107 ఏళ్ల బార్బర్.. ఇతన్ని చూసి ఎంతో నేర్చుకోవాలి

పని.. పని.. పని.. 96 ఏళ్లుగా అదే పని. 107 ఏళ్ల వయసులోనూ అదే ఉత్సాహం. అదే అంకితభావం. చేసే పనిమీద ఆయనకున్న అంకితభావం అలాంటిది. ఈతరం జనాలకు ఆయన కచ్చితంగా ఓ ఇన్ స్పిరేషన్ అని చెప్పవచ్చు. ఆయనపేరే ఆంథోనీ మాన్సినెల్లి.

ఆంథోనీ మాన్సినెల్లిది న్యూయార్క్. 107 ఏళ్ల వయసులో బార్బర్ షాప్ నడుపుతున్న వ్యక్తిగా ఆయన అక్కడ ఫేమస్. వందేళ్లు దాటినప్పుడే ఈ పెద్దమనిషి గిన్నిస్ బుక్ లో ఎక్కారు. హెయిర్ కట్ చేసేవారిలో.. ఇపుడు ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయసున్న బార్బర్ కూడా ఆంథోనీ మాన్సినెల్లీనే. న్యూయార్క్ లో ‘ఫెంటాస్టిక్ కట్’ ఫ్యామిలీ హెయిర్ సలూన్ షాపు ముందు.. సెంచరీ సింబల్ కూడా కనిపిస్తుంటుంది.

వయసు సెంచరీ దాటినా.. ఇప్పటికీ వారానికి ఐదురోజులు హెయిర్ కటింగ్ చేస్తున్నారు మాన్సినెల్లి. వారంలో 40 గంటలు పనిచేస్తున్నారు. పదకొండేళ్లప్పుడే హెయిర్ కటింగ్ మొదలుపెట్టారు ఆంథోనీ. తన కుటుంబానికి అండగా.. తనవంతుగా ఆర్థిక సహాయం చేసేందుకు ఈ వృత్తిలోకి దిగానని చెప్పారు. తాను ఓ రికార్డ్ క్రియేట్ చేశానన్న సంగతి కూడా తనకు తెలియదన్న ఆయన.. ఈ వయసులోనూ బార్బర్ గా కొనసాగుతున్నందుకు మాత్రం హ్యాపీగా ఉందని చెప్పారు. “చేస్తున్న పనిని వదిలేయకండి. ఎప్పుడూ బిజీగా ఉండటానికి ట్రై చేయండి. యంగ్ జెనరేషన్ మరింత చురుగ్గా ఉండాలి” అనేదే తాను ఇచ్చే మెసేజ్ అని చెప్పాడు.

69 ఏళ్ల పాటు ఆయనతో గడిపిన భార్య గతంలోనే చనిపోయింది. భార్యపై ప్రేమతో… ఇప్పటికీ ప్రతిరోజూ స్మశాన వాటికలో ఆమె సమాధిని దర్శించుకున్నాకే పనికి వెళ్తుంటారు మాన్సినెల్లి. ఆంథోనీ కస్టమర్లలో సీనియర్ సిటిజన్లు ఎక్కువ. తమకు ఆంధోనీని చూస్తే స్ఫూర్తి కలుగుతుందని.. తాము 70, 80ల్లోనే రిటైర్ అయినా.. ఆయన సెంచరీ పూర్తిచేయడం చాలా గ్రేట్ అని చెప్పారు.

ఆంథోనీ తన బార్బర్ షాప్ తానే ఊడ్చుకుంటారు. కస్టమర్లకు హెయిర్ కట్, షేవ్ చేస్తుంటారు. ఆరోగ్యంగా ఉన్నంతకాలం… సింగిల్ హ్యాండ్ తో షాపు నడుపుతా అంటున్నారు ఆంథోనీ. ఆయన ఆటిట్యూడ్ కు సెల్యూట్ చేయాల్సిందే.

Posted in Uncategorized

Latest Updates