తెలంగాణలో కరోనా మరణాలు 28.. కేసులు 1038

హైదరాబాద్, వెలుగు: సూర్యాపేట వెజిటబుల్​ మార్కెట్‌‌లో విస్తరించినట్టే.. హైదరాబాద్‌‌ మలక్‌‌పేట్‌‌ మార్కెట్‌‌లోనూ కరోనా కలకలం రేపింది. మార్కెట్‌‌లో పనిచేస్తున్న వ్యక్తులు, షాపుల యజమానులు, వాళ్ల కుటుంబ సభ్యులు వైరస్ బారిన పడ్డట్టు సర్కారు వెల్లడించింది. దీంతో నాలుగు రోజులుగా తగ్గుతూ వచ్చిన కేసులు.. గురువారం ఒక్క రోజే 22కు పెరిగాయి. మొత్తం కేసుల సంఖ్య 1038కి చేరింది. మరోవైపు కరోనాతో గురువారం ముగ్గురు మరణించారు. ఇందులో ఇద్దరు మగవాళ్లు, ఒక మహిళ ఉన్నారు. మొత్తం మరణాల సంఖ్య 28కి చేరింది.

ఇద్దరి నుంచి అందరికీ

పహాడి షరీఫ్, జల్‌‌పల్లికి చెందిన ఇద్దరు, మలక్‌‌పేట్ గంజ్‌‌ మార్కెట్‌‌లో పనిచేస్తున్నారు. తొలుత ఈ ఇద్దరికీ పాజిటివ్ వచ్చింది. వీళ్లకు ఎలా వైరస్​ సోకిందో అధికారులు వెల్లడించలేదు. వీరి ద్వారా మార్కెట్‌‌లోని మూడు షాపుల యజమానులకు వైరస్ అంటుకుంది. వారి నుంచి వాళ్ల కుటుంబ సభ్యులకూ సోకింది. పాజిటివ్ వచ్చిన వ్యక్తుల కుటుంబ సభ్యులందరినీ దవాఖాన్లకు తరలించి ఐసోలేట్‌‌ చేశామని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. గంజ్, పహడీ షరీఫ్ ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి, చర్యలు తీసుకుంటున్నామన్నారు. నీలోఫర్‌‌‌‌లో నర్స్‌‌గా పనిచేస్తున్న ఓ మహిళకు నాలుగు రోజుల క్రితం వైరస్ పాజిటివ్ వచ్చింది. గురువారం చేసిన టెస్టుల్లో ఆమె కూతురికి పాజిటివ్ తేలింది.

33 డిశ్చార్జ్‌‌లు

మొత్తం 1,038 మంది పాజిటివ్ వ్యక్తుల్లో 409 మంది ఇది వరకే కోలుకోగా, గురువారం మరో 33 మందిని డిశ్చార్జ్ చేశారు. 568 మంది చికిత్స పొందుతున్నారు. డిశ్చార్జైన వారిలో 50 ఏండ్ల ఓ డాక్టర్ కూడా ఉన్నాడని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని కరీంనగర్, కామారెడ్డి, మహబూబ్‌‌నగర్‌‌‌‌, మెదక్‌‌, భూపాల్‌‌పల్లి జిల్లాల్లో గడిచిన 14 రోజులుగా ఒక్క కొత్త కేసు నమోదు కాలేదని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఈ జిల్లాలు ఆరెంజ్ జోన్‌‌లోకి వెళ్లనున్నాయి. మరో 14 రోజులు కూడా కేసులు నమోదవకపోతే గ్రీన్ జోన్‌‌ జిల్లాలుగా మారతాయి.

ఇకపై పకడ్బందీ చర్యలు

వరుసగా నాలుగైదు రోజుల నుంచి తక్కువ కేసులు నమోదై, గురువారం 22 కేసులు నమోదవడంతో సీఎం కేసీఆర్ పరిస్థితిని సమీక్షించారని మంత్రి ఈటల చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్‌‌ పరిధిలో కేసులు పెరగకుండా చూడాలని సీఎం ఆదేశించారని, దీంతో కంటైన్‌‌మెంట్ జోన్లలో పకడ్బందీ చర్యలు తీసుకోవాలని నిర్ణయించామని తెలిపారు. హైదరాబాద్‌‌లో పర్యటించిన సెంట్రల్ టీం ఇక్కడ చర్యలపై సంతృప్తి వ్యక్తం చేసిందని, గైడ్​లైన్స్​ కచ్చితంగా పాటిస్తున్నామని కేంద్రానికి రిపోర్ట్ ఇచ్చిందని చెప్పారు.

గురువారం మరణించిన వారి వివరాలు

  • రామంతపూర్‌‌‌‌కు చెందిన 48 ఏండ్ల వ్యక్తి. ఇతను బీపీ, షుగర్‌‌‌‌, ఒబేసిటీతో బాధపడుతున్నట్టు సర్కారు ప్రకటించింది. గాంధీ హాస్పిటల్‌‌లో చేరిన 12 గంటల్లోనే ఇతను చనిపోయినట్టు పేర్కొంది.
  • వనస్థలిపురానికి చెందిన 76 ఏండ్ల వృద్ధుడు. గుండె, కిడ్నీ జబ్బుతో బాధపడుతున్నాడు. గాంధీలో చేరిన 24 గంటల్లోనే చనిపోయాడని ప్రభుత్వం ప్రకటించింది.
  • జియగూడకు చెందిన 44 ఏండ్ల మహిళ. ఈమె బీపీ, షుగర్‌‌‌‌తో బాధపడుతోంది. గాంధీ హాస్పిటల్‌‌లో చేరిన 6 గంటల్లోనే ఈమె మరణించిందని సర్కార్ ప్రకటించింది. హాస్పిటల్‌‌కు వస్తున్నప్పుడే వెంటిలేటర్‌‌‌‌పైన వచ్చిందని పేర్కొంది. గాంధీకి రావడానికి ముందు ఆమెకు ఎక్కడ ట్రీట్​మెంట్​ అందించారో వెల్లడించలేదు.

Latest Updates