
- టాప్ ప్లేయర్లను రిలీజ్ చేసిన ఐపీఎల్ ఫ్రాంచైజీలు
- ఆరుగురిని వదులుకున్న చెన్నై
- శాంసన్‌కు రాజస్తాన్ కెప్టెన్సీ
- ఫ్రాంచైజీ క్రికెట్ కు మలింగ గుడ్‌బై
ఐపీఎల్-14 ఆక్షన్‌కు టైమ్ దగ్గరపడుతున్న వేళ.. ఫ్రాంచైజీలన్నీ తమ టీమ్‌లపై దృష్టిసారించాయి..! ఈ నేపథ్యంలో చాలా మంది స్టార్ ప్లేయర్లను రిలీజ్ చేయడంతో పాటు… డొమెస్టిక్ క్రికెటర్లకు ప్రమోషన్లూ ఇస్తున్నాయి..! నైపుణ్యం ఉన్నా.. అవకాశాలు ఇవ్వలేని ప్లేయర్లను వేలంలోకి పంపించడంతో పాటు అవసరం వస్తారనుకున్న క్రికెటర్ల కోసం మరోసారి కోట్లు వెచ్చించేందుకు రెడీ అవుతున్నాయి..! ఓవరాల్‌గా బడ్జెట్, లీగ్ రూల్స్‌ను దృష్టిలో పెట్టుకుని కొత్త కుర్రాళ్ల వేటలో పడ్డాయి..!
అయితే 12 ఏళ్లుగా ముంబై బౌలింగ్ భారాన్ని మోసిన లసిత్ మలింగ.. ఫ్రాంచైజీ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పగా, యూఏఈలో ఐపీఎల్ ఆడకుండా వచ్చేసిన స్టార్ ప్లేయర్ సురేశ్ రైనాపై సీఎస్కే ఫ్రాంచైజీ మరోసారి నమ్మకం పెట్టింది..! ఇక ఫ్రాంచైజీల ఆక్షన్ పర్స్ కూడా భారీగా పెరగడంతో ఈసారి వేలంలోనూ సంచలనాలు ఆశించొచ్చు..! ఓవరాల్‌గా రిటెయిన్.. రిలీజ్డ్ ప్లేయర్ల జాబితాలు రెడీ అయిపోయిన నేపథ్యంలో ప్రస్తుతం ఏ టీమ్‌లో ఎవరెవరు ఉన్నారు.. ఎవరెవర్ని వదిలేశారో చూద్దాం..!!
న్యూఢిల్లీ: ఈసారి ఇండియన్ ధనాధన్ పోరు కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీలు సరికొత్తగా సిద్ధమవుతున్నాయి. కరో నా దెబ్బకు కుదేలైన ఆర్థిక వ్యవస్థలను దృష్టిలో పెట్టుకుని ఈసారి భారీ మార్పులకు శ్రీకారం చుట్టాయి. గత 13 ఏళ్లుగా టీమ్‌లకు నమ్మినబంటులుగా ఉన్న స్టార్ ప్లేయర్లను సైతం వదిలించుకుంటున్నాయి. ముఖ్యంగా తమ బడ్జెట్‌కు అనుగుణంగా ఉన్న కుర్రాళ్లతోనే టీమ్‌ను నడిపించాలని భావిస్తున్న ఫ్రాంచైజీలు.. ఫారిన్ స్టార్లకూ చెక్ పెట్టాయి. ప్లేయర్ల రిటెయిన్కు బుధవారమే చివరి రోజు కావడంతో అన్ని ఫ్రాంచైజీలు పెద్ద మొత్తంలో బలగాన్ని తగ్గించుకున్నాయి. అసలే టీమిండియా చేతిలో సిరీస్ ఓడిపోయి మంటమీదున్న ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు.. రాజస్తాన్ రాయల్స్ ఊహించని షాకిచ్చింది. స్మిత్ కాంట్రాక్ట్‌ను ఫ్రాంచైజీ రెన్యువల్ చేయలేదు. అలాగే అతని స్థానంలో సంజూ శాంసన్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. టీమ్ డైరెక్టర్‌గా కుమార సంగక్కరను తీసుకొచ్చి ఆసీస్ ఆధిపత్యానికి చెక్ పెట్టింది. మరోవైపు ఫ్రాంచైజీ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చిన లసిత్ మలింగను ముంబై వదులుకోవాల్సి వచ్చింది. గత సీజన్లో ఘోరంగా నిరాశపర్చిన చెన్నై సూప ర్కింగ్స్ ఆరుగురు ప్లేయర్లను వదిలేసుకుంది. ఇందులో స్టార్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్, మురళీ విజయ్ ఉన్నారు. అయితే ఊహించని విధంగా సురేశ్ రైనాను రిటెయిన్ చేసుకుని అందర్ని ఆశ్చర్యపరిచింది. యూఏఈలో లీగ్ స్టార్టింగ్‌కు ముందే వైదొలిగిన రైనాపై ఫ్రాంచైజీ పెద్దలు ఆగ్రహంతో ఉన్నారని వార్తలు వచ్చినా.. అవన్నీ అవాస్తవాలేనని తేలిపోయాయి.
వచ్చే నెల 11న ఆక్షన్!
అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఐపీఎల్–14 ఆక్షన్ వచ్చే నెల 11న జరిగే చాన్సెస్ ఉన్నాయి. ఈ మేరకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సంకేతాలిచ్చింది. రిటెయిన్ ప్లేయర్ల లిస్ట్‌ను ఫ్రాంచైజీలు అందజేసిన తర్వాత.. కొత్త క్రికెటర్ల రిజిస్ట్రేషన్‌కు కొంత గడువు ఉంటుంది. ఆ తర్వాత ఆక్షన్‌ను నిర్వహిస్తారు. అయితే వేలాన్ని ఎక్కడ నిర్వహిస్తారన్న దానిపై బీసీసీఐ క్లారిటీ ఇవ్వలేదు. కానీ చెన్నైలో ఇంగ్లండ్‌తో జరిగే తొలి రెండు టెస్ట్‌ల మధ్య లభించే బ్రేక్‌లో ఈ ఆక్షన్ ఉండొచ్చని బోర్డు వర్గాల సమాచారం. ఫిబ్రవరి 5–9, 13–17 మధ్య రెండు టెస్ట్‌లు జరుగుతాయి. ఐపీఎల్‌లోకి రెండు కొత్త ఫ్రాంచైజీలు వస్తాయని మొదట్లో ఊహాగానాలు వచ్చినా.. ఈ ఏడాదికి ఎనిమిది టీమ్‌లతోనే లీగ్ నడుస్తుందని బోర్డు స్పష్టం చేసింది. మరోవైపు ఈ ఏడాది లీగ్‌ను ఎక్కడ నిర్వహించాలన్న దానిపై కూడా బోర్డు కసరత్తులు చేస్తోంది ఇప్పటికైతే ఇండియాలోనే లీగ్ ఉంటుందని బోర్డు నమ్మకంగా ఉంది.
ఖజానా పెరిగింది..
టాప్ ప్లేయర్లను రిలీజ్ చేయడంతో ఈ సీజన్ ఆక్షన్‌లో ఖర్చు చేసేందుకు ఫ్రాంచైజీల ఖజానా భారీగా పెరిగింది. గత వేలం తర్వాత సీఎస్కే ఖాతాలో రూ. 15 లక్షలు మాత్రమే మిగిలాయి. కానీ, ఈసారి ఆరుగురిని రిలీజ్ చేయడంతో ఆ టీమ్ పర్స్ రూ. 22.9 కోట్లకు పెరిగింది. పంజాబ్ వద్ద అత్యధికంగా రూ. 53.2 కోట్లు ఉన్నాయి. ఏకంగా 10 మందిని రిలీజ్ చేసిన ఆర్సీబీ ఖాతాలో 35.7 కోట్లు, రాజస్తాన్ దగ్గర 34.85 కోట్లు, ముంబై ఇండియన్స్ ఖాతాలో 15.35కోట్లు మిగిలాయి. ఢిల్లీ దగ్గర 12.8 కోట్లు, కోల్‌కతా వద్ద 10.85 కోట్లు ఉండగా సన్‌రైజర్స్ ఖజానాలో అతి తక్కువగా 10.75 కోట్లు ఉన్నాయి. కాగా, ఈ సీజన్లో ఫ్రాంచైజీల ఆక్షన్ పర్స్‌ను మరో రూ. 3 కోట్లకు పెంచే చాన్స్ ఉంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్
రిటెయిన్: వార్నర్, విలియమ్సన్, మనీశ్ పాండే, ప్రియమ్ గార్గ్, విరాట్ సింగ్, వృద్ధిమాన్ సాహా, జానీ బెయిర్‌స్టో, శ్రీవత్స్ గోస్వామి, విజయ్ శంకర్, మహ్మద్ నబీ, మిచెల్ మార్ష్, జేసన్ హోల్డర్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, భువనేశ్వర్, రషీద్ ఖాన్, నటరాజన్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్, సిద్ధార్థ్ కౌల్, బాసిల్ థంపి, షాబాజ్ నదీమ్.
రిలీజ్డ్ ప్లేయర్లు: బిల్లీ స్టాన్లెక్, ఫాబియన్ అలెన్, సంజయ్ యాదవ్, బావనక సందీప్, ఎర్రా పృథ్వీ రాజ్.
చెన్నై సూపర్‌కింగ్స్
రిటెయిన్: ధోనీ, జడేజా, రైనా, డుప్లెసిస్, సామ్ కరన్, డ్వేన్ బ్రావో, హేజిల్‌వుడ్, ఎంగిడి, అంబటి రాయుడు, కర్ణ్ శర్మ, మిచెల్ శాంట్నర్, శార్దూల్ ఠాకూర్, రుతురాజ్ గైక్వాడ్, జగదీశన్, ఇమ్రాన్ తాహిర్, దీపక్ చహర్, కేఎం ఆసిఫ్, సాయి కిశోర్.
రిలీజ్డ్ ప్లేయర్లు: హర్భజన్, పీయుష్ చావ్లా, కేదార్ జాదవ్, మురళీ విజయ్, మోను కుమార్ సింగ్, షేన్ వాట్సన్ (రిటైర్డ్).
ముంబై ఇండియన్స్
రిటెయిన్: రోహిత్, పొలార్డ్, హార్దిక్ పాండ్యా, ట్రెంట్ బౌల్ట్, డికాక్, సూర్యకుమార్ యాదవ్, బుమ్రా, రాహుల్ చహర్, ఇషాన్ కిషన్, క్రునాల్ పాండ్యా, క్రిస్ లిన్, ధవళ్ కులకర్ణి, మోషిన్ ఖాన్, అనుకుల్ రాయ్, ఆదిత్య తారె, సౌరభ్ తివారి, జయంత్ యాదవ్, అన్మోల్ప్రీత్ సింగ్.
రిలీజ్డ్ ప్లేయర్లు: లసిత్ మలింగ (రిటైర్డ్), కూల్టర్‌నైల్, ప్యాటిన్సన్, రూథర్‌ఫోర్డ్, మెక్లీనగన్, ప్రిన్స్ బల్వంత్ రాయ్, దిగ్విజయ్ దేశ్‌ముఖ్.
కోల్‌కతా నైట్‌రైడర్స్
రిటెయిన్: మోర్గాన్, రసెల్, దినేశ్ కార్తీక్, కమలేశ్ నాగర్కోటి, కుల్దీప్ యాదవ్, లోకి ఫెర్గుసన్, నితీశ్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, రింకూ సింగ్, సందీప్ వారియర్, శివమ్ మావి, శుభ్‌మన్ గిల్, సునీల్ నరైన్, కమిన్స్, రాహుల్ త్రిపాఠి, వరుణ్ చక్రవర్తి, అలీ ఖాన్, టిమ్ సీఫెర్ట్.
రిలీజ్డ్ ప్లేయర్లు: టామ్ బాంటమ్, క్రిస్ గ్రీన్, సిద్ధేశ్ లాడ్, నిఖిల్ నాయక్, సిద్ధార్థ్, హారి గుర్నీ.
ఢిల్లీ క్యాపిటల్స్
రిటెయిన్: ధవన్, రబాడ, పృథ్వీ షా, రహానె, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, అన్రిచ్ నోకియా, మార్కస్ స్టోయినిస్, హెట్మయర్, అక్షర్ పటేల్, అమిత్ మిశ్రా, ఇషాంత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, లలిత్ యాదవ్, హర్షల్ పటేల్, క్రిస్ వోక్స్, డానియెల్ సామ్స్, అవేశ్ ఖాన్, ప్రవీణ్ దూబే.
రిలీజ్డ్ ప్లేయర్లు: మోహిత్ శర్మ, కీమో పాల్, అలెక్స్ క్యారీ, జేసన్ రాయ్, తుషార్ దేశ్‌పాండే.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
రిటెయిన్: కోహ్లీ, డివిలియర్స్, దేవదత్ పడిక్కల్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, నవదీప్ సైనీ, ఆడమ్ జంపా, షాబాజ్ అహ్మద్, జోష్ ఫిలిప్పీ, కేన్ రిచర్డ్సన్, ప్రవీణ్ దేశ్‌పాండే.
రిలీజ్డ్ ప్లేయర్లు: మొయిన్ అలీ, శివమ్ దూబే, గురుకీరత్ సింగ్ మన్, ఆరోన్ ఫించ్, క్రిస్ మోరిస్, పవన్ నేగి, పార్థివ్ పటేల్ (రిటైర్డ్), స్టెయిన్ (అందుబాటులో లేడు), ఇస్రు ఉడాన, ఉమేశ్ యాదవ్.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్
రిటెయిన్: కేఎల్ రాహుల్, క్రిస్ గేల్, మయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్, మన్దీప్ సింగ్, సర్ఫరాజ్ ఖాన్, దీపక్ హుడా, ప్రభ్‌సిమ్రన్ సింగ్, మహ్మద్ షమీ, క్రిస్ జోర్డాన్, దర్శన్ నల్కండే, రవి బిష్ణోయ్, మురుగన్ అశ్విన్, హర్షదీప్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, ఇషాన్ పోరెల్.
రిలీజ్డ్ ప్లేయర్లు: మ్యాక్స్‌వెల్, కరుణ్ నాయర్, విల్జోన్, జగదీశ్ సుచిత్, ముజీబుర్ రెహమాన్, కాట్రెల్, జిమ్మీ నీషమ్, కృష్ణప్ప గౌతమ్, తజీందర్ సింగ్.
రాజస్తాన్ రాయల్స్
రిటెయిన్: సంజూ శాంసన్, బెన్ స్టోక్స్, ఆర్చర్, బట్లర్, రియాన్ పరాగ్, శ్రేయస్ గోపాల్, రాహుల్ తెవాటియా, లామ్రోర్, కార్తీక్ త్యాగీ, ఆండ్రూ టై, జైదేవ్ ఉనాద్కట్, మయాంక్ మార్కండే, యశస్వి జైస్వాల్, అనూజ్, డేవిడ్ మిల్డర్, వోహ్రా, ఉతప్ప.
రిలీజ్డ్ ప్లేయర్లు: స్టీవ్ స్మిత్, అంకిత్ రాజ్‌పుత్, ఓషేన్ థామస్, అక్ష్ సింగ్, వరుణ్ ఆరోన్, టామ్ కరన్, అనిరుధ్ జోషీ, శశాంక్ సింగ్.