కరోనా నుంచి రిలీఫ్‌‌‌‌ కోసం 1.70 లక్షల కోట్ల ప్యాకేజీ

న్యూఢిల్లీ: కరోనా వైరస్ బారి నుంచి దేశ ప్రజలను కాపాడేందుకు, లాక్‌‌డౌన్ పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం మెగా  ప్యాకేజీని ప్రకటించింది. పేదలు, కూలీలు, రైతులు, మహిళలు, ఎంప్లాయీస్​తోపాటు కరోనాపై అలుపెరగని పోరాటం చేస్తున్న హెల్త్​ వర్కర్స్​కు లాభం కలిగేలా కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ. 1.70 లక్షల కోట్లతో ప్రధాన మంత్రి గరీబ్​​ కల్యాణ్​ యోజన (పీఎంజీకేవై) కింద ఆర్థిక ప్యాకేజీని అనౌన్స్​ చేసింది. ఈ ప్యాకేజీలో భాగంగా  ఫుడ్ సెక్యురిటీని, క్యాష్ ట్రాన్స్‌‌ ఫర్స్‌‌ ను కేంద్రం ప్రవేశపెట్టింది. రేషన్​ కార్డులున్న 80 కోట్ల మందికి వచ్చే నెల నుంచి 3 నెలలు నెలకు 5 కిలోల చొప్పున బియ్యం లేదా 5 కిలోల చొప్పున గోధుమలు ఫ్రీగా అందజేయనున్నట్లు వెల్లడించింది. ప్రతి రేషన్​ కార్డుకు 3 నెలల పాటు ప్రతి నెల ఫ్రీగా  కిలో పప్పును సరఫరా చేయనుంది. జన్​ధన్​ ఖాతాలున్న మహిళలకు నెల నెల రూ. 500 చొప్పున డబ్బును 3 నెలలు జమచేయనుంది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు రూ. 1,000 ఖాతాలో వేయనుంది. లాక్‌‌డౌన్ వల్ల ఏ ఒక్క పేద కూడా ఆకలితో అలమటించొద్దనే ప్యాకేజీని ప్రకటిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ చెప్పారు. గురువారం పథకం వివరాలు ఆమె వెల్లడించారు. ‘‘ఇది కరోనాపై మెగా రిలీఫ్​ ప్యాకేజీ. దేశంలోని మూడింట రెండో వంతు జనాభాకు లాభం జరుగుతుంది. తినడానికి, చేతిలో డబ్బులకు ఎవరికీ ఇబ్బంది రావొద్దు.  కరోనా వల్ల ఎదురవుతున్న గడ్డు పరిస్థితులను ఎదుర్కొనేందుకు  ప్యాకేజీ తోడ్పతుందని ఆశిస్తున్నం” అని పేర్కొన్నారు. రేషన్​ కింద ఇచ్చే ఆహార ధాన్యాల కోసం రూ. 45 వేల కోట్లు, రైతులకు జమ చేసే రూ. 2,000 కోసం రూ. 16,000 కోట్లు, జనధన్​ ఖాతాల కింద వేసే క్యాష్​ కోసం రూ. 31,000 కోట్లు, ఫ్రీ కుకింగ్​ గ్యాస్​ కోసం రూ. 13,000 కోట్లు ఖర్చవుతుందని వివరించారు.

ఫ్రీగా 5 కిలోల బియ్యం, కిలో పప్పు

దేశంలో రేషన్​ కార్డులున్న 80 కోట్ల మందికి ఉచితంగా మూడునెలల పాటు నెల నెల ఐదు కిలోల బియ్యం లేదా ఐదు కిలోల గోధుమలను కేంద్రం అందజేయనుంది. వీటితోపాటు కుటుంబానికి నెల నెల ఒక కిలో చొప్పున పప్పును కూడా ఫ్రీగా అందజేయనుంది. పబ్లిక్​ డిస్టిబ్యూషన్​ సిస్టమ్​(పీడీఎస్​) కింద అంటే రేషన్​ షాపుల ద్వారా వీటిని సరఫరా చేస్తారు. నేషనల్ ఫుడ్​ సెక్యూరిటీ యాక్ట్​ (ఎన్​ఎఫ్​ఎస్​ఏ) పరిధిలో ఇప్పటికే దేశవ్యాప్తంగా రూ. 2 కిలో గోధుమలు, రూ. 3 కిలో బియ్యం పంపిణీ చేస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుతం దేశంలోని ఎఫ్​సీఐ గోడౌన్లలో 58.49 మిలియన్​ టన్నుల ఆహార ధాన్యాలు నిల్వ ఉన్నాయి. ఇందులో 30.97 మిలియన్​ టన్నుల బియ్యం, 27.52 మిలియన్​ టన్నుల గోధుమలు ఉన్నాయి.

మహిళల జన్​ ధన్​ ఖాతాల్లో నెలకు రూ. 500

జన్ ధన్ అకౌంట్లు ఉన్న 20 కోట్ల 40 లక్షల మంది మహిళలకు వచ్చే మూడు నెలల పాటు నెలకు రూ. 500 చొప్పున క్యాష్​ను కేంద్రం జమ చేయనుంది. అంటే మొత్తంగా ఒక్కో మహిళకు రూ. 1, 500 అందనున్నాయి.  ప్రస్తుత గడ్డు పరిస్థితుల్లో ఇంటి అవసరాలకు మహిళలకు ఇది తోడ్పాటునందిస్తుందని, దీని కోసం మొత్తం రూ. 31,000 కోట్లు ఖర్చవుతాయని  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ తెలిపారు. 63 లక్షల స్వయం సహాయక బృందాలు (ఎస్​హెచ్​జీ)లకు ఎలాంటి తనఖా లేకుండా ఇచ్చే లోన్లు రెండింతలు పెంచి రూ. 20 లక్షలుగా చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు. దీని వల్ల 7 కోట్ల హౌస్​ హోల్డర్స్​కు ప్రయోజనం కలుగనుంది.

హెల్త్​ అండ్​ శానిటేషన్​ వర్కర్లకు స్పెషల్​ హెల్త్​ ఇన్సూరెన్స్​

కరోనాపై అలుపెరగని పోరాటం చేస్తున్న హెల్త్​ వర్కర్లకు స్పెషల్​ హెల్త్​ ఇన్సూరెన్స్​ను కేంద్రం ప్రకటించింది. ఇందులో భాగంగా డాక్టర్లకు, స్పెషలిస్టులకు, నర్సులకు, వార్డ్​ బాయ్స్​కు, హెల్త్​ టెక్నీషియన్స్​కు,  పారామెడికల్ సిబ్బందికి, శానిటేషన్​ వర్కర్లకు, ఆశా వర్కర్లకు ఒక్కొక్కరికి రూ. 50 లక్షల హెల్త్​ ఇన్సూరెన్స్​ కల్పిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ చెప్పారు. కరోనాపై పోరాటం చేస్తున్న వీరికి ఎలాంటి యాక్సిడెంట్​ జరిగినా ఈ ఇన్సూరెన్స్​ వర్తిస్తుందని ఆమె పేర్కొన్నారు. దీంతో  25 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుంది.

ఎంప్లాయీస్​కు, వర్కర్స్​కు..

ఆర్గనైజ్డ్​ సెక్టార్​లో పనిచేసే ఉద్యోగులకు కేంద్రం భరోసానిచ్చింది. కంపెనీలో వందలోపు ఉద్యోగులుండి, అందులో 90 శాతం మంది నెలకు రూ. 15 వేల కంటే తక్కువ జీతం అందుకునేవారుంటే.. వారందరికీ పీఎఫ్‌‌ కాంట్రిబ్యూషన్​ను వచ్చే 3 నెలల పాటు ప్రభుత్వమే భరించనుంది. అంటే ప్రతి నెలా ఉద్యోగుల 12 శాతం కాంట్రిబ్యూషన్, కంపెనీల 12 శాతం కాంట్రిబ్యూషన్ మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది. పీఎఫ్​ రూల్స్​ను సవరించింది.  ఉద్యోగి తన పీఎఫ్ అకౌంట్ నుంచి ఇప్పుడు ఏకంగా 75 శాతం మొత్తాన్ని విత్‌‌డ్రా చేసుకోవచ్చు. లేదంటే మూడు నెలల జీతానికి సమానమైన క్యాష్​ను వెనక్కి తీసుకోవచ్చు. ఇది పీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తంపై ఆధారపడి ఉంటుంది. దీని వల్ల నాలుగున్నర కోట్ల మందికిపైగా వర్కర్లు లాభం పొందే అవకాశం ఉంది. కన్‌‌స్ట్రక్షన్‌‌ రంగంలో పనిచేసే 3.5 కోట్ల మంది రిజిస్టర్ వర్కర్ల కోసం రూ. 31 వేల కోట్ల వెల్‌‌ఫేర్ ఫండ్‌‌ను కేంద్రం తీసుకువచ్చింది. ఇక, మినరల్‌‌ ఫండ్‌‌ను కరోనా కట్టడి కోసం వాడుకునేందుకు రాష్ట్రాలకు అవకాశం కల్పించింది.

రైతు అకౌంట్​లో రూ. 2 వేలు

ప్రధానమంత్రి కిసాన్​ సమ్మాన్​ నిధి (పీఎం కిసాన్​)  స్కీం కింద ప్రతి రైతు ఖాతాలో తక్షణ సాయంగా రూ. 2 వేలను జమ చేయనున్నారు. దీనివల్ల వెనువెంటనే 8 కోట్ల 69 లక్షల మంది రైతులు లాభం పొందనున్నారు. రైతులకు పెట్టుబడి సాయం కోసం పీఎం కిసాన్​ స్కీం కింద ఏటా మూడు విడతలుగా రూ. 2000 చొప్పున మొత్తం రూ. 6000 కేంద్రం అందిస్తున్న విషయం తెలిసిందే. లాక్​డౌన్​ దృష్ట్యా  తొలి ఇన్​స్టాల్​మెంట్​ను ఏప్రిల్​  మొదటివారంలో ఇవ్వాలని నిర్ణయించామని, దీని వల్ల రైతులకు కాస్త రిలీఫ్​ లభిస్తుందని  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ​అన్నారు. ఇందు కోసం రూ. 16,000 కోట్లు ఖర్చు కానుంది.

వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు రూ. 1000

వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు రూ. 1000 ఎక్స్‌‌ గ్రేషియా అమౌంట్‌‌ను ఇవ్వనున్నట్లు నిర్మలా సీతారామన్​ ప్రకటించారు. దీని వల్ల 3 కోట్ల మంది ప్రయోజనం పొందనున్నారు. ఇందు కోసం రూ. 3వేల కోట్లు ఖర్చు కానుంది.

ఫ్రీగా ఎల్పీజీ సిలిండర్లు

ప్రధాన మంత్రి ఉజ్వల్​ యోజన కింద రాబోయే  మూడు నెలల పాటు ఉచితంగా ఎల్పీజీ  సిలిండర్లను కేంద్రం అందించనుంది. దీని వల్ల 8 కోట్ల 30లక్షల మంది బీపీఎల్ ఫ్యామిలీస్​కు లాభం చేకూరుతుంది.

ఉపాధివేతనాలు పెంపు

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వేతనాలను కేంద్రం పెంచింది. రోజువారీ వేతనాలను రూ. 182 నుంచి రూ. 202 కు పెంచుతున్నట్లు నిర్మలా సీతారామన్​ వెల్లడించారు.

Latest Updates