పేరు హాప్ షూట్స్. ప్రపంచంలోనే అతి ఖరీదైన పంట అయిన హాప్ షూట్స్ ను మనదేశంలో తొలిసారిగా బీహార్ లో ఓ యువ రైతు సాగు చేస్తున్నాడు. ఇంటర్ తోనే చదువుకు టాటా చెప్పిన అమ్రేశ్ సింగ్ (38) ఇప్పుడు ప్రపంచంలోనే పిరమైన కూరగాయలు పండిస్తున్నడు. సదివింది ఇంటరే అయినా.. సాదాసీదా ఎవుసం కాకుండా ఇంటర్నేషనల్ రేంజ్ పంటను సాగు చేస్తున్న ఈ యువరైతు గురించి ఇటీవల ఐఏఎస్ ఆఫీసర్ సుప్రియా సాహు ట్వీట్ చేశారు. ఈ పంట మనదేశ రైతుల జీవితాలను మార్చేసే పంట అని పేర్కొన్నారు. 

మస్తు ఉపయోగాలు 
హాప్ షూట్స్ పండ్లు, పూలు, ఆకులు, కాండం.. అన్నింటికీ ఔషధ గుణాలు ఉంటాయి. బీర్ లలో మంచి ఫ్లేవర్ కోసం, స్టెబిలిటీ ఏజెంట్ గా దీని పూలను వాడతారు. ఇది టీబీని బాగా కంట్రోల్ చేస్తది. యాంగ్జైటీని తగ్గిస్తది. ఇన్ సోమ్నియా (నిద్రలేమి), డిప్రెషన్ లను పారదోల్తది. యాంటీబయోటిక్స్ తయారీలోనూ దీనిని వాడతారు. తిండి మంచిగ అరిగేలా చేస్తది. కేన్సర్ సెల్స్ ను చంపేస్తది. స్కిన్ ముడతలు పోగొట్టి యంగ్ లుక్ ను ఇస్తుంది. నిలువెల్లా ఔషధ గుణాలున్నయి కాబట్టే.. హాప్ షూట్స్ ధర కూడా ఆ రేంజ్ లోనే ఉంటదని చెప్తున్నారు. 

10 రెట్లు ఆదాయం 
 బీహార్ లోని ఔరంగాబాద్ జిల్లా కరమ్దీ గ్రామానికి చెందిన అమ్రేశ్ తనకున్న ఐదెకరాల పొలంలో హాప్ షూట్స్ తో పాటు ఇతర ఔషధ మొక్కలను కూడా పెంచుతున్నాడు. వారణాసిలోని ఇండియన్ వెజిటబుల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఐవీఆర్ఐ) నుంచి ఈ మొక్క నారును తీసుకొచ్చి అమ్రేశ్ సాగు చేశాడు. 60% పంట బాగుందని, ఈ సాగులో తాను సక్సెస్ అవుతానని చెప్తున్నాడు.  ఇతర పంటల కన్నా హాప్‌‌ షూట్స్ తో 10 రెట్ల లాభం వస్తుందని వెల్లడించాడు. ప్రస్తుతం ఒక్క కిలో హాప్ షూట్స్ కు ఇంటర్నేషనల్ మార్కెట్లో దాదాపు రూ. లక్ష వరకూ ధర ఉందన్నారు. ఈ పంట సాగును ప్రధాని నరేంద్ర మోడీ ఎంకరేజ్ చేయాలని, అలా చేస్తే రెండేళ్లలోనే రైతుల ఆదాయం10 రెట్లు పెరుగుతుందన్నారు. 

ఏమిటీ హాప్ షూట్స్? 
కూరగాయల మొక్కగా చెప్పుకుంటున్నా.. దీనిని ఎక్కువగా మూలికగానే వాడుతుంటరు. యూరప్ కంట్రీస్ లో ఇది చాలా పాపులర్. గంజాయి మొక్క జాతికి చెందిన హాప్ షూట్స్ కాండం, ఆకులు, పువ్వుల (హాప్ కోన్స్)కు చాలా డిమాండ్ ఉంది. దీని కొమ్మలను కూరగాయలుగా, ఇతర ఫుడ్స్ లో వాడుతారు. పూలు, పండ్లను ఎక్కువగా మందుల తయారీకి ఉపయోగిస్తారు. అయితే ఇవి మనదేశ మార్కెట్లలో మాత్రం అందుబాటులో ఉండవు. కావాల్సినవారు స్పెషల్ ఆర్డర్ చేసి.. చాలా రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది.