
హైదరాబాద్,వెలుగు : థర్డ్ ఫేజ్ లాక్ డౌన్ సడలింపులతో నాలుగైదు రోజులుగా హైదరాబాద్ రోడ్లు బిజీగా మారాయి. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఎంప్లాయీస్‌కు కొన్ని మినహాయింపులు ఇవ్వడంతో వెహికల్స్ రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. 50 రోజులతో పోల్చితే సోమవారం ఒక్కరోజే 40 శాతం వెహికల్స్ రోడ్డెక్కాయి. జనతా కర్ఫ్యూకు ముందు సిటీ రోడ్లపై కనిపించిన ట్రాఫిక్ జామ్‌లు మళ్లీ షురూ అయ్యాయి. పోలీసులు కొన్ని ప్రాంతాల్లో చెక్ పోస్టులను ఎత్తేసి, ట్రాఫిక్ సిగ్నల్స్ ఆపరేట్ సిస్టమ్ స్టార్ట్ చేశారు.
ఉదయం 7 నుంచి లెక్కింపు
లాక్ డౌన్ రూల్స్‌ని లెక్కచేయకుండా వాహనదారులు రోడ్లపైకి వస్తుండగా పోలీసులు ‘ఆటోమెటిక్ ట్రాఫిక్ కౌంటర్ అండ్ క్లాసిఫికేషన్’ సిస్టమ్ తో వెహికల్స్ మూవ్ మెంట్ ను పర్యవేక్షిస్తున్నారు. 9 ప్రధాన జంక్షన్లలోని 80 సీసీ కెమెరాల ద్వారా బయటికొచ్చిన వాటిని లెక్కిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి ప్రతి 2 గంటలకోసారి కౌంట్ చేస్తున్నారు. సోమవారం సాయంత్రం 6 గంటల వరకు లక్షా 44 వేల వెహికల్స్ ట్రావెల్ చేసినట్లు గుర్తించారు. బేగంపేట్, సికింద్రాబాద్, సీటీసీ, రసూల్ పుర, నల్లగొండ క్రాస్ రోడ్స్, అసెంబ్లీ ఏరియాల్లో వీటి సంఖ్య పెరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రతి 2 గంటలకోసారి సుమారు 25 వేల వెహికల్స్ సంఖ్య పెరుగుతూ వచ్చినట్లు ట్రాఫిక్ సెల్ అంచనా వేసింది. ఇందులో 72 శాతం వాహనాలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఎంప్లాయీస్వి కాగా ..12 శాతం మంది కన్ స్ట్రక్షన్, ఇండస్ట్రియల్, వైన్స్ పేరుతో ట్రావెల్ చేసినవి ఉన్నాయి. ఇతర వాహనదారులు నిత్యావసరాలు, ఎమర్జెన్సీ సర్వీసుల కోసం రోడ్డెక్కినట్లు తెలిసింది.
రద్దీ ఏరియాల్లో సిగ్నల్స్ ఆపరేట్
పెరుగుతున్న ట్రాఫిక్ తో పోలీసులు రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో సిగ్నల్స్ ఆపరేట్ చేశారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచే వెహికల్ చెకింగ్ ప్రారంభించారు. సిటీ మెయిన్ జంక్షన్లలో ఎంప్లాయీస్ ఐడీ కార్డులు, వెహికల్ పాస్ లు చెక్ చేశారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాహనదారులపై కేసులు ఫైల్ చేశారు. పర్మిషన్ ఉంటేనే వెహికల్స్ రోడ్లపై ట్రావెల్ చేసేలా చూస్తున్నామని..ట్రాఫిక్ జామ్ ఏరియాల్లో సమస్యలు రాకుండా చర్యలు తీసుకుం టున్నట్టు ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు.
ట్రాఫిక్ పోలీసులకు థర్మల్ స్కానింగ్
హైదరాబాద్‌లో వెహికల్స్ రద్దీ పెరుగుతుండడంతో ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయ్యారు. సిబ్బంది కరోనా బారిన పడకుండా ఉండేందుకు సేఫ్టీ ప్రికాషన్స్ లో భాగంగా సోమవారం నుంచి థర్మల్ స్కానింగ్ చేపట్టారు. ట్రాఫిక్ కంట్రోల్ కాంప్లెక్స్ లో డ్యూటీ సిబ్బందితో పాటు విజిటర్స్ కు స్కానింగ్ చేస్తున్నారు. ప్రతి రోజు ఉదయం సిబ్బంది హెల్త్ కండీషన్ వివరాలను సేకరిస్తున్నారు. మాస్కులు, శానిటైజేషన్ వాడేలా చర్యలు తీసుకోవాలని అదనపు సీపీ,ట్రాఫిక్ అనిల్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.