తెలంగాణలో ఒక్కరోజే 107 కరోనా కేసులు.. ఆరుగురు మృతి

  • రాష్ట్రంలో 2,098కిచేరిన కరోనా కేసులు
  • ఆరుగురు మృతి.. ఇందులో ఏడు రోజుల పాప, 4 నెలల బాబు
  • లోకల్​ కేసులు 39.. వలస కార్మికుల్లో 19, ఫారిన్​ రిటర్నీస్​ 49 మందికి వైరస్
  • పాజిటివ్​ కేసుల లెక్కల్లో తేడాలు.. జిల్లాల వారీ వివరాలు ఇయ్యలే
  • మృతులు ఎవరు, ఏ జిల్లా వారన్న వివరాలూ చెప్పలేదు

హైదరాబాద్, వెలుగురాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. బుధవారం ఒక్క రోజే 107 కేసులు నమోదయ్యాయి, ఆరుగురు చనిపోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఇన్ని కేసులు నమోదవడం ఇదే తొలిసారి. ఇందులో సౌదీ అరేబియా నుంచి వచ్చినవాళ్లు 49 మందికాగా, ఇతర రాష్ట్రాల నుంచి తిరిగొచ్చిన వలస కార్మికుల్లో మరో 19 మందికి వైరస్ పాజిటివ్‌ వచ్చింది. మిగతా కేసులు గ్రేటర్ హైదరాబాద్‌ సహా వివిధ జిల్లాల్లోనూ నమోదయ్యాయి. మొత్తంగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్​ సంఖ్య 2,098కి చేరింది. ఇప్పటివరకు 1,321 మంది వైరస్ నుంచి కోలుకోగా.. 714 మంది ట్రీట్​మెంట్​ పొందుతున్నారు. బుధవారం చనిపోయినవారిలో ఏడు రోజుల చిన్నారి, నాలుగు నెలల బాబు ఉండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

రాష్ట్రంలో కరోనాతో మరో ఆరుగురు మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 63కి చేరింది. బుధవారం మృతి చెందిన వారిలో 4 నెలల బాబు, ఏడు రోజుల పాప కూడా ఉన్నారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ మండలం కాసరాబాద్‌ కు చెందిన 4 నెలల బాబు గుండె సమస్యతో హైదరాబాద్‌లోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. మంగళవారం చేసిన టెస్టులో వైరస్ పాజిటివ్ వచ్చింది. ట్రీట్‌మెంట్ కోసం గాంధీకి షిఫ్ట్ చేయగా బుధవారం మధ్యాహ్నం మరణించాడు. ఇక గ్రేటర్ హైదరాబాద్​పరిధిలోని కుత్బుల్లాపూర్​కు చెందిన ఓ మహిళకు నీలోఫర్‌‌లో డెలివరీ అయింది. తల్లి, బిడ్డ ఆరోగ్యంగానే ఉండడంతో డాక్టర్లు డిశ్చార్జి చేశారు. ఇంటికెళ్లిన తర్వాత పాపకు కరోనా లక్షణాలు మొదలయ్యాయి. టెస్టులు చేయిస్తే వైరస్ పాజిటివ్ వచ్చింది. ఇంతలోనే పాప మరణించింది. ప్రసవానికి ముందు చేసిన టెస్టుల్లో పాప తల్లికి కరోనా నెగిటివ్ వచ్చింది. దీంతో హాస్పిటల్‌లోనే పాపకు వైరస్ సోకి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నయి.

జగిత్యాలలో 12 మందికి పాజిటివ్‌

మంచిర్యాలలో నలుగురికి వైరస్ పాజిటివ్ వచ్చింది. ఇందులో ఇద్దరు ముంబై నుంచి రాగా.. ఆ ఇద్దరి నుంచి మరో ఇద్దరికి సోకింది. జగిత్యాల జిల్లాలో మరో 12 మందికి, రంగారెడ్డి జిల్లాలో 6, రాజన్న సిరిసిల్లలో 3, మహబూబ్‌నగర్‌‌, ఖమ్మం, నాగర్‌‌కర్నూల్‌, వికారాబాద్‌, సిద్దిపేట జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైనట్టు ఆయా జిల్లాల అధికారులు ప్రకటించారు.

లెక్కలన్నీ తప్పులే..

కరోనా లెక్కలు వెల్లడించడంలో హెల్త్​ డిపార్ట్​మెంట్​ ఉన్నతాధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. బుధవారం రాత్రి పది గంటల తర్వాత విడుదల చేసిన బులెటిన్‌లో మొత్తం కేసుల సంఖ్య ఎంతన్నది స్పష్టంగా పేర్కొనలేదు. సాయంత్రం ఐదు గంటల నాటికి రాష్ట్రంలో ఇన్‌ఫెక్ట్ అయినవారి సంఖ్య 1,842 అని.. ఇందులో 39 కొత్త కేసులని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి వచ్చినవారిలో 297 మందికి పాజిటివ్‌ వచ్చిందని.. అందులో 68 కొత్త కేసులని పేర్కొన్నారు. దీంతో కొత్త కేసుల సంఖ్య 107 అవుతుండగా.. మొత్తం కేసుల సంఖ్య 2,139 వస్తోంది. అయితే రాష్ట్రంలో మంగళవారం నాటి బులెటిన్‌లో మొత్తం కేసుల సంఖ్య 1,991గా ఉంది. దానికి బుధవారం నాటి 107 కేసులు కలిపితే 2,098 అవుతోంది. అంటే మిగతా కేసులు ఏవి అన్నది గందరగోళంగా మారింది. బులెటిన్​లో లెక్కలు తప్పుగా వచ్చాయని, మొత్తం కేసుల సంఖ్య 2,098గా పరిగణించాలని పబ్లిక్​ హెల్త్​ డైరెక్టర్​ మెసేజ్​ ఇచ్చారు. అయితే ఏ కేసుల లెక్కలో మార్పు చేయాలన్న వివరాలు వెల్లడించలేదు. ఇక హెల్త్​ డిపార్ట్​మెంట్​రోజూ బులిటెన్​లో ఏయే జిల్లాల్లో ఎన్ని కేసులు వచ్చాయన్న వివరాలు ఇచ్చేది. కానీ బుధవారం జిల్లాల వారీగా లెక్కలు, గ్రేటర్​ హైదరాబాద్​ లెక్కలు ఇవ్వలేదు. మృతులు ఎవరు, ఏ జిల్లా వారన్నది కూడా వెల్లడించలేదు.

Latest Updates