గేమింగ్ లోకి రూ.1000 కోట్ల పెట్టుబడులు

న్యూఢిల్లీ: ఇండియన్ గేమింగ్‌‌ ఇండస్ట్రీలోకి 2020 నాటికి 100 మిలియన్ డాలర్ల(రూ.717 కోట్ల) నుంచి 200 మిలియన్ డాలర్ల(రూ.1,434 కోట్ల) వరకు పెట్టుబడులు వచ్చే అవకాశాలున్నాయని ఇండియా గేమ్ డెవలపర్‌‌‌‌ కాన్ఫరెన్స్(ఐజీడీసీ) కన్వీనర్‌‌‌‌ రాజేష్ రావు అంచనావేశారు. ప్రస్తుతం గేమింగ్ ఇండస్ట్రీలో 10 వేల నుంచి 15 వేల మంది పనిచేస్తున్నారని చెప్పారు. ఇండియన్ గేమింగ్ ఇండస్ట్రీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న గేమింగ్ కంపెనీలకు, ఇన్వెస్టర్లకు ఆకర్షణీయంగా ఉందని తెలిపారు. అంతర్జాతీయ కంపెనీలు, ఇన్వెస్టర్లు మన మార్కెట్‌‌పై దృష్టిసారిస్తున్నట్టు చెప్పారు. వచ్చే  ఐదు లేదా ఏడేళ్లలో ఇండియన్ గేమింగ్ మార్కెట్‌‌ టాప్‌‌ 5 ప్లేస్‌‌లోకి వెళ్తుందని రాజేష్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. గేమింగ్ ఇండస్ట్రీలో దేశవ్యాప్తంగా 300 వరకు కంపెనీలున్నట్టు పేర్కొన్నారు. ఈ సంఖ్య పెరుగుతూ ఉందని, మన ఇండియన్ గేమింగ్ కంపెనీలు అంతర్జాతీయ స్థాయిలో ఎదుగుతున్నాయని రాజేష్ తెలిపారు.ఇండియా జాయ్ 2019 ఫెస్టివల్‌‌లో భాగంగా 11వ ఎడిషన్ ఐజీడీసీను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఇండియాలోనే కాక, దక్షిణాషియాలోనే అతిపెద్ద, అత్యంత ముఖ్యమైన డెవలపర్‌‌‌‌ కాన్ఫరెన్స్ ఇది అని చెప్పారు. మొత్తంగా ఈ కాన్ఫరెన్స్‌‌లో 20 నుంచి 22 దేశాలు పాలుపంచుకుంటున్నాయని వెల్లడించారు. వంద మంది స్పీకర్స్‌‌ ఈ కాన్ఫరెన్స్‌‌లో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారని తెలిపారు. ‘బై ది ఇండస్ట్రీ, ఫర్‌‌‌‌ ది ఇండస్ట్రీ’ కోసం ఈ ఈవెంట్ జరుగుతున్నట్టు చెప్పారు.

గేమింగ్, యానిమేషన్ కోసం
సెంటర్‌‌‌‌ ఆఫ్ ఎక్స్‌‌లెన్సీ….

గేమింగ్, యానిమేషన్ కోసం వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ చెప్పారు. చాలా దేశాలు ఇక్కడ ఆఫ్ క్యాంపస్‌‌లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. గేమింగ్, యానిమేషన్ కోసం సెంటర్ ఆఫ్ ఎక్స్‌‌లెన్సీని హైదరాబాద్‌‌లో ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించినట్టు వెల్లడించారు. హైదరాబాద్‌‌లో ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్, టాలెంట్, క్వాలిటీ ఆఫ్ లివింగ్ వంటి అన్ని రకాల సౌకర్యాలను అందజేస్తున్నట్టు వివరించారు. ఇండియాజాయ్ ఫెస్టివల్‌‌లో భాగంగా నజారా టెక్నాలజీస్ లిమిటెడ్‌‌కు చెందిన మనీష్ అగర్వాల్ ఇండియన్ గేమింగ్ స్టార్టప్‌‌లకు 20 మిలియన్‌‌ ఫండ్‌‌ను అందించనున్నట్టు వెల్లడించారు. నజారా టెక్నాలజీస్, 2020 ప్రారంభంలో ఐపీఓకి కూడా వెళ్లబోతుంది. కేపీఎంజీ రిపోర్టు ప్రకారం, ఇండియాలో ఆన్‌‌లైన్ గేమింగ్ ఇండస్ట్రీ 2023 నాటికి రూ.11,900 కోట్ల రెవెన్యూను జనరేట్ చేస్తుందని తెలిసింది. వార్షికంగా ఇది 22 శాతం వృద్ధి సాధిస్తుందని కేపీఎంజీ రిపోర్టు పేర్కొంది. గేమర్ల సంఖ్య , గేమ్ డెవలపింగ్ కంపెనీలు పెరుగుతున్నాయని చెప్పింది.

మోనిటైజేషన్‌‌ బిగ్గెస్ట్ ఛాలెంజ్…

ఇండియన్ గేమింగ్ మార్కెట్‌‌లో మోనిటైజేషన్ బిగ్గెస్ట్ ఛాలెంజ్‌‌గా ఉన్నట్టు ఐజీడీసీలో పాల్గొన్న గేమింగ్ కంపెనీల నిపుణులు చెప్పారు. ఇండియాలో 25 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లున్నారని, ఇతర దేశాలతో పోలిస్తే అత్యధికంగా డేటా వినియోగం ఇక్కడే జరుగుతుందని, దీంతో గేమింగ్ ఇండస్ట్రీ కూడా బాగా పెరుగుతుందని తెలిపారు. యూట్యూబ్‌‌లో గేమ్‌‌లకు సంబంధించిన కంటెంట్‌‌ వినియోగం ఎక్కువగా ఉంటుందన్నారు. ఫాంటసీ స్పోర్ట్స్‌‌ కూడా గణనీయమైన వృద్ధిని సాధిస్తున్నట్టు చెప్పారు. స్కిల్‌‌ బేస్డ్ గేమ్స్ ఎంకరేజింగ్‌‌గా ఉన్నాయన్నారు. 10 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఫాంటసీ గేమ్స్‌‌లను ఆడుతున్నారని, దానిలో ఎక్కువగా క్రికెట్‌‌ ఆడుతున్నారని స్పీకర్స్ చెప్పారు. కేపీఎంజీ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో మూడింట ఒక వంతు మంది మల్టిప్లేయర్  గేమర్స్ (ఒక గేమ్‌‌ను ఒకే సమయంలో ఒకరి కంటే ఎక్కువమంది ఆడటం) ఉన్నట్టు తెలిపారు. 50 శాతం గేమ్స్‌‌ను ఆన్‌‌లైన్ మల్టి ప్లేయర్స్ ఆడుతున్నట్టు చెప్పారు. ఈ గేమ్స్ ద్వారా యాడ్స్ రెవెన్యూ కూడా ఎక్కువగా వస్తున్నాయన్నారు. అయితే క్రికెట్‌‌లో మల్టిప్లేయర్‌‌‌‌ సాధ్యం కాదని స్పీకర్స్‌‌ చెప్పారు.

 

Latest Updates