సాధువుల హత్య కేసులో 101 మంది అరెస్ట్

  • పాల్గాడ్‌ జిల్లాలో సాధువుల హత్యపై
  • క్లారిటీ ఇచ్చిన మహారాష్ట్ర హోం మినిస్టర్‌‌

ముంబై: మహారాష్ట్ర పాల్గాడ్‌ జిల్లాలో జరిగిన మూక హత్యకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు 101 మందిని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిలో ఒక్క ముస్లిం కూడా లేడని ఆ రాష్ట్ర హోం మినిస్టర్‌‌ అనిల్‌ దినేశ్‌ముఖ్‌ బుధవారం ప్రకటించారు. బీజేపీ నేతలు కావాలనే దీనికి మతం రంగు పులమాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ కేసును సీఐడీకి అప్పగించినట్లు చెప్పారు. భయంకరమైన వైరస్‌ను అరికట్టాలంటే ప్రజలు సోషల్‌ డిస్టెంసింగ్‌ పాటించాలని ఆయన సూచించారు. ఈ టైంలో రాజకీయాలు చేయడం కరెక్ట్‌ కాదని అభిప్రాయపడ్డారు. కారులో ముంబై నుంచి సూరత్‌ వెళ్తున్న ఇద్దరు సాధువులు, కారు డ్రైవర్‌‌ను దొంగలుగా భావించిన పాల్గాడ్‌ జిల్లాలోని దబాధి గ్రామ ప్రజలు వారిని అడ్డుకుని దాడికి పాల్పడ్డారు. రాళ్లు, ఇనుప రాడ్లతో కొట్టడంతో చిక్నే మహరాజ్‌ కల్పవృక్షగిరి(70), సుశీల్‌ గిరి మహరాజ్‌ (35), వారి డ్రైవర్‌‌ నీలేశ్‌ తెల్గాడే (30) చనిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులపై కూడా గ్రామస్థులు దాడికి పాల్పడ్డారు. సాధువులను గుర్తించలేక తప్పుగా భావించి దాడి చేశారని, దాన్ని హిందూ – ముస్లిం కోణంలో చూడొద్దని సీఎం ఉద్ధవ్‌ థాక్రే గతంలో చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు పోలీస్‌ ఆఫీసర్లను కూడా సస్పెండ్‌ చేశారు.

Latest Updates