మేడిగడ్డ బ్యారేజీ లో ఫస్ట్ టైం 10 టీఎంసీలు

మేడిగడ్డ బ్యారేజీ లో  ఫస్ట్ టైం 10 టీఎంసీలు

కాటారం(మహదేవపూర్), వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రాణమైన మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీ లో వాటర్ స్టోరేజీ మొదటిసారి బుధవారం10 టీఎంసీలకు చేరుకుంది. ఇంజనీర్లు వాటర్ స్టోరేజీ చేసి గేట్ల సామర్థ్యాన్ని పరిశీలిస్తున్నారు. బ్యారేజీ నిర్మాణం పూర్తి చేసుకున్న తరువాత  తెలంగాణ, మహారాష్ట్ర లో వర్షాల కారణంగా గోదావరి పూర్తి స్థాయిలో ప్రవహించింది. వరదల కారణంగా సుమారు 2 నెలల పాటు మేడిగడ్డ బ్యారేజీ మొత్తం 85 గేట్లు పూర్తి స్థాయిలో ఎత్తి నీటిని కిందికి వదిలారు. ఆ సమయంలో నాలాల వద్ద గైడ్ బండ్స్ నిర్మాణం పూర్తి కాలేదు. దీంతో బ్యాక్ వాటర్ సమీప వ్యవసాయ భూములను ముంచుతుందనే కారణంతో 7.5 టీఎంసీల వాటర్ మాత్రమే స్టోరేజ్ చేసి కన్నెపల్లి పంపు హౌస్ నుంచి పంపింగ్ కూడా చేశారు. ప్రాణహిత లో ఇన్ ఫ్లో తగ్గిపోగా నెల రోజులుగా కన్నెపల్లి పంపు హౌస్ నుంచి వాటర్ పంపింగ్ పూర్తి గా బంద్ చేసి మేడిగడ్డ బ్యారేజీ వద్ద వాటర్ స్టోరేజ్ చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీ టోటల్ స్టోరేజీ కెపాసిటీ 16.17 టీఎంసీ లు కాగా  గేట్ల సామర్థ్యం టెస్టింగ్ కోసం వాటర్ స్టోరేజీ 13 టీఎంసీల వరకు కొనసాగిస్తామని ఇరిగేషన్ ఆఫీసర్లు తెలిపారు.

గేట్ల వద్ద లీకేజీ లు

మేడిగడ్డ బ్యారేజీ వద్ద బ్లాక్ 1 నుంచి మొదలుకొని  బ్లాక్ 8 వరకు సుమారు 20 గేట్లలో నుంచి వాటర్ లీకేజీ జరుగుతోంది. వాటర్ స్టోరేజీ పెరుగుతున్న కొద్దీ గేట్ల వద్ద ఒత్తిడి పెరిగి లీకేజీ లు సహజమని, గేట్ల కోసం ఏర్పాటు చేసిన బీడింగ్ ల వద్ద లీకేజీలు కామనేనని, వాటిని సరిచేస్తారని ఇరిగేషన్ ఆఫీసర్లు తెలిపారు. వర్షాకాలంలోపు అన్ని రకాలుగా బ్యారేజీ సామర్థ్యం టెస్ట్ చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో పర్ఫెక్ట్ గా బ్యారేజీ ని సిద్ధం చేయడానికి రేయింబవళ్లు ఇంజనీర్లు కృషి చేస్తున్నారని ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు తెలిపారు.