106 ఏళ్ల అవ్వకు గుండె చికిత్స


హైదరాబాద్‌: గుండె సమస్యతో బాధపడుతున్న వందేళ్లు దాటిన అవ్వ ప్రాణాలు కాపాడారు హైదరాబాద్ వైద్యులు. 106 ఏళ్ల వయసున్న ఆ బామ్మకు విజయవంతంగా యాంజియోప్లాస్టీ నిర్వహించారు. పదిహేను రోజుల క్రితం హైదరాబాద్‌ నల్లగండ్లలోని సిటిజన్‌ ఆసుపత్రిలో చికిత్స చేయగా ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉన్నారు.  వికారాబాద్‌ జిల్లా తాండూరుకు చెందిన నాగమ్మకు గుండె నాళాలు మూసుకుపోవడంతో అత్యవసరంగా హైదరాబాద్‌ నల్లగండ్లలోని సిటిజన్‌ ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు కుడి వైపు కరోనరీ ఆర్టరీలో పూడిక ఉన్నట్లు గుర్తించారు. ఆసుపత్రికి చెందిన ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్టు డాక్టర్‌ కోగంటి సుధీర్‌ యాంజియోప్లాస్టీ ద్వారా పూడిక  ఉన్న ప్రాంతంలో స్టెంట్‌ వేశారు.

సాధారణంగా ఇంత పెద్ద వయసులోని వృద్ధులకు యాంజియోప్లాస్టీ క్లిష్టమైన ప్రకియ. అధిక రక్తపోటు ఇతర సమస్యల వల్ల సాధ్యం కాదు. అయితే నాగమ్మలో ఉన్న పట్టుదల చూసి తమకే ఆశ్చర్యం వేసిందన్నారు డాక్టర్‌ సుధీర్‌. పలురకాల జాగ్రత్తలు తీసుకొని ధైర్యంగా ముందడుగు వేశామని, చికిత్స విజయవంతమవడంతో ఆమె పూర్తిగా కోలుకున్నారని చెప్పారు. చికిత్స సమయంలో అమె వృద్ధాప్యం దృష్టిలో ఉంచుకుని కాళ్లు ముందుకు చాపలేక పోయింది. అందుకే కుడి చేతి నరం నుంచి స్టంట్‌ను అమర్చినట్లు చెప్పారు డాక్టర్‌ సుధీర్‌. మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలేవీ ఆమెకు లేవు. గుండె సమస్య కూడా ఇదే మొదటిసారని వెల్లడించారు ఆయన. దాదాపు మృత్యు ముఖం వరకు వెళ్లిన తనకు డాక్టర్లు కొత్త జీవితం ప్రసాదించారని  సంతోషం వ్యక్తం చేశారు 106 ఏళ్ల నాగమ్మ. 1912లో జన్మించిన నాగమ్మకు 8 మంది సంతానం. ఇంటిలో ఇప్పటికి తన పనులు తానే చేసుకుంటుందటా ఆ అవ్వ. సాధారణ ఆహారమే తీసుకుంటుంది. ఆమె భర్త 1990లో మృతి చెందారు. 65 ఏళ్ల వయసున్న ఆమె కుమార్తె, 70ఏళ్ల వయసున్న కుమారుడు నాగమ్మను ఆసుపత్రికి తీసుకొచ్చి  ఈ చికిత్స చేయించారు.

Posted in Uncategorized

Latest Updates