100 కోట్ల విలువైన భూములు కబ్జా

ఎస్సారెస్పీ కెనాల్​ జాగాలను కలిపేసుకున్నరు

ఆక్రమణదారుల్లో రూలింగ్​ పార్టీ లీడర్లు

 722 ఎకరాలు అన్యాక్రాంతం అయినట్టు తేల్చిన సర్వే

మెట్ పల్లి, వెలుగు:  జగిత్యాల జిల్లాలో ఎస్సారెస్పీ  కాకతీయ కెనాల్​ భూములు పెద్దఎత్తున కబ్జా అయ్యాయి. కెనాల్​ను ఆనుకుని ఉన్న ప్రాజెక్టు భూములను పొలాల్లో కలుపుకొన్నారు. కబ్జా చేసిన భూములను కొందరు ఇప్పటికే ఇతరులకు అమ్ముకున్నట్టు ఆఫీసర్లు గుర్తించారు.  మెట్ పల్లి, కోరుట్ల, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కథలపూర్, మేడిపల్లి మండలాల్లో నిర్వహించిన సర్వేలో రూ. 100 కోట్ల విలువైన 722 ఎకరాలు అన్యాక్రాంతమయినట్టు  తేలింది. ఒక్క మెట్​పల్లి మండలంలోనే 253 ఎకరాల కెనాల్​ భూములు ఇతరుల చేతుల్లోకి వెళ్లాయి. కెనాల్​ భూములను గుర్తించి.. బౌండరీ ఏర్పాటు చేశారు. ఇందులో 585 ఎకరాలు పొలాల్లో కలుపుకోగా… 137 ఎకరాల్లో కొందరు  ఇండ్లు కట్టుకున్నారు. కొన్నిచోట్ల రియల్​ఎస్టేట్​ వెంచర్లలో జాగాలను కలుపుకోగా.. టౌన్లు, మండల కేంద్రాల్లో కెనాల్​ మీద కబ్జా చేసిన జాగాల్లో కమర్షియల్​ సంస్థలు, షాపులు కట్టారు.  ఎస్సారెస్పీ కింద మెట్​పల్లి సబ్​డివిజన్​పరిధిలో 65,672 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ భూములకు కాకతీయ కెనాల్​ ద్వారా నీరందిస్తున్నారు. ఈ కాలువ  0 కిలోమీటర్ నుంచి  68.3 కిలోమీటర్​ వరకు సబ్​డివిజన్​ పరిధిలో ప్రవహిస్తోంది.  భవిష్యత్తులో అవసరాలకు పనికొచ్చేలా మెయిన్​ కెనాల్​పక్కన రెండు వైపులా 300 మీటర్ల చొప్పున స్థలాన్ని వదిలారు. కొన్నిచోట్ల 360 మీటర్ల వరకు జాగా వదిలారు. క్రమంగా  ఇరువైపులా భూములను కబ్జా చేశారు. ఎక్కడా కెనాల్​ పక్కన  పది మీటర్లకు మించి ఖాళీ జాగా కనిపించడం లేదు.

రూలింగ్​ పార్టీ లీడర్ల కబ్జా    

ఎస్సారెస్పీ భూములను కబ్జా చేసినోళ్లలో టీఆర్ఎస్ లీడర్లు కూడా ఉన్నారు.  మెట్​పల్లికి చెందిన టీఆర్ఎస్ కౌన్సిలర్​ భర్త రాజేశ్​ పట్టా ల్యాండ్​ అని నమ్మించి 38 గుంటల కెనాల్​ భూమిని గుంటకు రూ. 50 వేల చొప్పున  రాజ్​కుమార్​ అనే వ్యక్తికిఅమ్మాడు. రాజ్​కుమార్​ రిజిస్ట్రేషన్​ చేసుకున్నాడు. సర్వే తర్వాత అది కెనాల్​ భూమిగా తేలింది. ఇదేంటని అడిగితే రాజేశ్​ స్పందించట్లేదని, తనకు న్యాయం చేయాలని రాజ్​కుమార్​ వాపోతున్నాడు.

సర్వేతో  రైతు బంధు కట్

ఎస్సారెస్పీ స్థలాలు కబ్జా చేసి సాగు చేసుకుంటున్న వారికి సర్వే తర్వాత రైతుబంధు కట్ అయ్యింది. కొందరు ఆఫీసర్లు ఎస్సారెస్పీ భూములను రికార్డుల్లో పట్టా భూములుగా  మార్చారు.  వీటి అమ్మకాలు, కొనుగోళ్లు మామూలుగానే జరిగాయి. దీంతో పట్టాలు ఉండడంతో మొదటి విడత రైతుబంధు డబ్బులు ఇచ్చారు. సర్వే తర్వాత వాటిని ఎస్సారెస్పీ భూములుగా రికార్డులు సవరించడంతో రైతుబంధు రాలేదు.

రిపోర్ట్​ పంపించాం

మెట్ పల్లి, కోరుట్ల, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, కథలాపూర్, మేడిపల్లి  మండలాల్లో ఎస్సారెస్పీ భూములపై సర్వే చేశాం. ఆయా మండలాల ఆఫీసర్ల రిపోర్టు ప్రకారం 722 ఎకరాలు కబ్జాకు గురైనట్లు తేలింది. ఎస్సారెస్పీ కెనాల్​వెళ్తున్న గ్రామాల్లో సర్వే చేసి బౌండరీలు ఏర్పాటు చేశాం. సర్వే రిపోర్టును జిల్లా ఆఫీసర్లకు పంపించాం. పెద్దాఫీసర్ల  ఆర్డర్​ ప్రకారం చర్యలు తీసుకుంటాం.-వినోద్ కుమార్, ఆర్డీవో, కోరుట్ల.

 

 

Latest Updates