ప్రపంచం అంతానికి ఇంకా 100 సెకన్లే!

    డూమ్స్​డే క్లాక్ సమయం20 సెకన్లు ముందుకు

    రాత్రి11:58:00 గంటల నుంచి11:58:20కి మార్చిన్రు

    న్యూక్లియర్​వెపన్స్, క్లైమేట్​చేంజ్, దేశాల మధ్య టెన్షన్స్..

   ప్రపంచ నాశనానికి ముప్పు పెరిగిందంటున్న సైంటిస్టులు 

ప్రపంచ నాశనానికి ఇంకా100 సెకన్ల టైమే మిగిలి ఉందట! వంద సెకన్లే ఉండటమేంటీ? అనుకుంటున్నారా! ఇది మన గడియారాల లెక్క కాదు.. డూమ్స్ డే క్లాక్ లెక్క లెండి. అణు యుద్ధాలు, విపత్తులు, సామాజిక అల్లర్లు, ఇతర అనేక అంశాల కారణంగా ప్రపంచం అంతమైపోయే టైంను ఈ డూమ్స్ డేలో సెట్ చేస్తుంటారు. ఇందులో మిడ్ నైట్12 అయిందంటే ఇక యుగాంతానికి టైం వచ్చేసినట్లేనన్నమాట. తాజాగా దీని ముల్లును మరింత ముందుకు జరిపారు. దీంతో  డూమ్స్ డే గడియారంలోని ముల్లు మిడ్​నైట్​(రాత్రి 12 గంటలు)కు గతంలో ఎప్పుడూ లేనంత దగ్గరగా వచ్చింది. 2018లో డూమ్స్​డే క్లాక్ సమయం​రాత్రి 11:58 గంటలు కాగా,  ఇప్పుడు 20 సెకన్లు ముందుకు జరిపారు. అంటే మనం యుగాంతానికి మరో 100 సెకన్ల దూరంలోనే ఉన్నామన్నమాట. ఈ రెండేళ్లలో అణ్వాయుధాల ఒప్పందాల నుంచి దేశాలు వైదొలగడం, వాతావరణంలో విపరీతమైన మార్పులు రావడం, దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోవడం, ఫేక్​ఇన్ఫర్మేషన్​విస్తరిస్తుండడం, అణ్వాయుధాల వినియోగంలో టెక్నాలజీని వాడుతుండడం ఎక్కువ కావడంతో శాస్త్రవేత్తలు క్లాక్​సమయాన్ని మారుస్తూ ప్రపంచ వినాశనాన్ని తెలియజేశారు. న్యూక్లియర్, క్లైమేట్​కండీషన్స్​లో ఎలాంటి మార్పు రాలేదని, ప్రపంచ దేశాల నేతలు తీసుకున్న చర్యలేవీ ప్రమాద తీవ్రతను తగ్గించేలా లేవని ఈ గడియారాన్ని ఏర్పాటు చేసిన బులెటిన్​ఆఫ్​ది అటామిక్​సైంటిస్ట్స్​(బీఏఎస్) ప్రతినిధులు వెల్లడించారు.

ఇవీ కారణాలు…

డూమ్స్​డే క్లాక్​సమయాన్ని మార్చడానికి కారణాలను సైంటిస్టులు పేర్కొన్నారు. ఈ రెండేళ్లలో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను వివరించారు. అమెరికా విధానాల నుంచి ఆస్ట్రేలియాలోని కార్చిచ్చు వరకు ఇందులో వెల్లడించారు. ‘‘ఇరాన్​తో న్యూక్లియర్​డీల్​నుంచి యూఎస్ తప్పుకుంది. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  ఇరాన్​మిలిటరీ లీడర్​సోలేమానీని అమెరికా చంపిన తర్వాత అవి మరింత ఎక్కువయ్యాయి. అంతేకాకుండా జర్మనీ, ఫ్రాన్స్, యూకే లు కూడా న్యూక్లియర్​డీల్​నుంచి తప్పుకోవాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ట్రంప్​ప్రతిపాదించారు” అని బీఏఎస్​ప్రెసిడెంట్, సీఈఓ రాచెల్​బ్రోన్​సన్​తెలిపారు. మరోవైపు అమెరికా, ఉత్తర కొరియా మధ్య చర్చలు పూర్తి స్థాయిలో ఫలించలేదన్నారు. అణ్వాయుధాలను కట్టడి చేయడంలో మనం విఫలమవుతున్నామని, అవి అంతకంతకూ విస్తరించే అవకాశం ఉందని రాచెల్​ఆందోళన వ్యక్తం చేశారు. ఆయుధాలను ఉపయోగించేందుకు ఆర్టిఫిషియల్​ఇంటెలిజెన్స్​(ఏఐ)ను అభివృద్ధి చేస్తున్నారని, మిలటరీ ఆపరేషన్స్ లో ఈ టెక్నాలజీ వాడుతున్నారని బీఏఎస్​పేర్కొంది. మరోవైపు ఫేక్ ఇన్ఫర్మేషన్ వ్యాప్తి విపరీతంగా పెరిగిపోతోందని, సోషల్ మీడియాలో ఫేక్​వీడియోలు, ఆడియోలు చక్కర్లు కొడుతున్నాయని, ఇవన్నీ ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయని వెల్లడించింది. ఇక వాతావరణ పరంగా హీట్​వెవ్స్ ఎక్కువవుతున్నాయని, మంచు కరిగిపోతోందని, కార్చిచ్చులు చెలరేగుతున్నాయని ఆందోళన  వ్యక్తం చేసింది. ఇందుకు ఉదాహరణగా ఇటీవల ఆస్ట్రేలియాలో చెలరేగిన అతిపెద్ద కార్చిచ్చును ప్రస్తావించింది.

అసలేంటీ క్లాక్?

మానవులు తమ చర్యలతో ప్రపంచ వినాశనానికి పాల్పడుతున్నారని, వీరు దానికి ఎంత దగ్గరగా వెళ్తున్నారో హెచ్చరించేందుకే ఈ డూమ్స్​ డే గడియారం ఏర్పాటు చేశారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో తొలిసారి అణ్వాయుధాలు తయారు చేసిన మాన్‌హట్టన్‌ ప్రాజెక్టులో భాగస్వాములైన అమెరికా సైంటిస్టులు 1945లో ‘బులెటిన్‌ ఆఫ్‌ ద అటామిక్‌ సైంటిస్ట్స్‌’ అనే జర్నల్‌ను ప్రారంభించారు. వీరే 1947లో ఈ గడియారం ఏర్పాటు చేశారు. తొలుత అణ్వాయుధాలు, అణు యుద్ధాల వల్ల పొంచి ఉన్న ప్రమాదాన్ని మాత్రమే దీని ద్వారా హెచ్చరించేవారు. 2007 నుంచి వాతావరణ మార్పుల వల్ల కలిగే ముప్పును కూడా తెలియజేస్తున్నారు. ప్రపంచం వినాశనానికి ఎంత దూరంలో ఉందన్న దానిని బట్టి ఈ గడియారంలో సమయాన్ని ముందుకు, వెనక్కు మారుస్తూ ఉంటారు. ఇందులో అర్ధరాత్రి 12గంటలు అయ్యిందంటే ప్రపంచం అంతమైపోయినట్లు లెక్క. ఈ క్లాక్ ఏర్పాటు చేసినప్పుడు సమయం రాత్రి 11:53గా పేర్కొన్నారు. ఇక ఆ తర్వాత 1949లో సోవియట్‌ యూనియన్‌ తొలి అణుపరీక్ష చేసినప్పుడు 11:57గా, 1953లో అమెరికా తొలి హైడ్రోజన్‌ బాంబు పరీక్ష చేసినప్పుడు 11:58గా చూపారు. 1991లో ప్రచ్ఛన్న యుద్ధం ముగియడంతో 13 నిమిషాలు వెనక్కు జరిపి 11:43గా మార్చారు. 1998లో భారత్, పాక్‌లు అణ్వాయుధాలను పరీక్షించడంతో 8 నిమిషాలు ముందుకు జరిపి 11:51 చేశారు. 2016లో  వాతావరణ మార్పులు, అణ్వాయుధ పరీక్షలు చేయడంతో 2 నిమిషాలు ముందుకు జరిపి 11:57 దగ్గర సెట్​చేశారు. 2017లో  అణ్వాయుధాల ఆధునికీకరణ, వాతావరణ మార్పులతో మరో 30 సెకన్లు ముందుకు జరిపి11:57:30గా పేర్కొన్నారు. ఇక 2018లో మరో 30 సెకన్లు ముందుకు జరిపి 11:58గా చేయగా, తాజాగా 20 సెకన్లు తగ్గించి 11:58:20గా మార్చారు.

వెలుగు వార్తలకోసం క్లిక్ చేయండి

Latest Updates