ప్రభుత్వంలో 10 వేల మంది ఉద్యోగాలు ఊస్ట్

కాంట్రాక్టు, ఔట్‌‌‌‌‌‌‌‌ సోర్సింగ్‌ ఉద్యోగులు 10 వేల మందిని తీసేసిన్రు
కరోనా టైమ్ లో చిన్న ఉద్యోగులపై సర్కారు దెబ్బ
రోడ్డున పడ్డ ఈజీఎస్ఎఫ్‌ఏలు, భగీరథ వర్క్‌ ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్లు, హార్టికల్చర్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగులు
మరో 11 వేల మందికి 3 నెలలుగా జీతాల్లేవ్‌.. ఇంకొందరికి సగం జీతాలే
ఏపీలో ఔట్‌ సోర్సింగ్‌‌‌‌‌‌‌‌ బోర్డు ఏర్పాటు చేసి భరోసా ఇచ్చిన జగన్‌ సర్కారు
ఇక్కడ కొత్తవి రాకపోగా ఉన్నవి ఊడుతున్నాయని ఆవేదన

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రమొస్తే ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు జాబులు పర్మనెంట్ అయితయనుకున్నరు. తెలంగాణలో కాంట్రాక్టు, ఔట్‌‌ సోర్సింగ్ ఉద్యోగాలు ఉండవని.. వాళ్లందరినీ రెగ్యులరైజ్ చేస్తమని అప్పట్లో కేసీఆర్ హామీ ఇస్తే సంబురపడిపోయిన్రు. కానీ ఆరేండ్లయినా ఇచ్చిన హామీ నెరవేర్చకపోగా కరోనా కష్టకాలంలో ఆ చిరుద్యోగులను సెక్షన్ల లెక్కన సర్కారు తీసేస్తూ వస్తోంది. లాక్‌‌డౌన్‌ తర్వాత ఏర్పడిన ఆర్థిక లోటును సాకుగా చూపి వాళ్లపై ఇంకింత కఠినంగా వ్యవహరిస్తోంది. 3 నెలల టైమ్‌‌లో ఉపాధి హామీ, భగీరథ, హార్టికర్టిల్చర్ డిపార్ట్‌ మెంట్లలో సుమారు 10 వేల మందిని ఉద్యోగాల్లోంచి తీసేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల పరిధిలోని విద్యాసంస్థల్లో పని చేస్తున్న మరో 11 వేల మందికి ‘నో వర్క్.. నో పే’ విధానాన్ని అమలు చేస్తోంది. ఇంకొన్ని శాఖల్లోని కాంట్రాక్టులు ఉద్యోగులకు సగం జీతాలే ఇస్తోంది.

ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లతో మొదలు
జాతీయ ఉపాధి హామీ పథకం (ఈజీఎస్‌‌) కింద రాష్ట్రంలో7,500మంది ఫీల్డ్ అసిస్టెంట్లు (ఎఫ్‌‌ఏ) పనిచేస్తుండేవారు. వీళ్లంతా తమ డిమాండ్ల కోసం మార్చి 12న సమ్మె స్టార్ట్‌ చేశారు. కరోనా వ్యాప్తితో 10 రోజుల్లోనే సమ్మె విరమించి డ్యూటీలో చేరడానికి వెళ్లగా అధికారులు చేర్చుకోలేదు. సమ్మె టైమ్‌‌లో డ్యూటీ చేసిన 247 మందినే తీసుకున్నారు. వీళ్ల కాంట్రాక్టునూ రెన్యువల్ చేయలేదు. ఈ మూడు నెలల టైమ్‌‌లో సంబంధిత మంత్రిని, అధికారులను కలిసినా, ఆందోళనలు చేసినా స్పందన లేదు.

భగీరథ కాంట్రాక్టు ఉద్యోగులనూ..
మిషన్ భగీరథ పథకం కోసం బీటెక్, ఎంటెక్ పూర్తి చేసిన 662 మంది వర్క్ ఇన్‌స్పెక్టర్లు, 47 మంది జూనియర్ అసిస్టెంట్లను 2015లో కాంట్రాక్టు పద్ధతిలో ప్రభుత్వం రిక్రూట్ చేసుకుంది. 11 నెలలుగా జీతాలివ్వకున్నా రేపో, మాపో ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయన్న ఆశతో వాళ్లంతా పనిచేస్తూ వస్తున్నారు. వీళ్లనూ ఈ నెల 1న ప్రభుత్వం ఇంటికి పంపింది.

హార్టికల్చర్‌‌లో 500 మంది
హార్టికల్చర్ డిపార్ట్‌ మెంట్లో ఔట్‌‌ సోర్సింగ్ పద్ధతిలో ఆఫీస్ అసిస్టెంట్లు, గార్డెనింగ్, కంప్యూటర్ ఆపరేటర్లుగా సుమారు 500 మంది పని చేసేవారు. బడ్జెట్ సాకుగా చూపి వీళ్లందరికీ ఏప్రిల్‌‌లో కాంట్రాక్టు రెన్యువల్ చేయలేదు. అప్పటికే 3 నెలలుగా జీతాలు రాక ఇబ్బంది పడుతున్న ఆ చిరుద్యోగులు కరోనా కష్టకాలంలో ఉద్యోగం పోయి రోడ్డున పడ్డారు.

వీళ్లకు నో వర్క్‌‌.. నో పే
కరోనా వల్ల మూతబడిన స్కూళ్లు, కాలేజీలు, వెల్ఫేర్ హాస్టళ్లు, గురుకులాల్లో పని చేసే ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు పని లేకపోవడంతో సర్కారు జీతాలివ్వడం లేదు. రాష్ట్రంలోని 2,245 ఎస్సీ, ఎస్టీ, బీసీ వెల్ఫేర్ హాస్టళ్లలో ఔట్ సోర్సింగ్ వర్కర్లు 8 వేల మంది, ఎస్సీ గురుకులాల్లో పని చేసే అసోసియేట్ లెక్చరర్లు 300మంది, గిరిజన గురుకులాల్లో పనిచేసే నాన్ టీచింగ్ స్టాఫ్ వెయ్యి మంది, పార్ట్ టైమ్‌‌టీచర్లు 1,500 మంది, గురుకులాల్లో పని చేసే ల్యాబ్ అసిస్టెంట్లు 450 మంది, గిరిజన డిగ్రీ గురుకులాల లెక్చరర్లు 300 మంది ఉన్నారు. వీళ్లంతా 3 నెలలుగా జీతాలు రాక ఇబ్బంది పడుతున్నారు. వీళ్లలో చాలా మందికి ఏటా ఏప్రిల్‌‌లో చేసే కాంట్రాక్టు రెన్యువల్ కూడా కాలేదు. ఈ విద్యాసంస్థల్లో పని చేసే పర్మనెంట్ స్టాఫ్‌‌కు మాత్రం ప్రభుత్వం జీతాలిస్తోంది.

టూరిజంలో సగం జీతమే
టూరిజం డిపార్ట్‌ మెంటులో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు ఆ శాఖ సగం జీతమే ఇస్తోంది. జూనియర్ అసిస్టెంట్లు, సూపర్వైజర్లు, జనరల్ హెల్పర్లకు సాధారణ రోజుల్లో రూ.12వేల నుంచి రూ.17వేలవరకు వస్తుండగా సగం కోతతో రూ. 6వేల నుంచి రూ.9వేలే వస్తోందని వాళ్లు ఆవేదన
చెందుతున్నారు.

ఏపీలో ఔట్ సోర్సింగ్ ఎంప్లా యీస్‌‌‌‌కు కార్పొరేషన్
కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై మన ప్రభుత్వం సెక్షన్ల వారీగా వేటు వేస్తుంటే ఆంధ్రప్రదేశ్‌‌లో జగన్‌ సర్కారు ఈ నెల 3న వాళ్లకోసం ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ ‌ఔట్‌‌ సోర్స్‌డ్‌ సర్వీసెస్‌(ఆప్కాస్‌‌)ను ప్రారంభించడం విశేషం. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీలో గానీ, జీతభత్యాల్లో గానీ అవినీతి, అక్రమాలకు తావు లేకుండా ఈ సంస్థను ఏర్పాటు చేసినట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. తొలి రోజే 50,449 మందికి ఉద్యోగ నియామక పత్రాలను ఆన్‌‌లైన్‌‌లో సీఎం అందజేశారు. వీళ్లకు జీతం,ఈఎస్‌‌ఐ, పీఎఫ్ ల  సౌకర్యంలోఇబ్బందులు ఉండబోవని జగన్ భరోసానిచ్చారు.

నోటీస్ ఇవ్వకుండా తీసేశారు
భగీరథ స్కీమ్ మొదలైనప్పటి నుంచి ఐదేళ్లుగా పనిచేస్తున్నాం. ప్రాజెక్టు మొదలవక ముందు సర్వే, డీపీఆర్ రూపొందించడంలోనూ భాగస్వాములమైనం. ప్రాజెక్టు కంప్లీట్ అయ్యేవరకు పని చేసినం. రెండు నెలల క్రితం రెగ్యులర్ చేస్తామని రాత పూర్వక ఆదేశాలూ ఇచ్చారు. కానీ ఎలాంటి నోటీస్ పీరియడ్ లేకుండా జులై 1న తీసేశారు. ఇంకా 9 నెలలు జీతాలు ఇవ్వాలి. మమ్మల్ని కొనసాగించాలి.
– వినయ్ కుమార్,
రాష్ట్ర నాయకుడు, మిషన్ భగీరథ వర్క్ ఇన్ స్పెక్టర్స్ అసోసియేషన్

14 ఏళ్ల సర్వీస్‌‌కు ఇదా గిఫ్ట్
ఉపాధి హామీ పథకం స్టార్టయినప్పటి నుంచి పని చేస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లు దాదాపు 5 వేల మంది ఉన్నారు. రాష్ట్ర మొస్తే ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయనుకున్నం. మార్చిలో సమ్మెకు దిగినా కరోనా వ్యాప్తి వల్ల పరిస్థితులను అర్థం చేసుకుని 10 రోజుల్లోనే సమ్మె విరమించినం. ఇదే అదనుగా ప్రభుత్వం మమ్మల్ని తొలగించి మా పనులను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించింది. అత్తెసరు జీతాలతో 14 ఏళ్లు సర్వీస్‌ చేస్తే ఇదేనా బహుమానం.
– బొల్గూరి రవి, ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్

3 నెలలుగా జీతాల్లేవ్‌
సోషల్ వెల్పేర్ గురుకుల కాలేజీల్లో 300 మంది అసోసియేట్ లెక్చరర్లుగా పనిచేస్తున్నం. జాబ్ చార్టులో ట్యూటర్ అని ఉన్నా రెగ్యులర్ లెక్చరర్లతో సమానంగా డ్యూటీ చేస్తున్నం. మా కాంట్రాక్టును ఏప్రిల్‌‌లో రెన్యువల్ చేశారు. కానీ 3 నెలలుగా జీతాలిస్తలేరు.
– గురుకులంలో పనిచేసే అసోసియేట్ లెక్చరర్

For More News..

సెక్రటేరియట్ శిథిలాల ట్రాన్స్ పోర్టుకే రూ. 15 కోట్లు!

12 హాస్పిటళ్లు తిరిగినా పట్టించుకోలే.. ఊరికి వాపస్ వెళ్తూ యాక్సిడెంట్లో మృతి

సర్కార్ దవాఖాన్లకు పోతలేరు

Latest Updates