విశాఖ విషాదం: ఇద్ద‌రు చిన్నారులు, ఒక‌ ఎంబీబీఎస్ విద్యార్థి స‌హా 11 మంది మృతి

క‌రోనా లాక్ డౌన్ స‌మ‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని విశాఖ‌ప‌ట్నంలో అత్యంత విషాద‌క‌ర ఘ‌ట‌న జరిగింది. గురువారం తెల్ల‌వారు జామున మూడున్న‌ర గంట‌ల స‌మ‌యంలోని ఆర్ఆర్ వెంక‌టాపురంలో ఉన్న‌ ఎల్జీ పాలిమ‌ర్ కంపెనీ నుంచి స్టైరిన్ అనే విష వాయువు లీకైంది. కొన్ని నిమిషాల్లోనే చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లో గాలి కాలుష్య‌మైపోయింది. గాలి విష‌పూరితంగా మార‌డంతో దాన్ని పీల్చిన వారికి క‌ళ్లు మండిపోవ‌డంతో పాటు చ‌ర్మంపై ద‌ద్దులు రావ‌డం, ఊపిరాడ‌క‌పోవ‌డం లాంటి ఇబ్బందులు రావ‌డంతో ప్ర‌జ‌లు ప‌రుగులు తీశారు. ఆ స‌మ‌యంలోనే కొంత మంది ఊపిరాడ‌క సొమ్మ‌సిల్లి ప‌డిపోయారు.
ఇప్ప‌టికే ఇద్ద‌రు చిన్నారులు, ఒక‌ ఎంబీబీఎస్ విద్యార్థి స‌హా 11 మంది మ‌ర‌ణించార‌ని అధికారులు తెలిపారు. దాదాపు 200 మందికి పైగా ఆస్ప‌త్రి పాల‌య్యారు. బాధితులంద‌రినీ విశాఖ‌లోని కింగ్ జార్జ్ హాస్పిట‌ల్ స‌హా ప‌లు కార్పొరేట్ ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించి చికిత్స చేయిస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు. లాక్ డౌన్ స‌మ‌యంలో పాలిమ‌ర్ ముడిప‌దార్థం స్టోర్ చేసిన ట్యాంక్ మైంటెనెన్స్ ను కంపెనీ ప‌ట్టించుకోక‌పోవడం వ‌ల్ల ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు ప్రాథ‌మిక ద‌ర్యాప్తులో తేలింది. కంపెనీలో కొంత మంది ఉద్యోగుల‌కు మైంటెనెన్స్ కోసం లాక్ డౌన్ స‌మ‌యంలో పాసులు ఇచ్చినా ఆ సంస్థ నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించింద‌ని తెలుస్తోంది.

మృతుల వివ‌రాలు:

కుందన శ్రేయ (6), ఎన్‌.గ్రీష్మ (9), చంద్రమౌళి (19), గంగాధర్, నారాయణమ్మ (35), అప్పల నరసమ్మ (45), గంగరాజు (48), మేకా కృష్ణ మూర్తి (73)తో పాటు మరో ముగ్గురు మ‌ర‌ణించారు. మృతుల్లో చంద్రమౌళి అనే యువ‌కుడు విశాఖ పట్నంలోని ఆంధ్ర యూనివ‌ర్సిటీ మెడిక‌ల్ కాలేజీలో ఎంబీబీఎస్‌ తొలి సంవ‌త్స‌రం చదువుకుంటున్నాడు. వీరిలో కొంత మంది విష‌వాయువు నుంచి త‌ప్పించుకునేందుకు వారి ఇళ్ల నుంచి దూరంగా వెళ్తుండ‌గానే దాని తీవ్ర‌త‌కు అక్క‌డిక‌క్క‌డే కుప్ప‌కూలిపోయి ప్రాణాలు విడిచారు.

Latest Updates