పద్నాలుగేళ్ల తర్వాత పుట్టిన పాప..ఆస్పత్రిలో ఆహుతయ్యింది!

  • భంఢారా ఆస్పత్రి ప్రమాదంలో విషాదం

భంఢారా, నాగ్​పూర్(మహారాష్ట్ర): పుట్టిన పిల్లలు పుట్టినట్లే పురుట్లోనే చనిపోతుంటే చివరికి ఓ పాప బతికింది. పద్నాలుగేండ్ల తర్వాత తమ కలలు పండాయన్న ఆ తల్లిదండ్రుల ఆనందం వారం కూడా నిలవలే. తక్కువ బరువుతో పుట్టిందని ఆస్పత్రిలో చేర్చితే, అగ్ని ప్రమాదంలో లేక లేక పుట్టిన పాప కూడా ఆహుతయ్యింది. మహారాష్ట్రలోని భంఢారా ఆస్పత్రి ప్రమాదంలో ఓ పేరెంట్స్ కు ఎదురైన విషాదమిది. భంఢారా జిల్లా సకోలి తహసీల్​లోని ఉస్గావ్​ గ్రామానికి చెందిన హిరకన్య, హీరాలాల్​ దంపతులకు ముగ్గురు పిల్లలు పురుట్లోనే చనిపోయారు. నాలుగోసారి గర్భం దాల్చడంతో  హిరకన్య చాలా జాగ్రత్తగా మసలుకుంది. ఈసారైనా తన బిడ్డ బతకాలని మొక్కుకుంది. ఆమె మొక్కులు ఫలించి నెలలు నిండకముందే ఈ నెల 6న ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో పద్నాలుగేండ్ల ఎదురుచూపులు ఫలించాయని ఆ దంపతులు మురిసిపోయారు. అయితే, బరువు తక్కువగా ఉండడంతో డాక్టర్లు ఆ పసికందును స్పెషల్​ న్యూబోర్న్ కేర్​ యూనిట్​కు తరలించారు. రోజురోజుకూ పాప బరువు పెరుగుతోందని, మరో వారంలో డిశ్చార్జి చేస్తామని డాక్టర్లు చెప్పడంతో హిరకన్య, హీరాలాల్​ సంతోషించారు. వాళ్ల ఆనందం నాలుగు రోజులు కూడా నిలవలేదు. శనివారం ఆస్పత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో వాళ్ల పాపతో పాటు మరో తొమ్మిది మంది శిశువులు ప్రాణాలు కోల్పోయారు. పాప చనిపోయిందన్న వార్త విని ఆ తల్లి తట్టుకోలేకపోయింది. ఇలాంటి దారుణం ఎవరికీ జరగొద్దని, పిల్లలు ఆటపాటలతో సంతోషంగా బతకాలని రోదిస్తూ చెప్పింది.

రూ.2 లక్షల పరిహారం: ప్రధాని మోడీ

భంఢారా ఆస్పత్రి ప్రమాదంలో బిడ్డలను పోగొట్టుకున్న తల్లిదండ్రులకు ప్రధాని నరేంద్ర మోడీ రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడ్డ వారికి రూ.50 వేల చొప్పున నేషనల్​ రిలీఫ్​ ఫండ్​ నుంచి అందజేస్తామని తెలిపారు.

Latest Updates